ప్రజా పోరాటాలతో తిప్పికొడతాం - సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు

                 బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న గిరిజనులను మావోయిస్టులతో సంబంధాలున్నాయని ముద్రవేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని, బలమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఏజెన్సీలో పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధంలేని గిరిజన యువతను వేధింపులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. మంగళవారం ఉదయం విశాఖలోని ఎన్‌పిఆర్‌ భవన్లో పోలీసు బాధిత కుటుంబాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో మౌలికసదుపాయాల కోసం, ప్రజా సమస్యలపైనా మాట్లాడే హక్కు లేకుండా అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వారం రోజుల పాటు కోర్టులో హాజరు పర్చలేదని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ జోక్యం చేసుకున్న తరువాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సెంట్రల్‌ జైలుకు తరలించారని తెలిపారు. 
కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వారిని చూపించకుండా వారం రోజుల పాటు రహస్యంగా వుంచాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు, మావోయిస్టుల చర్యలతో గిరిజనులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు నిర్బంధం ఆపకపోతే బాధితుల పక్షాన ప్రజాతంత్రవాదులు, రాజకీయపార్టీలను ఐక్యపర్చి పోరాడతామని తెలిపారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ గిరిజనులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చదువుకున్న గిరిజన యువతపై అక్రమ కేసులు బనాయించి బతుకుతెరువులేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా బాక్సైట్‌ వ్యతిరేకపోరాటంలో పాల్గొనే శక్తులన్నీంటినీ ఏకం చేసి బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో కూండ్రాపల్లి బాధిత కుటుంబ సభ్యులు వండలం చినబ్బారు, ముత్యాలమ్మ, సన్యాసమ్మ, సుజాత, పార్వతమ్మ, దేవి, కోరాబు లక్ష్మణమ్మ, పెద్దబ్బారు, సోములమ్మ, లక్ష్మయ్య, భానుమూర్తి, జంపరంగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.