ప్రభుత్వ భూ దాహం..

శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ప్లాంటుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను కేటాయిస్తూ 2009లో 1107 జీవో విడుదల చేసింది. సర్వేనెంబరు 152/2లో 972 ఎకరాల భూమిని ఎన్‌సిసి లిమిటెడ్‌కు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి కేటాయించింది. పవర్‌ప్లాంట్‌ నిమిత్తం కేటాయించిన ఈ భూమికి చెందిన రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలను, భూమి కోల్పోతున్న రైతులను ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించండి, మీకు వామపక్షాలు అండగా ఉంటాయని ధైర్యం చెప్పడంతో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పవర్‌ప్లాంట్‌కు తమ భూములు ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చేది లేదని ఆ ప్రాంత ప్రజలందరూ ఐక్యమత్యంతో గడిచిన ఆరు సంవత్సరాలుగా రిలే నిరాహార దీక్షలు నేటి వరకూ చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల వద్ద బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. సోంపేటలో తీసుకుంటున్న భూములతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం తీసుకొన్న భూములన్నీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి తమ భూములు తమకు వచ్చేస్తాయని బాధితులు సంబరపడిపోయారు. అయితే చంద్రబాబు భూములు తిరిగి ఇవ్వడం కాదు కదా వాటి ఊసే ఎత్తడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దీనితో బాధితులు చేసేది లేక పోరాడితే పోయేదేముంది మన భూమి మనం సాధించుకోవడం తప్ప అనే నినాదంతో ఉద్యమాన్నే నమ్ముకున్నారు. దీంతో చేసేది లేక ఎట్టకేలకు థర్మల్‌ ప్రాజెక్టు జీవో 1107ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల విజయవాడలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో 329 జీవోను జారీ చేసింది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ నేటితో నెరవేరిందని బాధితులు ఇక నిరాహారదీక్షలు ఉపసంహరించుకోవాలని రాష్ట్రకార్మిక శాఖా మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రకటించడంతో సోంపేటతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా భూ బాధితులు సంబరాలు జరుపుకున్నారు. ఇది థర్మల్‌ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం విజయం అని మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్న తరుణంలో పది రోజులు గడవక ముందే బాధితుల ఆనందం ఆవిరైపోయింది. మొదట్లో థర్మల్‌ ప్రాజెక్టుకు అనుమతినిచ్చిన నాగార్జున నిర్మాణ సంస్థకే తిరిగి భూములను అప్పగిస్తూ ప్రభుత్వం మళ్ళీ మోసపూరిత నిర్ణయం తీసుకొని థర్మల్‌ భూముల్లో బహుళ ఉత్పత్తుల అభివృద్ధి పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల భూములు లాక్కోవడానికి తెలుగుదేశం పూర్తిగా వ్యతిరేకమని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోతామని ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళితులు, పేదలు, చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూములను బలవంతంగా గుంజు కుంటున్నారు. భూ దాహంతో భూ బ్యాంకు ఏర్పాటు చేసి 15 లక్షల ఎకరాల భూమిని సేకరించి విదేశీ బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్‌ శక్తులకు, స్వదేశీ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. భూ సేకరణపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే రైతుల్లో అభద్రతా భావం చోటు చేసుకుంది. మోడీ, చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత రైతులను ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది. భూ సమస్యలపై వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు చేపట్టిన ఉద్యమాలను అందరూ సమర్థించాల్సిన అవసరం ఉంది.
- బళ్ళ చినవీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయకార్మిక సంఘం తణుకు డివిజన్‌ కార్యదర్శి