ప్రత్యేక వంచన పర్యవసానం..

ప్రత్యేక హోదాకు ఏవో రాజ్యాంగ అవరోధాలు ఉన్నాయనేది అర్థ రహితమైన వాదన. పార్లమెంటు ఆమోదిస్తే తప్పక మంజూరు చేయొచ్చు. ప్యాకేజీల వంటివి ప్రభుత్వమే ఇవ్చొచ్చు. ఇటీవలే ఎన్నికలు జరిగే బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు భారీ నిధుల కేటాయింపు ప్రకటించారు. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌కూ ఇవ్వొచ్చు. కాకపోతే బిజెపి రాజకీయ లెక్కలే ఆటంకమవుతున్నాయి. గతంలో తెలంగాణ ఇచ్చి ఓట్లు పొందాలని భంగపడిన కాంగ్రెస్‌లాగే ఇప్పుడు బిజెపి కూడా ఎన్నికల ముందు ప్రకటిస్తే తమకు లాభం అనుకుంటున్నదనేది ఒక వాదన. 
              పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, విశ్వాస రాహిత్యానికి పాల్పడితే ప్రజలు ఎంతగా గాయపడతారో ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు ప్రత్యక్షంగా చెబుతున్నాయి. వివిధ ప్రతిపక్షాల నాయకత్వంలో జిల్లాల నుంచి ఢిల్లీ దాకా రకరకాల ఉద్యమాలు, ఆందోళనలు, సభలు, సదస్సులు ఒకవైపున జరుగుతున్నాయి. మరోవైపున ప్రత్యేక హోదాను ప్రత్యేక వంచనగా మార్చివేసిన బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్నది. తాము మోసపోయామనే భావన ప్రతి ఒక్కరిలో వ్యాపించింది. ఆఖరుకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మంత్రులు కూడా ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపే పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదాకు అవకాశం లేదని కుండ బద్దలు కొట్టి చెబుతుంటే సన్నాయి నొక్కులతో, నామకార్థపు ప్రకటనలతో సరిపెట్టుకునే దుస్థితిలో తెలుగు దేశం నాయకత్వం చిక్కుకు పోయింది. ఈ విషయమై తిరుపతిలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలో ఒక యువకుడు ఆత్మాహుతికి ప్రయత్నించడం ఈ పరిణామ క్రమంలో బాధాకరమైన మరో ఘట్టం. కొన్నేళ్ల కిందట సమైక్య రాష్ట్రంలో చూసిన ఆత్మాహుతి ధోరణి పునరావృతం కావడం నిజంగా ఆందోళనకరం, అవాంఛనీయం. పోరాడి కోర్కెలు సాధించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు. అయితే తాము నమ్మిన రాజకీయ పక్షాలు, నమ్మించిన ప్రభుత్వాలు నయవంచనకు పాల్పడ్డాయనే బాధావేదనలు అపరిపక్వ మనస్కులను ఒక్కోసారి ఇలాటి అఘాయిత్యాల వైపు నెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ ధోరణులు సరికాదని చెబుతూనే అందుకు మూల కారణమైన రాజకీయ అవకాశవాదాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఖండించడం మరింత ముఖ్యం.
రాష్ట్ర విభజన నినాదం తెచ్చింది ప్రధానంగా టిఆర్‌ఎస్‌ అయితే ముఖ్య కర్తలు అప్పటి కాంగ్రెస్‌, బిజెపి, తెలుగు దేశం పార్టీలే. ఇందుకోసం వారు ఎన్నెన్ని విన్యాసాలు చేశారో అంతా చూశారు. విభజన బిల్లు ఆమోదం సమయంలో రాజధాని రహిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇస్తామని సభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లిఖితపూర్వక హామీ నిచ్చారు. అది తామే సాధించామని బిజెపి వెంకయ్యనాయుడు టముకు వేసుకున్నారు. పైగా వారు అయిదేళ్ల ప్రత్యేక హోదా అంటే కాదు పదేళ్లు ఉండాలని వీరు పట్టుపట్టారు. తమ ఎన్నికల ప్రచారంలో బొమ్మలు వేసుకుని మరీ ఇది తమ గొప్పతనంగా ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ విషాదం జరిగిన తిరుపతిలోనే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ నాడు ప్రధాని అభ్యర్థిగా వచ్చి పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబుల సమక్షంలో విభజితాంధ్రప్రదేశ్‌కు వాగ్దాన వరాలు గుప్పించారు. వాటిని విశ్వసించిన ప్రజలు తెలుగుదేశం-బిజెపి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కేంద్ర, రాష్ట్రాలలో ఉభయ పక్షాలూ జట్టుకట్టాయి. ఇంత జరిగిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో వెనక్కుపోవడం రాజకీయ విశ్వసనీయతకు చెప్పరాని విఘాతం. నిరంతరం రామ జపం చేసే పార్టీ ఒక మాట, ఒక బాణం అన్న నీతిని నిలువునా పాతిపెట్టడం సహజ నైజానికి నిదర్శనం.
