ప్రభుత్వాలు పాలించాలా? శాసించాలా?

''మానవుడు స్వేచ్ఛగా జన్మించి తర్వాత సంకెళ్ళలో బంధింపబడతాడు'' అని ఓ తత్వవేత్త ఉడ్రోవిల్సన్‌ అంటాడు. ఇది నేటికీ నిజమే! స్వేచ్ఛాయుతమైన జీవనం గడిపేందుకు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. స్వేచ్ఛ అంటే ఎదుటి వారికి హాని కలిగించని ఏ పనైనా చేసుకునే వెసులుబాటు అని చిన్నప్పుడు మాస్టారు చెప్పారు. ఇప్పుడది అర్థం మారి ప్రభుత్వం చెప్పినట్టు వింటేనే స్వేచ్ఛ, లేదంటే ధిక్కారం అంటున్నారు. రాజ్యం ఏర్పడింది సమాజ శ్రేయస్సుకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మాత్రమే. ప్రభుత్వాలు ఏర్పరచుకున్నది ప్రజలను పాలించడానికే కానీ శాసించడానికి కాదు. పాలించడం, శాసించడం మధ్య చాలా వ్యత్యాసముంది. పాలించడమంటే ప్రజలకు వారివారి జీవన విధానాలక నుగుణంగా సౌకర్యాలు, వసతులు కల్పించడం, మెరుగైన జీవనం కోసం సమిష్టిగా చేయవలసిన కషి గురించి తెలియజేయడం. శాసించడమంటే ప్రభుత్వం లేదా రాజు తమ ఆలోచనా విధానాన్ని ప్రజలపై రుద్దటం, వ్యక్తిగత ఆచారాలను బలవంతంగా హరించడం. ఇంపైనది భుజించడం, నివాసమేర్పరచుకోవడం, సౌకర్యమైన దుస్తులు ధరించడం, నచ్చిన సంస్కతిని ఆనందించడం పూర్తిగా వ్యక్తిగత విషయాలు. కానీ నేటి ప్రభుత్వాలు వీటన్నింటిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రజలను పాలిస్తున్నట్టా లేక శాసిస్తున్నట్టా?
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, తదితర రాష్ట్రాల్లో పశువుల మాంసం తినడంపై, అమ్మాయిలు ధరించే దుస్తులపై, చూసే సినిమాలపై, చదివే వార్తలపై ప్రభుత్వాలే పరిమితులు విధిస్తున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒకానొక సందర్భంలో జంతు ప్రేమికులంతా స్వామి వివేకానందుని దగ్గరకెళ్ళి ''అయ్యా మీలాంటి మహానుభావులు ఆదేశిస్తే మనుషులంతా మాంసాహారం మానేస్తారు'' అని అడిగారట. దానికి సమాధాన మిస్తూ వివేకానందుడు ''నేను మానవతావాదిని, నా మనిషి బ్రతికుండేందుకు ఏది భుజించినా నాకు అభ్యంతరం లేదు'' అంటారట. శాకాహారం అనే భావన అధునాతన కాలంలో అభివద్ధిలోకి వచ్చింది. పురాతన కాలమంతా కుల, మతాలకతీతంగా దేహపుష్టి కోసం మాంసాహారమే భుజించేవారని చరిత్ర చెబుతున్నది. ఈ నెలలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జైనుల పండుగలున్నాయంటూ మాంసాహారాన్ని నిషేధించింది. పక్కింట్లో పండగుందని నన్ను ఉపవాసముండమని ఆదేశించడం ఎంతవరకు సమంజసం. భారతదేశంలో అనేక మతాలు, కులాలు, సంప్రదాయాలున్నాయి. అంతేగాక మాంస విక్రయాలు నిషేధిస్తున్నప్పుడు, ఆ విక్రయదారులకు కలిగే నష్టాలు ప్రభుత్వం భరిస్తుందా? ప్రత్యామ్నాయ వత్తి కల్పిస్తుందా? ఇందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? ఇలాంటివేవీ చేయకుండా ప్రజలను శాసించే హక్కు ప్రభుత్వానికి లేదు.
ఈ రకమైన నిషేధాలు జైనులపై ప్రేమతోనో లేక జంతువులపై ప్రేమతోనో కాదు. ప్రజల్లో నిగూఢంగా ఉన్న సెంటిమెంటును రేకేత్తించడమే వీరి అసలు ఉద్దేశం. గోవు పవిత్రమైనదని, అది హిందూ సంప్రదాయానికి ప్రతీక అని, ఎక్కువ మంది హిందువేతరులే పశు మాంసం తింటున్నారని చెప్పకనే చెబుతూ రెచ్చగోట్టేందుకే ఈ తతంగమంతా జరుగుతున్నది. ప్రజలకు కేన్సర్‌ కలిగించే ఉత్పత్తులను నిషేధించకుండా ముడుపులు వెనకేసుకుని ఆరోగ్యానికి హానికరమంటూ చిన్న ప్రకటనలతో సరిపెట్టే ప్రభుత్వాలు వల్లిస్తున్నది ప్రజా శ్రేయస్సు కోసమని ఎలా నమ్మాలి? నిరంతరం ఆక్సిజన్‌ను ఉత్పత్తిచేస్తూ ఇటు మానవాళికీ, అటు ఓజోన్‌ పొర క్షేమానికి ఉపయోగపడే ఆకులు, అలాలు తిని స్వీయ నష్టం కలిగించుకునేందుకు బదులు మాంసహారమే మేలని కొందరు వాపోతుంటారు. మాంసం విక్రయం, వినియోగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు అంతర్జాతీయ సమాజంలో మన దేశం అప్రతిష్ట పాలౌతుందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొన్నది. ఇది నిజం. ఎందుకంటే ఆంక్షలున్న చోట స్వేచ్ఛ ఉండదని అందరూ భావిస్తారు. ఒకవైపు సరళీకరణ పేర మన ఆర్థిక సంపదను ఇతరులు కొల్లగొట్టటానికి ఆంక్షలన్నీ ఎత్తేసి ప్రజలకు ఆదాయం లేకుండా చేస్తున్నారు మరోవైపు మనకు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజల కిచెన్‌లోకి, బెడ్‌రూమ్‌లోకి, చివరకు మెదడులోకి దూరి ఇబ్బంది పెట్టే విష సంస్క తిని ప్రభుత్వాలు విడనాడాలి.
- జి తిరుపతయ్య
(వ్యాసకర్త ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు)