ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?

 బిజెపి భీష్మాచార్యులు లాల్‌కృష్ణ అద్వానీ ''మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయని'' తన భయాన్ని పైకి వ్యక్తీకరించి, కొందరి మనసులనున్న, బయటకు రాని భయాన్ని ఆవిష్కరించారు. ''ఇప్పుడు మనం ప్రజాస్వా మ్యంలోనే ఉన్నామా?'' అసలు ప్రజాస్వామ్యమంటే ఏమిటీ? అనే ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ''అద్వానీ ఆ మాట ఎందుకన్నారు? రాబోయే చీకటి రోజుల చిహ్నాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఎలా అంచనా వేయగలిగారు? అన్నిటికీ సమాధానాలు అవసరమే!
ఒకటి మాత్రం నిజం. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైళ్లు నోళ్లు తెరుచుకున్నాయి. ఎందరినో జైళ్లలో వేశారు. ఇప్పుడు దేశమే జైలుగా ఉంది. కనిపించని జైలు గోడల మధ్య భయంతో, భక్తితో బతుకుతున్నాం. ఎమర్జెన్సీ కంటే ఇది చాలా భయంకరమైంది. 'ఎమర్జెన్సీ' అంటే శత్రువుతో ప్రజల ప్రత్యక్ష యుద్ధం. శత్రువు కనిపిస్తుంటాడు. ఇప్పుడు శత్రువు కనిపించటం లేదు. జైలులో ఉన్నాం. గోడలు కనిపించటం లేదు. యుద్ధం ఎవరితో చేయాలో అర్థం కావటం లేదు. మొత్తం మీద భారత ప్రజలు చీకటి రోజులలో ఉన్నారు. ఇలా ప్రత్యక్షంగా అనలేక అద్వానీ పరోక్షంగా అన్నట్టున్నారు. ఇప్పుడంతా వెలుగే కనిపిస్తుంది. కానీ చీకట్లో ఉన్నాం... అంతా చట్టబద్ధమే అనిపిస్తుంది. రాజ్యాంగ దారిలోనే దబాయింపు కనిపిస్తుంది. రాజ్యాంగం లేదు. ప్రజాస్వామ్యం లేదు. అంతా బోగస్‌. ఒక వ్యక్తి ఇష్టారాజ్య పరిపాలన నడుస్తూ ఉంది. పార్టీలేదు. పార్టీ నిర్ణయం లేదు. కేబినెట్‌ తలలూపుతున్న పరిస్థితి. అధికారులు వ్యక్తికి అనుకూలంగా అడుగులు వేస్తున్న స్థితి. స్వతంత్ర సంస్థలు కూడా తమ దారిని విడిచి ఆయన దారిలోకి వస్తున్న దుస్థితి... దీన్ని ఏమందాం?
దేశ పరిస్థితి-మోడీ అడుగుల పరిస్థితే కాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులలో కూడా ఈ ధోరణి కనిప ిస్తోంది. ప్రాంతీయ పార్టీలలో వ్యక్తి నియంతృత్వ ధోరణి క్రమేణా బలపడుతున్న స్థితిని, అది పరిపాలనపై ప్రభా వం కల్గిస్తున్న స్థితిని చూస్తున్నాం. కెసిఆర్‌ బంగారు తెలంగాణ అంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మాటా ్లడిన వారం దరినీ బంగారు తెలంగాణకు శత్రువులుగా ప్రజల ముందు నిలబెడుతున్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఆయనన్నది వేదం, ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు. చంద్రబాబు విషయమూ అంతే. 'అమరావతి' వ్యతిరే కులంతా ప్రజా శత్రువులు... ఆయన పార్టీలో ఆయన దొర, ఎదురు లేదు. తన అభిప్రాయాలతో పరిపాలన చేస్తారు. అందుకు పార్టీ, కేబినెట్‌, అధికారులు, అసెంబ్లీ అందరూ జీ హుజూర్‌! అనాల్సిందే. తప్పదు ఇదంతా ప్రజాస్వామ్య మనగలమా?
'అమరావతి' విషయమే తీసుకుందాం! ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని అవసరం. కాదనలేం. పది సంవత్సరాల వరకు హైదరాబాద్‌ రాజధానిగా పరిపాలించే అవకాశం విభజన చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలున్నాయి. ఎక్కడి నుండైనా పరిపాలించవచ్చు. రాజధాని నిర్మాణం అవసరమా? 'అమరావతి' స్థలంలోనే జరగాలా? ఐదు వేల ఎకరాలతో రాజధాని అవుతుంది. 35 వేల ఎకరాలెందుకు? వందల సంవత్సరాల నుంచి దున్నుకొని బతుకుతున్న రైతులను వారి పొలాల నుంచి రాజధాని పేరుతో నెట్టివేయడం సబబుగా కనిపించదు. ఇక్కడంతా చంద్రబాబు ఇష్టం. పార్టీ నిమిత్త మాత్రం. కేబినెట్‌ తలలూపాల్సిందే. అధికారులు సంతకం పెట్టాల్సిందే. రాజధాని పేరుతో కార్పొరేట్‌ సామ్రాజ్య నగర నిర్మాణం 'అమరావతి'! కాదనే శక్తి ఎవరికీ లేదు. ఎవరైనా నిజం కాదన్నా, నోరు విప్పినా ఏదో రూపంలో జైళ్లు నోళ్ళు తెరుచుకుంటాయి. లాఠీలు ఎగిసి ఎగిసి పడతాయి. ఇది ప్రజాస్వామ్యమా? వ్యక్తి సామ్రాజ్యమా?
ఒక్క చంద్రబాబు, కెసిఆర్‌ విషయమే కాదు. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. జయలలిత, మమతాబెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ వీళ్ల చేతుల్లో పార్టీ ఉంటుంది. పార్టీ చేతుల్లో వీరుండరు. వీరి వ్యక్తిగత నిర్ణయాలు పరిపాలనగా మారిపో తాయి. రాజ్యాంగ సూత్రాలు, ప్రాథమిక హక్కులు అన్నీ వట్టివే! జయలలితది అమ్మ సామ్రాజ్యం. మమతది దీదీ సామ్రాజ్యం, అఖిలేష్‌ది కొడుకు సామ్రాజ్యం. ఇలా ఉంది ప్రజాస్వామ్యం.
అసలు సిసలైన ప్రజాస్వామ్యం నెహ్రూ కాలంలో కనిపిస్తుంది. నెహ్రూ చాలా కాలం పరిపాలించారు. తన మాటకు వ్యతిరేకం లేకున్నా ప్రతిపక్షాలను గౌరవించారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులను, రాజ్యాంగబద్ధ హక్కులను ధ్వంసం అయిన కాలం ఇందిరాగాంధీ కాలం. ఆమె వీటిని లెక్కచేయలేదు. న్యాయవ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలూ తన అధీనంలో ఉండాలని ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవటంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. మనదేశంలో 'ఎమర్జెన్సీ' మానసిక దృక్పథంతో ఎలా వస్తుంది? 'తన మూలంగా పార్టీ గెల్చిందని తానే సర్వస్వమని భావించి తనకు ఎదురులేకుండా రాజ్యం చేయాలని భావించినప్పుడు రాజ్యాంగ సూత్రాలు పౌరుల ప్రాథమిక హక్కులు అడ్డంగా నిలుస్తాయి. అప్పుడు ఆ మానసిక స్థితిలోని 'అహం' ఎమర్జెన్సీకి తెరలేపుతుంది. ఇప్పుడు ఆ స్థితి రావచ్చని అద్వానీ భయం... ఇప్పుడు ఆ స్థితి కనిపిస్తుందని అద్వానీ అంతరంగం. ఇందిరాగాంధీ కాలంలో బలమైన ప్రతిపక్షముంది. జయ ప్రకాష్‌ నేతృత్వ ముంది. నిజాయితీ గల నాయకులున్నారు. ఇప్పుడంతా దొంగలే! ఒకరినొకరు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పరిపాలించే, రాజకీయం నడిపే రోజులొచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ చీకటి రోజులు రావటం సులభం. ఎందుకంటే దోపిడీ వర్గాల మధ్య వైరుధ్యాలు, ఘర్షణ పెరిగి, రాజీలేని వాతావరణం వచ్చి బలమైన వ్యక్తి తన పైచెయ్యి కొరకు 'ఎమర్జెన్సీ'కి తెరలేపుతారు. ఇప్పుడా పరిస్థితులు వచ్చే అవకాశాలు న్నాయి. అవసరా లున్నాయి.
తన మూలంగానే బిజెపి గెల్చిందని మోడీ నమ్ముతున్నారు. ఎలా గెలిచారు? చారిత్రక పరిస్థితు లేమిటి? ఇక్కడ రాయాలని లేదు. తానే సర్వస్వం, తనమాటే వేదం కావా లని ఆయన అంతరంగం. ఇది నిజం. మోడీ ప్రతిపక్షాలను, స్వంత పక్షాన్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ను తన గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉండకపోవచ్చు. మోడీ లక్ష్యం కార్పొరేట్‌ సామ్రాజ్య రక్షణ. ఈ విషయం అద్వానీకీ తెలుసు. ఆయన ముందు చూపు... అప్పుడు ఏం జరుగుతుంది. మోడీ తన లక్ష్యం వైపు గుర్రాన్ని పరిగెత్తించటానికి ఎమర్జెన్సీకి తెరలేపవచ్చు. ఉదాహరణ భూ సేకరణ బిల్లును చట్టంగా తెచ్చుకోవటానికి ఎత్తులు జిత్తులు అన్నీ వేస్తున్నారు. ఎవరినీ ఖాతరు చేయటం లేదు. ఆయనలో నియంతృత్వ లక్షణాలు ప్రతి అడుగులో కనిపిస్తాయి. నరేంద్రమోడీలో నియంతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.
సిహెచ్‌ మధు