ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల కోసం అలుపెరగని పోరాటం

రైతులకు తగిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడకపోతే దేశ భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని వక్తలు పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం'పై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రాంగణం మొత్తం రైతుల కిక్కిరిసిపోయింది. వందలాది మంది నిల్చునే వక్తల ప్రసంగాలను విన్నారు. అదనపు కుర్చీలనూ వేయించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ విధానాలపై విధాన పత్రాన్ని విడుదల చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముద్రించిన 'మహారాష్ట్రలో రైతుల మహాపాదయాత్ర', 'మార్కెట్‌ విషవలయంలో మన గ్రామ సీమలు' అనే పుస్తకాలను నాయకులు ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై రైతుల్లో విస్తృత ప్రచారం చేయాలని, ఆగస్టు 15 నుంచి 30 వరకూ పాదయాత్రలు, సదస్సులు, బస్సు యాత్రలు నిర్వహించాలని, సెప్టెంబరు 15న విజయవాడలో మహాగర్జన చేపట్టాలని సదస్సు నిర్ణయించింది.సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో రైతులకు గౌరవం కొరవడిందన్నారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల కోసం రైతులు సంఘటితం కావాలన్నారు. పెట్టుబడి కంటే అదనంగా 50 శాతం పెంచి ఇస్తామని చెప్పిన నరేంద్ర మోదీ అంకెలగారడితో రైతులను మభ్య పెట్టారని అన్నారు. అంతర్జాతీయ మోసగాళ్ల జాబితాలో మోదీ, చంద్రబాబు మొదటి రెండు స్థానాల్లో ఉంటారని అన్నారు. పారిశ్రామిక వేత్తలు రూ.11 లక్షల కోట్లు ఎగవేతకు పాల్పడితే పట్టించుకోని ప్రధాన మంత్రి ఎన్నికల్లో గెలిస్తే 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీనీ విస్మరించారన్నారు. చంద్రబాబు గతంలోనే వ్యవసాయం దండగ అన్నారని ఇప్పుడు రైతులతో వ్యవసాయం దండగ అనే స్థాయికి వెళ్తున్నారని దుయ్యబట్టారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తూ రైతులు సంఘటితం కాకపోవడం వల్లే ఎవరికీ న్యాయం చేకూరడం లేదన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో సంఘటితంగా పోరాటాలు నడుస్తున్నాయని, వాటి స్ఫూర్తితో రాష్ట్రంలోనూ రైతులు ఐక్యంగా పోరాడాలని చెప్పారు. రైతుల కోసం ఎంతో చేస్తున్నామని పాలకుల జోలపాట పాడుతున్నారే కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. దేశం, రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. రైతుల దుస్థితిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాలి ఒలకబోయడం, అధికారంలోకి రాగానే కనికరం లేకుండా అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిఎం చంద్రబాబు రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని అన్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో భారీగా భూసేకరణకు పూనుకోవడంతో రైతుల తీవ్ర ఆందోళనకు గురవుతన్నారని అన్నారు.సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ విత్తనాలపై పూర్తి హక్కులు రైతులకే ఉండాలన్నారు. అన్ని పంటలకు ధరలు పతనంమవుతున్నాయని, దేశంలో 52 శాతం మంది రైతులు అప్పుల్లో ఉండగా రాష్ట్రంలో 93 శాతం మంది అప్పుల్లో ఉన్నారని చెప్పారు. వామపక్షాలు మినహా మిగిలిన బూర్జువా పార్టీన్నీ పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ వ్యవసాయాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. పాదయాత్రల సమయంలో రైతులకు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, అధికారంలోకి రాగానే విస్మరించడం వైఎస్‌, చంద్రబాబుకే చెల్లిందన్నారు. సంప్రదాయాలను, మత విశ్వాసాలను ఓట్ల కోసం వినియోగించుకుంటున్నారని విమర్శించారు