ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వాడివేడి చర్చ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్‌ సభ్యులు ఉభయ సభల్లో చేసిన డిమాండ్లతో మంగళవారం పార్లమెంటులో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా రాజ్యసభలో వాడివేడి చర్చ చోటు చేసుకొంది. విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సభ్యులంతా ప్రభుత్వ తీరుపై గళమెత్తారు. చర్చలో సి.ఎం.రమేశ్‌ (తెదేపా) పాల్గొంటూ- కాంగ్రెస్‌ పార్టీ హడావుడిగా, అశాస్త్రీయంగా విభజన చట్టాన్ని రూపొందించిందని ఆరోపించారు. తెదేపా మొదటి నుంచీ పోరాడుతున్న అంశంపై ఎట్టకేలకు కాంగ్రెస్‌ నేతల్లో అవగాహన వచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా కల్పించడంలో పురోగతి ఏమిటో తెలపాల్సిందిగా ఆజాద్‌ నిలదీశారు. అయిదేళ్లపాటు ఈ హోదా ఇవ్వాలని మొదట భావిస్తే... పదేళ్లపాటు ఇవ్వాలని భాజపా డిమాండ్‌ చేసిందనీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదికైనా ఇవ్వడం లేదన్నారు.