ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉత్తరాంధ్రకు నీటి కరువు

- పుష్కర లింక్‌, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలి
- రైవాడ రైతులకు అన్యాయం

ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి కొరతకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. పుష్కర లింకు, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం విశాఖ నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంచినీటి సరఫరా సమయం తగ్గించారని, కొండ ప్రాంతాలకు నీరు ఎక్కడం లేదని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ఇతర పరిశ్రమలకు నీరందే పరిస్థితి లేదన్నారు. కొత్త పరిశ్రమలకు నీరు ఇస్తామని రూ.6 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారని, వాటికి నీరు ఎక్కడి నుండి ఇస్తారని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర నీటి 
ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, విశాఖ నగరానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న పోలవరం ఎడమ కాలువ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని తెలిపారు. పోలవరం కాలువకు సమాంతరంగా వచ్చిన పుష్కర ప్రాంతంలో అతి సమీపంలో కలపవచ్చని, ఈ ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది వేసవిలో జిల్లా ప్రజలు తాగు, సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురికాకతప్పదని స్పష్టం చేశారు. 
ప్రస్తుతం విశాఖకు 200 ఎంజిడి నీరు అవసరం ఉందని, కాని 120 ఎంజిడిలతోనే సర్దుకుంటున్నామని తెలిపారు. ఏలేరు నుండి నీటిని వాడుకోమని ప్రభుత్వం చెబుతుందని, కాని ఆ రిజర్వాయర్‌లో నీరు తూర్పుగోదావరి రైతులకు రెండో పంటకు సరిపోతుందని, మరెక్కడ నుండి వాడుకోవాలని ప్రశ్నించారు. అవసరం లేకపోయినా పట్టిసీమను 24 పంపులు పెట్టి లిఫ్ట్‌ల ద్వారా కృష్ణా బ్యారేజీ వరకూ తీసుకెళ్లారన్నారు. గుడ్డిగూడెం ప్రోజెక్టు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా అప్‌ల్యాండ్స్‌కు 3 లక్షల ఎకరాల వరకు నీరు అందిస్తున్నారన్నారు. బచావత్‌ తీర్పు ప్రకారం విశాఖ నగరానికి 400 ఎంజిడిల నీరు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పూర్తి కానుందున ఒక్క బొట్టు కూడా ఉపయోగించలేకపోతున్నామని, ఈ కాలువ పూర్తయితే విశాఖ జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. సుజల స్రవంతిని ప్రాధాన్యత లేని ప్రాజెక్టుగా టిడిపి ప్రభుత్వం చూస్తుందని, కాని ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 3 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖ జిల్లా మంత్రులు వీటి గురించి ఇప్పటి వరకు ఎందుకు ప్రయత్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రులకు తమ సొంత వ్యాపకాలు తప్పా ప్రజాసమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ప్రజావసరాల పేరుతో ఆరు వేల ఎకరాల రైవాడ ఆయకట్టుదారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జివిఎంసి రూ.120 కోట్లు బకాయిలు ఉందన్నారు. రైవాడ జలాశయంలో ఒక టిఎంసిల నీరు వృథాగా పోతుందని, రూ.10 కోట్లతో మరమ్మతులు చేపడితే ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఇరిగేషన్‌ శాఖ విశ్రాంత ఎఇ సిహెచ్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.