ప్రత్యేక హోదాకు ప్రణాళికా సంఘం గత విధానం అడ్డంకి అంటున్నారు గాని ఇప్పుడా సంఘమే లేదు! పైగా విభజనానంతర రెవెన్యూ లోటు (వారి లెక్క ప్రకారమే ఏడాదికి రూ.15 వేల కోట్లు) భర్తీకి నిధుల కేటాయింపునకు ఎలాటి ఆటంకాలు అసలే లేవు. అయినా ఇంతవరకూ 15 మాసాలు గడిచినా విదిలింపులు తప్ప కేటాయింపులు లేవు. ప్రత్యేక హోదా మంజూరులో సమస్యలుంటాయి గనక ఆ ప్రయోజనాలు మరో విధంగా కలిగించినా ఫర్వాలేదని ముఖ్యమంత్రితో సహా అందరూ ముందే తలవంచారు. సింగపూర్‌ పరిభ్రమణంపై చూపిన శ్రద్ధలో శతాంశమైనా ఢిల్లీ నుంచి రావలసిన వాటిపై పెట్టింది లేదు. సాక్షాత్తూ వెంకయ్యనాయుడే హోదాపై సందేహాలు లేవనెత్తిన తర్వాతనైనా గట్టిగా నిలదీసింది లేదు. పైగా సుజనా చౌదరి వంటి వారి మంత్రులే మరో వైపు నుంచి కేంద్రాన్ని వెనకేసుకురావడానికి పోటీలు పడ్డారు.
లక్షల కోట్ల సాయం అడిగితే అన్ని లెక్కలూ కలిపి పది వేల కోట్ల లోపు మాత్రమే ఇచ్చిన కేంద్రం పరిశీలిస్తామని, ఆదుకుంటామని మొక్కుబడి ప్రకటనలు మాత్రం విడుదల చేసింది. అయినా సరే గోరంత కేటాయింపును కొండంతగా చూపించి మురిసిపోయారు. అప్పటి నుంచి మొన్న కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌ వ్యాఖ్యల వరకూ అన్నీ తిరస్కరణలే. రాజ్యసభకు పంపిన నిర్మలా సీతారామన్‌ నిక్కచ్చిగా నిరాకరణ స్వరమే వినిపించారు తప్ప సానుకూల సూచన ఒక్కటంటే ఒక్కటి లేదు. అయినా సరే ఆ మాటలకు మహత్తర అర్థాలు చూపిస్తూ వంతపాడారు రాష్ట్ర నేతలు. రాష్ట్రానికి రావలసింది రాబట్టుకోవడానికి పట్టుపట్టింది లేదు. ఒత్తిడి తెచ్చింది లేదు. ఇదేదో బిజెపికీ, తమకూ మధ్య వ్యవహారంగా సరిపెట్టుకోవడం తప్ప విశాల ప్రజానీకానికి వాస్తవాలు చెప్పింది లేదు. ఇతర పక్షాలను విశ్వాసంలోకి తీసుకున్నదీ లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా అఖిలపక్షం పిలవడం గానీ, ఢిల్లీకి ప్రతినిధివర్గంగా వెళ్లాలనే ప్రతిపాదన గానీ రానేలేదు. పైగా ఇస్తామంటున్నారు కదా అని, రాజీనామాలు చేస్తే అయిపో తుందా అని ఎదురుదాడి చేశారు. వారే అలా అంటున్నప్పుడు కేంద్రం మరింత చులకన చేయడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనే చేయకుండా దాగుడుమూతలను ప్రోత్సహించడంలో విచిత్రం ఏముంది?
