ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు

ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లోని జిల్లా కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో రూపొందించిన 'పాలకుల విధానాలకు అన్నదాతలు బలి' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో జిల్లాలో 162 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నూతన సంవత్సరం జనవరి మాసంలో 25 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సంక్రాంతి పండుగ నుంచి 16 మంది రైతులు బలవన్మరాలకు పాల్పడ్డారని తెలిపారు. రోజు రోజుకూ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వాటిని ప్రభుత్వం ఎందుకు నివారించే చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జిల్లాలో ఏ గ్రామంలో ఏ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వాటి కారణాలను గుర్తించి చిరునామాలతో సహా పుస్తకాన్ని రూపొందించామని తెలిపారు. 1998 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 895 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలపై విశ్లేషించే నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లాలో 2014 సంవత్సరానికి రైతులు పెట్టుబడులు, కుటుంబ పోషణ కోసం బ్యాంకులు బంగారు తాకట్టు రూ. 1800 కోట్లు రుణాలు పొందారన్నారు. పుస్తెలను కూడా బ్యాంకర్లు వేలం వేస్తున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క పెట్టిన పెట్టుబడి రాక రైతులు కూదేలవుతూ దిక్కుతోచని స్థితిలో తనువు చాలిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని కోరారు. ప్రభుత్వం మోసపూరిత వైఖరి వీడాలని హితవు పలికారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భేషరతుగా రూ. 5 లక్షలు తక్షణ సాయంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏక మొత్తంలో రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సాగునీరు అందించే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో రైతులు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం వామపక్ష పార్టీలతో కలిసి రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముట్టడిస్తామని తెలిపారు. అప్పటి స్పందించకపోతే ఉధృత పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్‌, ఒ.నల్లప్ప, జిల్లా కమిటీ సభ్యులు బిహెచ్‌.రాయుడు, బాలరంగయ్య తదితరులు పాల్గొన్నారు.