ప్రపంచీకరణ రెండవ అవతారం..

క్రెడిట్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చి (సిఎన్‌ఐఆర్‌) తన తాజా నివేదికలో 'ప్రపంచీకరణ' భవిష్య త్తుపై అనేక ఆలోచనలు మన ముందుంచింది. ప్రపంచీకరణను సిఎన్‌ఐఆర్‌ రెండు ప్రధాన స్రవంతులుగా అభి వర్ణించింది. ఒకటి, ఐరోపా దేశాల్లో, అమెరికాలో ప్రధానంగా 1870లో ప్రథమ ప్రపంచీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంలో రైలు, రోడ్డు, నౌకాశ్రయాలు నిర్మితమయ్యాయి. సూయజ్‌ కెనాల్‌ నిర్మాణం జరిగింది. ప్రపంచ వాణిజ్యానికి తోడ్పడి పారిశ్రామిక విప్లవ ప్రతిఫలంగా అమెరికా బలపడింది. కార్పొరేట్‌ సంస్థలకు తోడ్పడే బ్యాకింగ్‌ వ్యవస్థ పటిష్టతకు నాందీ పలికింది. మొదటి ప్రపంచయుద్ధ ప్రారంభంతో 1914తో ప్రథమ ప్రపంచీకరణ శకం ముగిసింది. రెండది, ప్రపంచీకరణ మరలా రెండవసారి 1990లో పరోక్ష యుద్ధం ముగిసి సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరప్‌ దేశాల్లో సోషలిజం అంతమొందటంతో కొత్త మార్కెట్ల అన్వేషణకై తూర్పు మార్గాన్ని అన్వేషిస్తూ ప్రారంభించబడింది. ఈ ద్వితీయ ఘట్టంలో అమెరికా కార్పొరేషన్లు బలోపేతమయ్యాయి. యూరో కరెన్సీ ఉద్భవించి యూరప్‌ దేశాల ఆర్థికవ్యవస్థలను శాసించింది. సరళీకృత ఆర్థిక విధానాలతో, మారిన మార్కెట్లతో చైనా ఆర్థికవ్యవస్థ పురోభివృద్ధి సాధించింది. దీనికి తోడు భారత్‌, బ్రెజిల్‌, రష్యా, టర్కీ, ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రవర్థిత ఆర్థికవ్యవస్థ ప్రారంభమైనట్లు ప్రకటించింది. సిఎస్‌ఐఆర్‌ ఉదహరించిన ఈ క్రింది మూడు దిశల్లో ప్రధానంగా ఒక దిశకు ప్రపంచీకరణ మారవచ్చని అభిప్రాయపడుతుంది.
బలపడనున్న ప్రపంచీకరణ
ప్రపంచీకరణ ఇంకా ముందుకు సాగే అవకాశాలున్నాయి. గత మూడు శతాబ్దాలుగా శాసిస్తున్న అమెరికా డాలర్‌ ఆధిపత్యంతో విదేశీ కరెన్సీ మార్పిడిలు ముందుకు సాగుతాయనీ, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు బలపడతాయనేది ఒక వాదన. ఈ దిశలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పుంజుకోవచ్చని అంచనా. శరణార్థులకు ద్వారాలు తెరుస్తూ, ప్రజాస్వామ్యం వర్థిల్లుతూ ముందుకు సాగవచ్చని అభిప్రాయం. ప్రపంచ ప్రజలంతా కలిసి జీవించే అవకాశాలు ఉంటాయనేది ఈ వాదన సారాంశం.
బహుళ ధృవ ప్రపంచం
ఏక ధృవ ప్రపంచానికి చెల్లుచీటీ అయి, బహుళ ధృవ ప్రపంచాలు ఏర్పడే అవకాశాలున్నాయనేది మరో వాదన. ఈ ధృవాలు అమెరికా, ఐరోపా, ఆసియాల్లో కేంద్రాలుగా పనిచేస్తాయనీ, వాణిజ్యం నెమ్మదిగా ముందుకు సాగుతుందనేది సారాంశం. ఆర్థిక కేంద్రాలతో పాటు ప్రాంతీయంగా ఉద్భవించే కరెన్సీలతో ఈ వ్యవస్థలు మరింత ముందుకు సాగుతాయి. తద్వారా ప్రాంతీయ నాయకత్వాలు ఎదిగి అంతర్జాతీయ బహుళజాతి కార్పొరేట్లకు ప్రత్యామ్నాయ నిర్మాణం ఈ దిశ లక్ష్యం. సాంకేతిక నైపుణ్యాలతో గ్రామీణ, పట్టణ శ్రమశక్తి అభివృద్ధి చెందుతుంది.