పైగా కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకపోగా గతంలోని కాంగ్రెస్‌పై దాడి ఎక్కుపెట్టారు. వారి బాధ్యత ఉందనేది నిజమే అయినా ఇప్పుడూ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. పార్లమెంటులో అన్ని పార్టీలూ బలపరుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా బహిరంగంగా వ్యతిరేకించింది లేదు. అలాటప్పుడు మోడీ ప్రభుత్వం అందరితో సంప్రదించి హోదా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవలసింది పోయి కేంద్ర మంత్రులు సైంధవ పాత్ర స్వీకరించడంలో ఆంతర్యం ఏమిటి? దానికి తెలుగుదేశం పరోక్ష మద్దతు ఇవ్వడం ఏమిటి? మొదట్లో వైఎస్‌ఆర్‌ పార్టీ కూడా దీనిపై ఒకింత ఉదాసీనంగా ఉన్నా ఇటీవల పోరాటం మొదలు పెట్టింది. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ అనేక వేదికలు ఇందుకోసం ఆందోళన చేస్తున్నాయి. అయినా కేంద్రం కళ్లు తెరవడం లేదు.
ప్రత్యేక హోదాకు ఏవో రాజ్యాంగ అవరోధాలు ఉన్నాయనేది అర్థ రహితమైన వాదన. పార్లమెంటు ఆమోదిస్తే తప్పక మంజూరు చేయొచ్చు. ప్యాకేజీల వంటివి ప్రభుత్వమే ఇవ్చొచ్చు. ఇటీవలే ఎన్నికలు జరిగే బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు భారీ నిధుల కేటాయింపు ప్రకటించారు. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌కూ ఇవ్వొచ్చు. కాకపోతే బిజెపి రాజకీయ లెక్కలే ఆటంకమవుతున్నాయి. గతంలో తెలంగాణ ఇచ్చి ఓట్లు పొందాలని భంగపడిన కాంగ్రెస్‌లాగే ఇప్పుడు బిజెపి కూడా ఎన్నికల ముందు ప్రకటిస్తే తమకు లాభం అనుకుంటున్నదనేది ఒక వాదన. ఏది ఏమైనా మోడీ ప్రభుత్వం రాజకీయ కోణంలోనే ఇచ్చిన మాట తప్పుతున్నది తప్ప మరో కారణం లేదు. ఇప్పటికి కూడా తెలుగుదేశం నాయకత్వం దీనిపై పరిపరివిధాల మాట్లాడ్డం హాస్యాస్పదం. ఒక్క సానుకూల సంకేతం కూడా రాకుండా కేంద్రం ఏదో వొరగబెడుతుందని ఎదురు చూడటం ఎండమావుల వెంట పరుగుతీయడమే. అప్పుడు వత్తాసు పలికి ఓట్లేయించిన పవన్‌ కళ్యాణ్‌ వంటివారు నోరు మెదపకపోవడమూ దారుణమే.
తిరుపతి ఘటన, దానికి ముందు నుంచి పెరుగుతున్న ఆందోళనలూ అన్నిటికీ ఇదే నేపథ్యం. ఇప్పటికైనా కేంద్రం తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఆర్థిక సహాయం అందించక పోతే ఆంధ్రప్రదేశ్‌లో అసంతృప్తి, ఆగ్రహం మరింత ప్రజ్వరి ల్లడం తథ్యం. అప్పుడు వారు ఆశిస్తున్న రాజకీయ లబ్ధి రావడం అటుంచి అసలు ఉనికికే ముప్పు రావచ్చు. రాజధాని వ్యవహా రాలు, ఓటుకు కోట్ల భాగోతాలు, విభజనానంతర వివాదాలు, రుణ మాఫీ తతంగాలూ, ముంచుకొస్తున్న కరువు మేఘాలు అన్నీ కలిసి ఇప్పటికే ప్రజల సహనాన్ని పరీక్షిస్తు న్నాయి. కేంద్రం ఏదో చేస్తుందనే ఆశతో అనిశ్చిత నిరీక్షణ చేసేందుకు వారెంత మాత్రం అంగీకరించరు. ప్రత్యేక వంచన ఇలాగే కొనసాగితే మోడీ సర్కారుతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపైనా దండెత్తుతారు. అప్పుడు ఈ సమస్యతో పాటు ఇంకా అనేకం రంగం మీదకు వస్తాయి. రాజకీయ చిత్ర పటాన్నే మార్చేస్తాయి. ప్రతిపక్షాలను ఎంతగా తిట్టిపోసినా ప్రజలలో వచ్చే అలాటి కదలికను ఆపడం ఏ ప్రభుత్వం వల్లా అయ్యే పని కాదు.
- తెలకపల్లి రవి