ప్రభుత్వ ఏకపక్ష వైఖరి వల్లే విషాదం - సిపిఎం

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే పుష్కర ఘాట్‌లో ప్రజలు తొక్కిసలాటలో చనిపోయారనీ, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనీ, ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, పుష్కరాల్లో మిగిలిన రోజులైనా ఎలాంటి అపశృతీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలోని క్షతగాత్రులు, బంధువులను ఆయన మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వమూ, పోలీసులూ, అధికారుల అతి ప్రవర్తన వల్లే ఇదంతా జరిగిందనీ, నాయకులను కాకుండా ప్రజలను రక్షించాలనీ అన్నారు. శవాగారం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. అక్కడికి వచ్చిన సిఎం కాన్వారును అడ్డగించారు. ముందు నుంచీ తమ పార్టీతోపాటు అనేక మంది చెబుతున్నా ప్రభుత్వంగానీ అధికారులుగానీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారనీ విమర్శించారు. విఐపి ఘాట్‌ ఉండగా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్‌ను ఎంచుకోవడం ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందన్నారు. 20 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారని చెబుతున్నా వారంతా నాయకులు, అధికారుల రక్షణకే పరిమితమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టిఎస్‌.ప్రకాష్‌, టి.అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.