ప్రపంచీకరణకు స్వస్తి
దేశాల మధ్య సహకారం తగ్గుతుంది. దేశాల స్వదేశీ వాణిజ్య రక్షణలు ఏర్పడతాయి. స్వదేశీ ప్రాతిపదికన ఉత్పత్తి కొనసాగించబడుతుంది. కరెన్సీ ఆధిపత్య యుద్ధాలు చోటుచేసుకోవచ్చు. ప్రపంచకీకరణ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతాయి. ప్రజాస్వామ్యాలు తిరోగమనంలోకి వెళ్లవచ్చు. శరణార్థులు తగ్గి పేదరికం కొనసాగించవచ్చు. ప్రాంతీయ యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరగవచ్చు. చివరకు సూపర్‌ పవర్స్‌ మధ్య మిలిటరీ యుద్ధాలకు దారితీయవచ్చును. సంపదలో అసమానతలు, వాణిజ్య ఆంక్షలు ఏర్పడి ప్రపంచీకరణకు అడ్డుకట్ట వేస్తుంది.
కార్పొరేట్ల ఆధిపత్యం
ప్రపంచీకరణకు కాలం చెల్లిందని సిఎన్‌ఐఆర్‌ చెబుతూనే కార్పొరేట్‌ సంస్థలనూ, సరళీకృత ఆర్థిక విధానాలనూ బలపరచడం ప్రస్తుత సమస్యలకు పరిష్కారం కాజాలదు. ప్రపంచీకరణ వివిధ దేశాలను కలుపుతూ వాణిజ్య, ఆర్థిక, మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌, కమ్యూనికేషన్‌, సాంస్కృతిక రంగాలలో సహాయ తోడ్పాటులను ఇచ్చుపుచ్చుకోటానికి అని చెపుతున్నప్పటికీ ఆచరణలో కార్పొరేట్‌ సంస్థలకూ, కొద్దిపాటి అగ్ర దేశాలకు మాత్రమే ఉపయోగకారియై ప్రపంచ దేశాల మధ్య, ప్రపంచ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను మరింత వ్యత్యాసాలకు గురిచేసిందనే విషయం నిర్వివాదాంశం. ఈ సంవత్సరపు ప్రపంచ సంపద 2లక్షల 50 కోట్ల డాలర్లలో 45.2 శాతం సంపద 0.7 శాతం అధిక ధనవంతుల చేతుల్లోకి వెళ్లినట్లు స్విస్‌ క్రెడిట్‌ తెలియజేసింది. 3 కోట్ల 40 లక్షలుగా ఉన్న ఈ ధనవంతుల్లో మరలా లక్షా 23 వేల మంది మాత్రమే కీలకం. వీరు కార్పొరేట్ల అధిపతులుగా, బ్యాంకు యజమానులు గా ప్రపంచ పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వాలను, ఆర్థిక నిర్ణయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. కాగా 71 శాతం ప్రపంచ వయోజనులు కేవలం మూడు శాతం ప్రపంచ సంపదతో 10 వేల డాలర్ల లోపు వార్షికాదాయంతో ఉన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక అసమానతలను తెలియజేస్తుంది. రిటైల్‌ వ్యాపార అగ్రగామి సంస్థ వాల్‌మార్ట్‌, మిగతా రిటైల్‌ స్టోర్స్‌లో విక్రయిస్తున్న ఆహార, బ్రెవరీస్‌ ఎన్ని బ్రాండ్ల పేరుతో ఉన్నా అవన్నీ ఏదో రకంగా కేవలం 10 కార్పొరేట్‌ సంస్థలవే కావటం గమనార్హం. ఇవి: నెస్లే, పి అండ్‌ జి, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మార్స్‌, యూనిలివర్‌, కోకోకోలా, క్రాఫ్ట్‌, పెప్సికో కెల్‌గోగ్స్‌, జనరల్‌ మిల్స్‌.
అనగా ప్రపంచీకరణ ఏకపక్షానికి, కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యానికి నిదర్శనం. పైగా అగ్ర శ్రేణి 500 కార్పొరేట్‌ సంస్థలు ప్రపంచాన్నే శాసిస్తూ కేవలం ఆరున్నర కోట్ల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. అధిక లాభాలతో పేరుకుపోతున్న కేంద్రీకృత అదనపు విలువకు పాకులా డుతూ, కర్మాగారాల్లో ఆటోమొటేషన్‌ పెంచుతూ, సిబ్బం దితో ఎక్కువ పని చేయించుకుంటూ కోట్లాది మంది యువతీయువకులను నిరుద్యోగులుగా రిజర్వులో ఉంచటం ద్వారా పోటీతత్వంతో వేతనాల బేరసారాలకు ఉపయోగించుకుంటున్నాయి. కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసం, ముడిచమురు, తదితర ముడిసరుకుల కోసం ప్రజాస్వామ్యం పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, లిబియా, సిరియా, ఎమెన్‌ దేశాలపై యుద్ధాలు ప్రకటించి ప్రపంచ అశాంతికి, అరాచకత్వానికి, శరణార్థుల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ప్రపంచీకరణతో పెరుగుతున్న కాలుష్యం
మరొక వైపు ప్రపంచీకరణ ద్వారా తీవ్ర పర్యావరణ కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ పర్యావరణం, కాలుష్యం గురించి ''పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లో చిన్న మైనారిటీగా ఉన్న పెట్టుబడిదారుడు ఎక్కువ లాభా ర్జన కోసం మార్కెట్‌ పోటీలకు పాకులాడుతూ తన ఆధీనంలోని ఉత్పత్తి సాధనాలను నియంత్రిస్తాడు. ఈ వ్యవస్థ పెట్టుబడిదా రుని లాభాలను పెంచడానికి తక్కువ వ్యవధిలో లాభార్జనే ధ్యేయంగా దీర్ఘకాలిక ప్రణాళికలను, ఆలోచనలను విస్మరిస్తూ ప్రకృతి, పర్యావరణాన్ని నాశనం చేస్తాడు'' అన్నారు. అంతర్జాతీయంగా పరిశ్రమలు నెలకొల్పిన బహుళజాతి కంపెనీలన్నీ 1980 దశకం నుంచి లాభార్జన బాటలో పడ్డాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభార్జనే ధ్యేయంగా, దీర్ఘకాలిక ప్రణాళికలను ఉత్పత్తి రంగంలో కనుమరుగుచేశాయి. తద్వారా ఉత్పత్తి రంగంలో పోటీని నిలబెట్టుకోవటానికి మోసపూరితంగా నాణ్యతకు తిలోదకాలిచ్చే ఆలోచనలు ఉద్భవించాయి. 
