ప్రభుత్వ స్కూళ్ళు నిర్వీర్యం

మోడల్‌ ప్రైమరీ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 1752 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 250 పాఠశాలలు కనుమరుగయ్యే అవ కాశం ఉంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం పట్ల మేధా వులు పెదవి విరుస్తున్నారు. మోడల్‌ ప్రైమరీ పాఠ శాలలకు ప్రామాణికంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనావళిని పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయా లు వెల్లడవుతున్నాయి. 30 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను సమీపంలో కిలో మీటరు దూరంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేస్తారు. విలీనం చేయబోయే పాఠశాలలో కనీసం 80 మంది విద్యార్థులకు తక్కువగా ఉండకుండా ఉండాలి. ఇలా పాఠశాలలను కుదించుకుంటూపోతే గ్రామీణ ప్రాంతంలో పేదలు తమ స్వగ్రామాల్లో చదువుకునే అవకాశం కోల్పోతారు. గతంలో వలే ఇతర గ్రామానికి వెళ్లి చదువుకునే రోజులు రాబోతున్నాయి. ఇదిలా ఉండగా త్వరలో జిల్లా పరిషత్తు, మున్సిపల్‌, కార్పొరేషన్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం ట్యాబ్స్‌ సరఫరా చేయాలనే ఆలోచనలో ఉంది.రి దీనిలో భాగంగా ఇటీవల కృష్ణాజిల్లాలోని మొవ్వ, ముసునూరు తదితర జిల్లా పరిషత్‌ పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు శిక్షణ నిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పాఠశాలలను బలోపేతం చేయడానికి ట్యాబ్స్‌లు అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన బిల్లుల సమాచారాన్ని ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో ట్యాబ్‌ కోసం ప్రభుత్వం రూ.7,920 ఖర్చు చేయనున్నట్లు సమాచారం. అంతేగాక త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ నివ్వడం, అనంతరం ఎంపికైన ఉపాధ్యాయుల ద్వారా మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో రోజువారీ పర్యవే క్షణ చేసే అధికార యంత్రాంగం పరిపూర్ణంగా లేక పోవడం, ఉన్న అధికారులు కూడా ఇన్‌ఛార్జులు కావడంతో ఆయా పాఠశాలల నిర్వహణపై పర్యవే క్షణ కొరవడిందనే విమర్శలు వినవస్తున్నాయి. కృష్ణాజిల్లాలో ఐదుగురు డివైఇఓలు ఉండాల్సి ఉంది. ఈ పోస్టుల్లో ఇద్దరు ఎంఇఓలు, మరో ముగ్గురు డైట్‌ సిబ్బంది ఇన్‌ఛార్జులుగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాలో 50 మంది మండల విద్యాశాఖా ధికారులు ఉండాలి. వీరిలో 35 మంది ఎంఇఓలు ఇన్‌ఛార్జులుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాలల పనితీరును పర్యవేక్షించే నాధుడే కరువయ్యాడనే విమర్శలు వినవస్తున్నాయి. రెగ్యులర్‌ ఎంఇఓలను ప్రభుత్వం తక్షణమే నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.