ప్రజల మధ్య పాలకుల చీలిక యత్నాలను తిప్పికొట్టాలి

రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్‌ 15న విజయవాడలో నిర్వహించే ర్యాలీ, ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షతన విస్తృత సమావేశం ఆదివారం నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రధాని మోడీ మేకిన్‌ ఇండియా నినాదం డొల్లతనం బయటపడిందని చెప్పారు. నోట్ల రద్దు వల్ల 80 లక్షల మందికిపైగా ఉపాధి కోల్పోయారని, జిఎస్‌టి వల్ల ధరలు పెరిగాయి తప్ప తగ్గలేదని విమర్శించారు. పెట్టుబడులు రాకున్నా మోడీ, చంద్రబాబు విదేశీ పర్యటనలకు మాత్రం కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము వృథా చేశారని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో మైనింగ్‌ తవ్వకాలు, డి కేటగిరీ ఫారెస్ట్‌ను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలను ఆదివాసీల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దేశంలో గోసంరక్ష దళాల దాడిలో ఇప్పటి వరకూ 38 మంది మృతి చెందారన్నారు. దేశంలో 14 లక్షలు, రాష్ట్రంలో 2.10 లక్షలకుగాపై ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీకి ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలకు బిజెపి పాలన గొడ్డలి పెట్టని, ప్రజలి మతం, కులం పేరుతో విభజించి పబ్బం గడుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుటిల రాజీయనీతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రజాసమస్యలను అద్యయనం చేసి వాటి పరిష్కారానికి ఆందోళనలు చేస్తామన్నారు. ఈ నెల 20 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజల వద్దకు వెళ్తామని వెల్లడించారు. అభివృద్ధి పేరుతో సిఎం చంద్రబాబు వేలాది ఎకరాలను సేకరించి కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి అమరావతి చుట్టూనే కేంద్రీకరించకుండా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిచాలని, కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌లకు నిధులు కేటాయించాలని, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలని కోరారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, పక్కాగృహాలు కేటాయించాలని కోరుతూ సమావేశం తీర్మానించింది