తాజాగా కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఫోల్క్స్‌ వాగెన్‌ కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఇందుకు ఉదాహరణ. 2008లో విధించిన యూరో-5 నిబంధనలలో నైట్రోజన్‌ ఆక్సై డ్స్‌ ఒకటి. ఒక ఘనపు క్యూబిక్‌ మీటరు వాయువులో కార్ల నుంచి వెలువడే నైట్రోజన్‌ ఆక్సైడ్స్‌ 80 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదనేది నిబంధన. లేబరేటరీల్లో ఈ పరిమితుల్లో ఉండే కాలుష్యాన్ని చూపుతూ ఫోల్క్స్‌ వాగెన్‌ డీజిల్‌ కార్లలో సాఫ్ట్‌వేర్‌ను ఒక ట్రిక్‌ ద్వారా నియంత్రించుకుంటూ, మభ్యపెడుతూ 2009 నుంచి ఇప్పటి వరకూ జెట్టా, బిటిల్‌, గోల్ఫ్‌, ఆడి3 మోడల్స్‌ లక్షలాది డీజిల్‌ కార్లను మార్కెట్‌లో అమ్మగలిగింది.
నైట్రోజన్‌ ఆక్సైడ్స్‌ వల్ల పర్యావరణంలో పెనుమార్పులు సంభవించి మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ఉపరితలంపై విపరీతమైన పొగ, ఊపిరితిత్తుల కేన్సర్‌, శ్వాసకోశ వ్యాధులు, దృష్టి క్షీణత, గ్లోబల్‌ వార్మింగ్‌తో ఉష్ణోగ్రత పెరుగుదల, విషవాయువులు ఏర్పడటం, ఆమ్ల వర్షాలు, నీటి కాలుష్యం వంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి. ఒకవైపు తక్కువ కాలంలో అధిక లాభాల కోసం బహుళజాతి కంపెనీలు పాకులాడుతూ కర్మాగారాలూ, వాహనాలూ విసర్జించే కాలుష్య వాయువుల వల్ల మానవాళి ఆరోగ్యంపై కేన్సర్‌ లక్షణాలు కనబడటం మనం గమనిస్తున్నాం. 
ఈ నేపథ్యంలో జరగనున్న 13 దేశాల ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) ఒప్పందంలో భాగంగా అమెరికా తన ఫార్మసీ కంపెనీలు తయారుచేస్తున్న కేన్సర్‌ నిరోధక అవస్థిక వంటి మందులకు 12 సంవత్సరాల వరకూ ధరలు తగ్గకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ అధిక లాభాలకు ప్రయత్నిస్తున్నది. మరొకవైపు ప్రపంచీకరణలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు పెరిఫరీ దేశాలలో పెడుతున్న షరతులతో విద్య, వైద్యం, ఆరోగ్యంపై ప్రభుత్వాలు పెట్టే ఖర్చులకు సాంఘిక కోతలను ప్రతిపాదిస్తూ ఆర్థిక అసమానతలకు కారణమవుతున్నాయి. పెరిఫరీ దేశాల నుంచి కోర్‌ దేశాలకు మేధోశక్తి వలసల ద్వారా దేశాల స్వావలంబన కుంటుబడుతోంది. పెరిఫరీ దేశాల్లోని వస్తు తయారీకి కావలసిన పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ నోహౌలు వృద్ధిచెందటం లేదు. సామ్రాజ్యవాద కార్పొరేషన్లకు అనుకూలించే ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం సమసమాజ సోషలిస్టు ఆర్థికవ్యవస్థ మాత్రమే కాగలదు.
- బుడ్డిగ జమిందార్‌
(వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు)