ప్రతిష్టంభనకు తెరదించాలి!

లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణాలు ఊహించిన విధంగానే పార్లమెంటును కుదిపేశాయి. వర్షాకాల సమావేశాలు తొలి రోజున మొదలైన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు పదే పదే వాయిదా పడడానికి ఎవరు కారకులు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రతిపక్షాలే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని, చర్చ జరగడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాయని బిజెపి, మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదన పసలేనిది. ప్రతిపక్షాలు పార్లమెంటులో కోరుతున్నదేమిటి? అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు వసుంధరా రాజే, శివరాజ్‌ చౌహాన్‌లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. దర్యాప్తు సాగినంత కాలం కళంకిత మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకోవాలని కోరుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత న్యాయసమ్మతమైన డిమాండ్‌. దీనికి ప్రభుత్వం అంగీకరించ కుండా రండి సభలో చర్చిద్దామంటోంది. దర్యాప్తునకు చర్చలు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించేందుకే ఈ చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. చర్చ కోసం చర్చ వల్ల ఉపయోగమేమీ ఉండదని, మంత్రులపై వచ్చిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై స్పందించకుండా ప్రతిపక్షంపై అవాకులు, చవాకులు విసరడం బాధ్యతారాహిత్యం.
గతంలో బిజెపి ప్రతిపక్షంలో ఉండగా చేసిందేమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. 2005లో ఆహారం కోసం చమురు కుంభ కోణంతో ప్రమేయమున్నట్లు ఆరోపణలెదుర్కొ న్న మంత్రులను తొలగించాల్సిందేనని పట్టుబట్టి 15వ లోక్‌సభలో పార్లమెంటు శీతాకాల సమావేశాలను మొత్తంగా స్తంభింపజేసింది. చివరికి ఆ మంత్రులు రాజీనామా చేశారు. అప్పుడు చర్చకు బిజెపి ససేమిరా అంది. ఇంకొంచెం వెనక్కి వెళితే 1995 డిసెంబరులో వాజ్‌పేయి లోక్‌సభలో మాట్లాడుతూ, 'చర్చ కోసం చర్చను మేము కోరుకోవట్లేదు. కమ్యూనికేషన్స్‌ మంత్రి సుఖ్‌రామ్‌ రాజీనామా చేయాల్సిందే' అని నినదించారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో ఉంటే మరో మాటా? ఇదేనా బిజెపి నీతి? ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన స్థానంలో ఉన్నవారు ఇలాగేనా వ్యవహరించేది? శాసన వ్యవస్థ (పార్లమెంటు)కు కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) జవాబుదారీ వహించాలని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొంటోంది. రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలను ఆడిపోసు కోవడంపై తన వకీలు పాండిత్యాన్నంతటినీ ఒలకబోశారు. కానీ, ప్రభుత్వం పార్లమెంటుకు వహించాల్సిన జవాబుదారీతనం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. చర్చ పేరుతో జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. ఇది చెల్లుబాటయ్యేది కాదు. ప్రతి పక్షాల మధ్య చీలిక తేవడానికి ప్రభుత్వం రాబర్ట్‌ వధేరా వ్యవహారాన్ని ముందుకు తెచ్చింది. ఆ ట్రిక్కు ఫలించకపోయేసరికి ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగడం దాని తెంపరితనానికి నిదర్శనం.
లలిత్‌ గేట్‌ కుంభకోణంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజేల పాత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయి. వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పాత్రపైనా అనేక వార్తా కథనాలొచ్చాయి. ఐపిఎల్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్‌ మోడీ ఈ దేశ చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌కు ఉడాయిస్తే అటువంటి వ్యక్తికి సాధారణ వీసా మంజూరుకు ప్రతిపక్ష నాయకురాలి హోదాలో సుష్మ ఒక విదేశీ ప్రభుత్వానికి సిఫారసు చేయడాన్ని సాదాసీదా కుటుంబ సంబంధాల వ్యవహారంగా బిజెపి చెప్పడం వెగటు పుట్టిస్తోంది. సుష్మ భర్త, కుమార్తె లలిత్‌ మోడీ తరపున వకీళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది కచ్చితంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వ్వవహారమే. అలాగే లలిత్‌ మోడీకి బ్రిటన్‌లో నివసించేందుకు అవసరమైన పత్రాలపై సంతకం చేస్తూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆయన గుణగణాల గురించి విశేషంగా కొనియాడారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ (లోక్‌సభ సభ్యుడు)కు చెందిన కంపెనీలో లలిత్‌ మోడీ పది వేల షేర్లను పెట్టాడు. ఆమె స్వయంగా సంతకం చేసి బ్రిటిష్‌ అధికారులకు పంపిన ఆ వాంగ్మూలాన్ని భారత ప్రభుత్వ అధికారులకు తెలియజేయకుండా రహస్యంగా ఉంచాలని కోరారు. బిజెపి పరిభాషలోనే చెప్పాలంటే ఇది ఫక్తు జాతి వ్యతిరేక చర్య. కానీ, నేడు బిజెపి వసుంధరా రాజే తప్పుడు చర్యలను పూర్తిగా సమర్థించుకుంటోంది. ఆమె ఏ తప్పూ చేయలేదని బుకాయిస్తోంది. ఇటువంటి అసంబద్ధ వాదనలతోనూ, బుకాయింపులతోనూ బిజెపి, మోడీ ప్రభుత్వం నెట్టుకురాగలమనుకుంటే పొరపాటు. తక్షణమే ఈ కుంభకోణంపై ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినట్లుగా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి. ఆ దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ సుష్మ, వసుంధర, శివరాజ్‌ చౌహాన్‌లను ఆ పదవుల నుంచి తప్పించాలి. పార్లమెంటులో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించాలి.