ప్రకృతి గతితర్కం

 పురాతన కాలంనాటి అద్భుతమైన స్వాభావిక తాత్విక ఊహలు, అరబ్బుల కాలంలో అడపాదడపా చోటు చేసుకున్న మహావిష్కరణలు ఎక్కువభాగం ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే అంతర్ధానమైపో యాయి. ప్రకృతిని ఆధునికంగా పరిశోధించి సాధించిన శాస్త్రీయమైన, క్రమబద్ధమైన పరిపూర్ణమైన శాస్త్రీయాభివృద్ధి మాత్రమే కాల పరీక్షకు నిలిచింది. ఈ ఆధునిక శాస్త్ర పరిశోధనాకాలంనుండి ఒక నూతన శకం ఆరంభమయ్యింది. ఇదంతా అతి సమీప చరిత్రయే. జర్మన్లు ఈ శకాన్ని సంస్కరణ యుగంగా పిలుచుకుంటే, ఫ్రెంచి వారు పునరుజ్జీవనశకంగా పిలుచుకున్నారు. ఇటలీవారు సంగీత, సాహిత్యాలు, కళలు, కుడ్యాల నిర్మాణంలో అద్భుత ప్రగతిసాధించిన కాలంగా పేర్కొన్నారు. పదిహేనవ శతాబ్దం ద్వితీయార్థం నుండి ఈ శకం ఆరంభ మయ్యింది. అప్పటిదాకా రాజ్యాలేలిన ఫ్యూడల్‌ ప్రభువులను, మహా సామ్రాజ్యాలను పట్టణ ప్రాంత వణిక్‌ ప్రముఖ వర్గమంతా కలిసి కూలదోసింది. ఇందులో 'జాతీయత' ప్రధాన భూమిక పోషించింది. ఆధునిక ఐరోపాలో జాతి రాజ్యాల అవతరణకు, ఆధునిక బూర్జువా వర్గ అభివృద్ధికి తోడ్పడిన ముఖ్య పరిణామం ఇది. ఒక ప్రక్కన వాణిజ్య వర్గాలు - రాజరికవర్గానికి మధ్యన యుద్ధాలు, తిరుగుబాట్లు, పోటారాలు జరుగుతూ ఉండగానే జర్మనీ రైతాంగం తిరుగుబాటు చేసి రానున్న వర్గ పోరాటాన్ని దోపిడీ వర్గాల ముందు సాక్షాత్కరింపచేసింది. రైతాంగ తిరుగుబాట్లు చరిత్రలో కొత్తకాదు గానీ జర్మనీ రైతాంగం చేతిలో ఎర్రజెండాతో, గొంతులో ఉమ్మడి యాజమాన్య హక్కు నినాదంతో తిరుగుబాటు చేసి ఆధునిక శ్రామికవర్గ శైశవ దశను రంగస్థలంమీదకు తెచ్చింది. బైజాంతియమ్‌ కూలిపోయిన పిదప భద్రపరచబడిన రాతప్రతులు, రోమ్‌ నగర శిధిల తవ్వకాలలో బయల్పడిన పురాతన విగ్రహాలు చూసి పశ్చిమ దేశాలు మ్రాన్పడిపోయాయి. మధ్యయుగాల నాటి ప్రేతాలు ఒక వెలుగు వెలగకుండానే అంతర్థానమైపోయిన ప్రాచీన గ్రీకు చరిత్ర పశ్చిమ దేశాలకు ఒక కొత్త లోకాన్ని కళ్ళకు కట్టించింది. కలలో కూడా ఊహింప తగని రీతిలో కళలు ఇటలీలో ప్రవర్థమాన మయ్యాయని చరిత్ర తెలుపుతున్నది. ఆ ప్రాచీన సౌందర్య సొబగులను తిరిగి ఆ దేశం ఎన్నటికీ అందుకోలేకపోయింది. ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ రాజ్యాలలో సాహిత్యం క్రొత్త పుంతలు తొక్కింది. ఆ తరువాతే ఇంగ్లీష్‌, స్పానిష్‌ సాహిత్యంలో ఆధునిక శకం ఆరంభమయ్యింది. ప్రపంచంలో అప్పటిదాకా ఉన్న భౌగోళిక సరిహద్దులు పటాపంచల ైపోయాయి. ్టమొదటి సారిగా ప్రపంచ వాణిజ్యానికి మార్గాలు ఏర్పడ్డాయి. చేతివృత్తుల స్థానంలో సరుకులను ఉ్తత్పత్తిచేసే పరిశ్రమలు వచ్చి చేరాయి. తదనంతరకాలంలో భారీ పరిశ్రమల అభివృద్ధి కి కేంద్ర బిందువుగా నిలిచాయి. ప్రజలపై మానసిక ఆధిపత్యం ఛలాయిస్తున్నచర్చి నియంతృత్వ ఆధిపత్యం కూలిపోయింది. మెజారిటీ ప్రజానీకం ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం వైపు మరలారు. లాటిన్‌ అమెరికా దేశాలు స్వేచ్ఛా ఆలోచనలకు కేంద్రంగా మారాయి. ఆ తర్వాత అరబ్బులు ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఆతర్వాత గ్రీకు తత్వశాస్త్రం విరాజిల్లింది. వీటి పునాది నుండే పద్దెనిమిదవ శతాబ్దం నాటికి భౌతికవాదం అంకురించింది. మానవాళి చరిత్రలో అద్భుతమైన అభ్యుదయ విప్లవకా లంయిది. అన్ని రంగాల్లోనూ దిగ్గజాలు ఉద్భవించారు. ఆలోచనల్లో, అన్వేషణలలో, వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ దిగ్గజాలు ఎనలేని ప్రభావం చూపించారు. జ్ఞాన సముపార్జన విశ్వవ్యాప్తమైంది. ఆధునిక బూర్జువా పరిపాలనకు రూపకల్పన చేసిన వారు కూడా బూర్జువా పరిమితులు ఏమిటో అర్థం చేసుకున్నారు. దేశాంతర పర్యటనలు చెయ్యడం, కనీసం నాలుగు భాషలు మాట్లాడటం, వివిధ రంగాలలో ప్రవేశం కలిగి ఉండటం నాటి జనానికి పరిపాటిగా మారింది. లియోనార్డో డావిన్సీని గొప్ప చిత్రకారుడిగానే చూస్తుంది ఈ ప్రపంచం. కాని అతను అద్భుత గణిత మేధావి, మెకానిక్కు, ఇంజనీరు. భౌతికశాస్త్రంలోకూడా అనేక నూతన ఆవిష్కరణలకు ప్రేరణగా నిలిచాడు. అలాగే ఆల్బర్ట్‌ డ్యూరర్‌ను తీసుకుంటే అతను చిత్రకారుడిగా, శిల్పిగా,భవన నిర్మాణ ప్రణాళికా రూపకర్తగా, రాతి చెక్కడాల రూప కర్తగా భాసించాడు. శత్రు దుర్భేద్యమైన నిర్మాణా లకూ రూపకల్పన గావించాడు. తదనంతర కాలంలో జర్మనీలో శాస్త్రీయాభివృద్ధి అతడి ఆలోచనల ఆధారంగానే ఆధునికాభివృద్ధి వైపు పురోగమించింది. మాకియవెల్లీ గొప్ప రాజనీతిజ్ఞుడే కాదు, గొప్ప చరిత్రకారుడు, గొప్ప కవి కూడా. అంతేకాదు ఆధునిక కాలపు సైనిక వ్యూహ శాస్త్రానికి ఆద్యుడు కూడా. లూథర్‌ అప్పటిదాకా ఏకఛత్రంగా ఏలిన చర్చిని సంస్కరించటమేకాదు.
జర్మన్‌ భాషనూ సంస్కరించి, వచనంలోకి మార్చటంలో ప్రధానపాత్ర పోషించాడు. అద్భుతమైన శబ్ద లాలిత్యంతో కూడిన వచన శ్లోకాలు రచించి, పదహారవ శతాబ్దపు మాకియవెల్లీగా ప్రభవించాడు. ఈ కాలపు కథా నాయకులు శ్రమ విభజనకు బందీలు కాలేదు.తదనంతర కాలంలో ఏకపక్షంగా కొనసాగిన వస్తూత్పత్తి విధానం మానవుడి సృజనాత్మక శక్తిమీద పరిమితులు విధించ సాగింది. అదలా ఉంచితే పైన చెప్పుకున్న కాలంనాటి కథా నాయకులు అనేకులంతా ఆ కాలపు ఉద్యమాలు, అసలైన పోరాటాలలో ఒక పక్షాన నిలబడి తమ కలాన్ని, గళాన్ని వినిపిం చారు. కత్తి పట్టి పోరాడారు. ఉద్యమాలతో మమేకం అవుతూనే జీవన మాధుర్యాన్ని అనుభవించారు. తమ సృజనాత్మక కార్యకలా పాలను కొనసాగించారు. పరిపూర్ణ మానవులుగా జీవించారు. అయితే కొద్దిమంది మేధావులు ఇందుకు మినహాయింపుగా బతికారు. ద్వితీయ, తృతీయ శ్రేణికి చెందిన ఈ రకం మేధావులు తమ చేతులు కాల్చుకో కుండా గట్టుమీద నిలబడి ఉద్బోధలతో కాలం గడిపారు. 
నాటి సామాజిక విప్లవాల కాలంలోనే సామాజికశాస్త్రాలలో అద్భుతమైన విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి పురాతనశాస్త్రాలూ పెనుగులాడాయి. ఆనాటి ఇటలీ తత్వవేత్తలతో పాటు శాస్త్ర పరిశోధనలలో తమ ప్రాణాలు అర్పించి అమరులైన వారు ఎందరో ఉన్నారు. ఈ పరిణామ క్రమంలో గమనించాల్సిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే ప్రకృతిని పరిశోధించడంలో క్యాథలిక్‌ల వలే కాకుండా ప్రొటెస్టెంట్లు ఎంతో స్వేచ్ఛ కల్పించారు. సెర్విటస్‌ రక్త ప్రసరణకు సంబంధించిన పరిశోధనలను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉండగా అందుకుగాను అతన్ని రెండుగంటలపాటు మంటల్లోసజీవదహనం చేశారు. గియార్డనో బ్రూనోనూ సజీవ దహనం చేశారు. 
అయినప్పటికీ శాస్త్రాలు విప్లవాత్మకంగా తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. మరణశయ్యమీదనుండే కోపర్నికస్‌ ప్రతిపాదించిన గ్రహగతుల సిద్ధాంతాన్ని ప్రచు రించడం ద్వారా లూధర్‌ చర్చి ఆధిపత్యానికి చరమగీతం పాడాడు. తద్వారా విశ్వాం తరాళగ వేషణకు నూతన మార్గాలు చూపాడు. ప్రకృతి పరిశోధనలో పెద్ద కుదుపు వచ్చిన కాలం అది. అప్పటికీ దైవదత్త సిద్ధాంతానికి, ప్రకృతి శాస్త్రాలకు మధ్యన నేను గొప్పంటే నేను గొప్పనే వాదులాటలు అడపదడపా కొనసాగు తున్నా, ప్రకృతి శాస్త్రాలు భావవాద సంకెళ్ళ నుండి ఈకాలంలోనే విముక్తిపొందాయి. అప్పటినుండి సైన్స్‌ అంగలు పంగలుగా అభివృద్ధి చెందింది. కాలంతోపాటు వేగంగా ఒక ధృతితో ఈ అభివృద్ధి సాగింది. మానవ మేధస్సు నిర్జీవ పదార్థం కాదని, అదొక పరమాద్భుతమైన జీవ పదార్థమని రుజు వయ్యింది.
ప్రకృతిశాస్త్రాలలో తొలిదశ కృషి అంతా అప్పటిదాకా అందుబాటులో వున్న పదార్థ విజ్ఞానాన్ని శిఖరస్థాయికి తీసుకు వెళ్ళడంగా సాగింది. కొన్ని రంగాలలో కృషికి మాత్రం అప్పుడే పునాదిపడింది. యూక్లిడ్‌, పిటోలిమక్‌లు సౌరవ్యవస్థ గురించి చేసిన ప్రాచీన సిద్ధాంత ప్రతిపాదనలు, అరబ్బులు కనుగొన్న శూన్యాం శము, ఆల్జీబ్రా, ఆధునిక సంఖ్యాశాస్త్రం, రసాయనశాస్త్రం-ఈ విజ్ఞానం మాత్రమే అప్పటివరకు అందుబాటులో ఉంది. మధ్యయుగాలలో శాస్త్ర విజ్ఞానానికి తోడ్పాటు పెద్ద గుండుసున్నాగా మిగిలింది. ఈ నేపథ్యంలో సామాజిక శాస్త్రాలకు సంబంధిం చిన మౌలికాంశాలు, మెకానిక్స్‌, గ్రహాలు, గ్రహాంతర అన్వేషణలు ప్రధానంగా సాగాయి. దీనికి సమాంతరంగా ఉపయుక్తంగా ఉండే రీతిలో గణితశాస్త్రాన్ని అభివృద్ధిచేసే కృషి జరిగింది. న్యూటన్‌ గమన సూత్రాలు, లీనియస్‌ సిద్ధాంతం ఈ రంగంలో సాగిన విశిష్ట అన్వేషణలుగా నిలిచాయి. ఇంక గణిత పద్ధతులలో డెస్కార్టెస్‌ 'ఎనలిటికల్‌ జామెంట్రీ'ని నేపియం 'ఆల్గరిధమ్స్‌'ని, లీబ్నిజ్‌ (న్యూటన్‌ కూడా) 'ఇంటిగ్రల్‌ కాలిక్యూలస్‌'ను తోడు చేశారు. అలాగే 'మెకానిక్స్‌'కు సంబంధించిన ప్రధాన సూత్రాలూ అందుబాటులోకి వచ్చాయి. అంతిమంగా ఖగోళశాస్త్రం, 'కెప్లర్‌'సౌర వ్యవస్ధలో గ్రహగతుల సిద్ధాంతం ద్వారా గ్రహ వ్యవస్థ చలనాన్ని కనుగొన్నాడు. పద్థాం, చలనాల సాధారణ సూత్రాల ద్వారా న్యూటన్‌ గ్రహాల చలనానికి సంబంధించిన సూత్రీకరణలను స్థిరపరిచాడు.అప్పటికింకా సామాజిక శాస్త్రాల్లో ఇతర విభాగాలు బాలారిష్టాలను అధిగమించ లేదు. ఆ శతాబ్దాంతానికి ద్రవ-వాయు రూపాలకు సంబంధించిన మెకానిక్స్‌లో కొంత పురోగతి సాధ్యపడింది. (ఇక్కడ రాత ప్రతి మార్జిన్‌లో ఏంగెల్స్‌ పెన్సిల్‌తో బోరిసెల్లీ-అల్పైన్‌ నదుల నియంత్రణలకు సంబంధించి అని రాసిపెట్టాడు) భౌతికశాస్త్రం కటక శాస్త్రంలో తప్ప ఏమాత్రం పురోగతి లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఖగోళశాస్త్రానికి కటక శాస్త్రం యొక్క అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందులో పురోగతి కలిగింది. అప్పటిదాకా రసాయనశాస్త్రం అంటే బంగారం తయారీగానే ఉంది. తొలిగా రసాయనశాస్త్రం ఈ పరిమితినుండి విముక్త మయ్యింది. భూగర్భ శాస్త్రానికి వచ్చేసరికి ఖనిజ శాస్త్రం పిండదశను దాటి పురోగమించలేక పోయింది. నాటికి భూభౌతికశాస్త్రం ఇంకా అంకురించనే లేదు. ఇక జీవశాస్త్రం (బయాలజీ) విషయానికి వస్తే వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, శరీర నిర్మాణశాస్త్రం, అవయవ శాస్త్రాల్లో అప్పటిదాకా అందుబాటులో వున్న విషయ సంపద విశ్లేషణలకు, పరీక్షలకు నిర్ధారణలకు పరిమితం అయ్యింది. దేశ కాలమాన పరిస్థితులు, వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా ఎక్కడ ఏ రకమైన జీవజాతులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే అంశం మీద అప్పటికింకా ఓనమాలు కూడా మొదలు కాలేదు. లిన్నీయస్‌ కృషి ఫలితంగా బోటనీ, జువాలజీలు మాత్రం పరిపూర్ణ దశకు చేరుకున్నాయి.
ఈ కాలానికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం 'ప్రకృతి స్వభావాన్ని మార్చలేం' అనే ప్రాపంచిక దృక్పథం బలంగా ఉండేది. ప్రకృతి ఏ రకంగా ఉనికిలోకి వచ్చిందనే విషయాన్ని ప్రక్కన పెట్టి, అది అంతమయ్యేదాకా ఇలానే కొనసాగు తుంది. గ్రహాలు, ఉపగ్రహాలు ఏ 'మిస్టరీ' శక్తి మూలంగా గమనంలో ఉన్నాయో గానీ అవి అనంతకాలంపాటు, లేదూ అవి క్షయమైపోయేం తవరకూ అలానే తిరుగుతూ వుంటాయి. విశ్వ గురుత్వాకర్షణ శక్తి మూలంగా ఆకాశంలోని నక్షత్రాలు స్థిరంగా, ఎక్కడివక్కడ కదలక మెదలక ఉండిపోతాయి. ఈ భూమి ఆవిర్భవించినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ, ఎప్పటికీ అలానే ఉంటుంది. ఐదు ఖండాలూ (అప్పటికి), పర్వతాలూ, నదులూ, లోయలూ, వాతావరణ పరిస్థితులూ, గడ్డీగాదం ఇవన్నీ ఒకప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఒక్క మానవ కల్పిత వ్యవసాయం, మొక్కల పెంపకం మూలంగా వచ్చిన మార్పులు తప్ప జీవ, జంతు జాలం కూడా యథాతథంగా పునరుత్పత్తి జరిగినంతకాలం అలానే కొనసాగుతాయి. లీన్నియస్‌ పరిశోధనల ఫలితంగా సంకరం జరిగి భిన్నమైన పునరుత్పత్తి జరిగితే తప్ప అన్నీ యథాతథంగా కొనసాగు తాయి అనే భావన ప్రబలంగా ఉండేది. మానవ జాతి చరిత్ర కాలాన్నిబట్టి వివిధ దశలలో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తూనే ప్రకృతి చరిత్ర విషయానికి వచ్చేసరికి అలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదన్న బలమైన అభిప్రాయం పాదుకుంది. ఫలితంగా ఎంతో విప్లవాత్మకంగా పురోగమించాల్సిన శాస్త్రాభి వృద్ధికి ప్రకృతిపట్ల ఈ మితవాద దృక్పధం అతిపెద్ద ఆటంకంగా పరిణమించింది.
పద్దెనిమిదవ శతాబ్దపు ప్రథమార్థం నాటికి శాస్త్రవిజ్ఞానం ప్రాచీన గ్రీకు విజ్ఞానానికన్నా ఎంతో ఉన్నతంగా ఎదిగింది. సైద్ధాంతికంగా, విషయపరంగా అప్పటిదాకా అందుబాటులో ఉన్న జ్ఞాన సంపదను లోతుగా విశ్లేషించింది. ప్రకృతిపట్ల ఉన్న ప్రాపంచిక దృక్పధానికి పుటం పెట్టింది. ఈ ప్రపంచం ఏదో ఒక సంక్షోభం నుండి ఆవిర్భవించి, అభివృద్ధి చెందింది. ఇలాగే ఉనికిలోకి వచ్చిందనేది గ్రీకు తత్త్వవేత్తల అభిప్రాయం. ప్రకృతిశాస్త్రజ్ఞుల దృష్టిలో కూడా ఈ భూమండలం, సమస్త చరాచర ప్రకృతి ఒక్క దెబ్బతో ఆవిర్భవించాయి. ఇవి ఎలాంటి మార్పులకు లోనయ్యే అవకాశం లేదనేభావం ఉండేది. అప్పటికి శాస్త్రవిజ్ఞానం కూడా భావవాద దృక్పధంలో చిక్కుకొని ఉంది. ప్రతి విషయమూ అంతిమంగా తేల్చాల్సి వచ్చేసరికి 'అది ప్రకృతికి అతీతమైన శక్తిమూలంగా అట్లా అయ్యింది' అనో, 'దాన్ని వివరించలేం' అనడమో ముక్తాయింపుగా మారింది. పదార్థానికి ఉండే ముఖ్య లక్షణం ఆకర్షణ అని న్యూటన్‌ తేల్చి చెప్పిన తర్వాత నుండి అలవిమాలిన ప్రశ్నలన్నింటికీ 'బాప్టిజం' ఇచ్చినట్లు-'విశ్వ గురుత్వాకర్షణ శక్తి' కారణం అన్న సమాధానం వినవచ్చేది. గ్రహాలకు కక్ష్యలు ఎలా ఏర్పడ్డాయి? ఈ భూమ్మీద వేనవేల జంతువులు, లక్షోపలక్షల రకాల మొక్కలు, చెట్లు ఎలా వచ్చాయి? మనిషి పుట్టుక ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం కూడా 'ఇదంతా ఆ సృష్టికర్త లీల' అని చెప్పుకొచ్చిన కాలం అది. మొదటగా కోపర్నికస్‌ ఈ భావవాదం వాకిళ్ళు తెరిచాడు. న్యూటన్‌ ఆ రెక్కలు మూసి ఒక 'అతీత శక్తి'ని ముందుకు తెచ్చాడు. ఈ చరాచర ప్రకృతి అంతా పరస్పర ఉపయోగార్థం సృష్టించబడింది. ఎలుకలని చంపి తినడానికి పిల్లులు, పిల్లుల్ని చంపి తినేదానికి కుక్కలు అంటూ ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని ఏదో ఒక అవసరార్థం ఆ సృష్టికర్త సృష్టించాడని చెప్తూ ఉండే వాళ్ళు. అయితే గొప్పతనం ఏంటంటే నాటి ప్రకృతి విజ్ఞానం ఇంత పరిమితంగా ఉన్నప్పటికీ తత్త్వవేత్తలు మాత్రం స్పినోజానుండి, ఉద్దండ ఫ్రెంచి పదార్థవాదుల వరకు ఎందరో ప్రపంచం గురించి పరిపరి విధాలా వ్యాఖ్యానిస్తూ, వాటి మంచి చెడులను మాత్రం భవిష్యత్‌ ప్రకృతిశాస్త్రాలు నిగ్గు తేలుస్తాయని వదిలి పెట్టారు. 
పద్దెనిమిదవ శతాబ్దపు పదార్థవాదులను కూడా కలిపి ఎందుకు చెప్పానంటే పైన పేర్కొన్న దానికి మినహా వారికి శాస్త్రీయమైన ప్రకృతి పరిజ్ఞానం ఏదీ అందుబాటులో లేదు. కాంట్‌ తత్వ బోధలు నూతన శకానికి నాందిగా, ఒక రహస్యంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఎప్పటికోగానీ వాప్లాస్‌ తత్వం రంగం మీదకి రాలేదు. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏమిటంటే ఒక ప్రక్కన విజ్ఞానశాస్త్రం నిత్య నూతనంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరోవైపు ప్రకృతిపట్ల కాలం చెల్లిన ప్రాపంచిక దృక్పధం బలంగా వేళ్ళూనుకొని ఉన్న కాలం అది. పంతొమ్మిదవ శతాబ్దం ప్రథమార్థం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూళ్ళలో ఇప్పటికీ అవే పాఠాలు బోధిస్తూ ఉన్నారు. 
ప్రకృతికి సంబంధించి బూజుపట్టిన ఈ భావాలను త్రోసిరాజన్నది ఒక ప్రకృతి శాస్త్రజ్ఞుడు కాదు, ఒక తత్వవేత్త. 1755లో కాంట్‌ రాసిన యూనివర్సల్‌ నాచురల్‌ హిస్టరీ అండ్‌ థియరీ ఆఫ్‌ హెవెన్‌' అన్న చిరుపొత్తంలో విస్ఫోటన సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చాడు. ఈ భూమి సహా మొత్తం సౌర వ్యవస్థ క్రమానుగతంగా ఉనికిలోకి వచ్చాయి అని ప్రకటించాడు. 'భౌతికశాస్త్రమా, అధి భౌతికశాస్త్రం (మెట్ట వేదాంతం)తో జాగ్రత్త సుమా' అన్న న్యూటన్‌ పలుకులు గమనంలో ఉంచుకొని ఉంటే మెజారిటీ ప్రకృతి శాస్త్రజ్ఞులు 'కాంట్‌' యొక్క ఒకే ఒక్క అద్భుత ఆవిష్కరణను పరిగణనలోకి తీసుకునేవాళ్ళు. లెక్కలేనంతశారీరక , మేధోశ్రమలను, విలువైన కాలాన్ని, తప్పుడు పద్ధతులలో జరిగిన పరిశోధనలకు వెచ్చించేవారు కాదు. కాంట్‌ ఆవిష్కరణలతో అప్పటిదాకా స్ధంభించి ఉన్న పరిశోధనలు ఊపందుకున్నాయి. 
భూమి పరిణామక్రమంలో ఉనికిలోకి వచ్చినదయినందున దాని భౌగోళిక, వాతావరణ, భూగర్భ పరిస్థితులూ, ఈ భూమ్మీది మొక్కలు, ప్రాణులు కూడా ఆవిధంగానే ఉనికిలోకి వచ్చి ఉంటాయి. ఇవి సహజీవనం సాగించడానికి ఒక చరిత్ర ఉన్నట్లే కాలానుగుణమైన మార్పులూ ఉండి వుంటాయి. ''ఈ దిశగా మరిన్ని పరిశోధనలు కొనసాగితే ప్రకృతి శాస్త్రం మరింత పురోగమించివుండేది. కాని తత్వశాస్త్రం నుండి ఆ మాత్రం మంచిని ఎవరు ఆశించారు గనుక 'కాంట్‌' ఆవిష్కరణను చాలాకాలంపాటు ఎవరూ పట్టించుకోలేదు. కొన్నేళ్ళ తరువాత లాప్లాస్‌, హెర్షెల్‌లు ఇరువురూ కాంట్‌ ఆలోచనలను మరింత లోతుగా విశ్లేషించి, బలమైన పునాది తయారు చేశారు. క్రమంగా 'నెబ్యూలార్‌ హైపోథిసిస్‌' దగ్గరకు తెచ్చారు. ఆ తరువాత కొనసాగిన అన్వేషణలు మరిన్ని విజయాల్ని తెచ్చిపెట్టాయి. స్థిర నక్షత్రాల గమనం. విశ్వాంతరాళంలో నిరోధక మాధ్యమం, విశ్వ పదార్థరాశి, రసాయన గుర్తింపు దాని... విశ్లేషణ, పాలపుంతల ఉనికి వంటి కీలక ఆవిష్కరణలు అందులో ముఖ్యమైనవి.
అయినప్పటికీ భూమి అనేక మార్పులకు గురవుతున్నట్లే ప్రకృతి కూడా పరిణామ క్రమంలో ఉనికిలోకి వచ్చిందని మెజారిటీ ప్రకృతి శాస్త్రవేత్తలు అంగీకరించారా అంటే జవాబు అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. అయితే ఈ వాదనకు మరో రంగంనుండి మద్దతు లభించింది. భూగర్భశాస్త్ర విజ్ఞానం ఈ భూమి పొరలు పొరలుగా ఒకదానిమీద ఒకటిగా ఏర్పడ్డాయని ఈ పొరలలో అంతరించిపోయిన జంతువుల అస్థిపంజరాలు, గుల్లలు, అలానే చెట్ల దుంగలు, ఆకులు, పళ్ళ అవశేషాలు ఉన్నాయని వెలుగులోకి తెచ్చింది. దానితో ఇప్పుడీ భూమ్మీద ఉన్న సమస్త జీవజాలమూ ఒక చారిత్రక పరిణామ క్రమంలో ఏర్పడ్డాయని అంగీకరించాల్సి వచ్చింది. అయితే అది కూడా ఎంతో అయిష్టంగానే జరిగింది. 'రివల్యూషన్స్‌ ఆఫ్‌ ఎర్త్‌' పేరిట కూవియర్‌ ఒక సిద్ధాంతం ముందుకు తెచ్చాడు. పేరులో 'విప్లవం' తప్ప సారంలో ఈ సిద్ధాంతం పచ్చి ప్రతీఘాతుకమైనది. ప్రకృతిని ఎవరో ఒక సృష్టికర్త' ఇట్లా సృష్టించాడన్న దానికి బదులుగా, ఒక్కో దశకు ఒక్కో సృష్టికర్తని జోడించి 'మానవాతీతం' అనేది ప్రకృతి పరిణామ క్రమానికి మూలం అని తేల్చి చెప్పాడు. సృష్టికర్త 'మూడ్‌'ని బట్టి ఈ భూమి తాపీగా దశలవారీగా రూపాంతరం చెందినదన్న వాదన ముందుకు తెచ్చాడు లీయెల్‌. గతంలో వాళ్ళందరికన్నా పనికిమాలిన వాదన ఇది. ప్రాణికోటి ఉనికిలోకి వచ్చి యథాతథంగా కొనసాగుతున్నాయనేది అతని ఆలోచన. కాని భూమి ఉపరితలం క్రమంగా గట్టిపడుతూ, జీవం ఆవిర్భవించే పరిస్థితులు ఏర్పడిన క్రమంలో, జీవకోటి ఆవిర్భవించింది అనేది వాస్తవం.
సంప్రదాయం అనేది క్యాథలిక్‌ చర్చిలోనే కాదు ప్రకృతిశాస్త్రంలోనూ బలంగా ఉండింది. చాలా ఏళ్ళపాటు లియెల్‌ తన సిద్ధాంతంలోని వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేదు. ఇంక ఆయన శిష్యగణం గురించి చెప్పేదేముంది. ఆనాటికి సైన్స్‌మీద కూడా శ్రమ విశజన ప్రభావం పడడమే ఇందుకు కారణం.శ్రమ విభజన ఎవరికి వారిని ఆయా ప్రత్యేక రంగాలకే పరిమితం చేసింది. అయితే కొద్దిమందిలో సమగ్రత కోసం మిగిలివున్న తృష్ణను ఆశ్రమ విభజన వారిని ఏవోకొన్ని రంగాలకే పరిమితం చేయలేకపోయింది.
ఇదిలా ఉంటే భౌతికశాస్త్రంలో పెద్ద ముందడుగు సాధ్యపడింది. సామాన్యశాస్త్రంలో ముగ్గురు వ్యక్తులు 1842వ సంవత్సరంలో అలాంటి పురోగతికి కారకులయ్యారు. హీల్‌బ్రాన్‌కు చెందిన 'మాయర్‌', మాంచెస్టర్‌కు చెందిన 'జోలీ'లు ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా, యాంత్రికశక్తి ఉష్ణశక్తిగా రూపాంతరం చెందడాన్ని ఆవిష్కరించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన 'గ్రూప్‌' భౌతికశక్తులు అన్నీ - యాంత్రికశక్తి, ఉష్ణశక్తి, కాంతిశక్తి, ఆయస్కాంతశక్తి, విద్యుత్‌ శక్తి ఆ మాటకి వస్తే రసాయనశక్తి కూడా నిర్దిష్ట పరిస్థితులలో ఎటువంటి శక్తి నష్టపోకుండానే ఒక శక్తిరూపం నుండి మరొకశక్తి రూపానికి మారతాయన్న ఆవిష్కరణ చేశాడు. ప్రపంచంలో చలన పరిమాణం స్థిరంగా ఉంటుందన్న 'డెస్కారిస్‌ సూత్రీకరణకు అదనంగా భౌతికశక్తులు నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక శక్తిరూపం నుండి మరొక శక్తి రూపానికి మారతాయని నిర్థారించాడు. తద్వారా చలనంలో ఉన్న వివిధ పదార్థాలు నిర్దిష్ట సూత్రాలకు లోబడి ఒకదానినుండి ఇంకొక రూపంలోకి మారతాయన్నది రుజువు కావడంతో ప్రకృతిని ఏమాత్రం మార్చలేం అన్న సంప్రదాయభావానికి కాలం చెల్లింది. ఖగోళశాస్త్రంలో వలె భౌతిక శాస్త్రంలో కూడా పదార్థ చలనం ఒక్కటే మార్పులకు మూలం అన్న విషయం రుజువయ్యింది. 
రసాయన శాస్త్రంలో కూడా లోపోయిజర్‌ ప్రత్యేకించి డాల్టన్‌ ప్రకృతికి సంబంధించిన పాత భావాలమీద మరో కోణం నుండి దాడి చేశారు. సేంద్రియ మిశ్రమాల తయారీకి వర్తించే సూత్రాలే సేంద్రియేతర మిశ్రమాల తయారీకీ వర్తిసాయి అని రుజువు చెయ్యడం ద్వారా సేంద్రియ - సేంద్రియేతర పదార్థాల మధ్యన ఉన్న అంతరాన్ని అధిగమించలేం అన్న కాంట్‌ భావన కూడా పనికిమాలినదని రుజువయింది.
ఇక జీవశాస్త్ర పరిశోధనలలో 18వ శతాబ్దం ద్వితీయార్థం నుండే శాస్రీయమైన బృందయాత్రలు, పర్యటనలు ప్రపంచంలో నలుమూలలా ఉన్న ఐరోపా వలస దేశాలన్నింటికీ సాగాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండి పరిశోధనలు కావించినవారు ఎందరో శరీర శాస్త్రం, శరీర నిర్మాణశాస్త్రం, అంగ నిర్మాణ శాస్త్రాల్లో ఎంతో పురోగతి సాధించారు. మైక్రోస్కోప్‌ను శాస్త్రీయంగా వినియోగించడం, కణాన్ని గుర్తించడంతో అప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారాన్ని తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం ఆరంభమయ్యింది... అనివార్యమైంది. 
ఒక వంకన వివిధ రకాల మొక్కల, వృక్షజాతుల జీవావరణ పరిస్థితుల మీద తులనాత్మక భౌతిక భౌగోళిక అధ్యయనం కొనసాగితే మరోవంకన సమజాతి జీవుల అంగ నిర్మాణానికి సంబంధించిన వివిధ అధ్యయనాలు - అది కేవలం వయసున ఉన్న దశలోనే కాకుండా అన్ని దశలకు సంబంధించి - కొనసాగాయి. ఈ అధ్యయనాలు లోతుగా, నిర్దిష్టంగా కొనసాగిన కొలదీ ప్రకృతి నిర్మాణం మార్పులకు అతీతంగా ఉంటుందనుకున్న భావన పటాపంచలవుతూ వచ్చింది. వివిధ జాతుల మొక్కలు, జంతువులు అనివార్యంగా పరస్పర ఆధారితం అని తెలియవచ్చింది. దీనితో అప్పటివరకూ జరిగిన వర్గీకరణకు కాలం చెల్లిపోయింది. భూభౌతికశాస్త్రంలో అప్పటిదాకా ఉన్న లోపాలు ఒకటొకటిగా తొలగిపోతున్న కొలది సేంద్రియ ప్రపంచ చారిత్రక అభివృద్ధికి, వ్యక్తిగత సేంద్రియ చారిత్రక అభివృద్ధికి మధ్యన ఉన్న సమాంతర సంబంధాలు వెల్లడవుతూ వచ్చాయి. అరియాడ్నె ఆవిష్కరణలతో జీవ-జంతు కీటక శాస్త్రాల్లో మరింత లోతైన అన్వేషణలు సాధ్యపడ్డాయి. 1759లో 'కాంట్‌' సౌర వ్యవస్థ అసంతత్వ భావనమీద దాడిచేసిన నేపథ్యంలోనే సి.ఎఫ్‌. ఫూల్స్‌ జీవజాతుల క్షీణతా సిద్ధాంతాన్ని ప్రకటించాడు. ఓకెన్‌, లామార్క్‌, బాయర్‌లు ఈ సిద్ధాంతానికి కొనసాగింపు కృషి చేశారు. అంతిమంగా వందేళ్ళ తర్వాత డార్విన్‌ 'పరిణామ క్రమ సిద్ధాంతం' వెలుగులోకి వచ్చింది. దాదాపుగా అదే కాలంలో ప్రోటోప్లాజమ్‌, కణం-ఈ రెండూ సేంద్రియ జీవానికి అట్టడుగు స్థాయి రూపాలని నిర్థారణ అయ్యాయి. తద్వారా సేంద్రియ-సేంద్రియేతర స్వభావాల మధ్యన అప్పటిదాకా ఉన్న అగాధం కనీస స్థాయికి తగ్గుముఖం పట్టింది. ప్రకృతి, దాని లక్షణాల పట్ల ఏర్పడిన నూతన ప్రాపంచిక దృక్పథం పరిపూర్ణ స్థాయికి చేరుకుంది. ప్రకృతి స్థిరంగా ఉండిపోతుంది అనే భావన అంతమయింది. అనంతమైన విశ్వానికి ఆపాదించిన అనంతత్వం( క్షయాకానకం) సరికాదు అని కూడా తెలియవచ్చింది. ప్రకృతి సమస్తం చలనశీలమైనదని, నిరంతరం మార్పులకు లోనవుతూ వుంటుందని స్పష్టమైంది. 
ఆ రకంగా మనం గ్రీకు తత్వశాస్త్ర ఆద్యుల ప్రాపంచిక దృక్పథం దగ్గరకి తిరిగి వచ్చాం. ఈ ప్రకృతి యావత్తూ, చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇసుక రేణువు నుండి సూర్యుడిదాకా, ప్రోటోజోవా (ఏకకణ జీవి) నుండి మనిషివరకూ - సమస్త పదార్థం ఉనికిలోకి వచ్చి, వృద్ధిచెంది, గతించిపో తుంటాయి.ప్రకృతి నిరంతర చలనం, నిరంతర మార్పులకు లోనవుతూ వుంటుంది అనేది గ్రీకు తత్వశాస్త్ర సారాంశం. తేడా అల్లా ఆ రోజున గ్రీకు తత్వవేత్తలు మేధోకల్పనగా లోకం ముందుకు వచ్చింది. మన నిర్థారణలు శాస్త్రీయ ప్రాతిపదికన పరిశోధన చేసి నిర్దిష్టంగా, స్పష్టంగా సూత్రీకరించాం. ఈ చక్రపాత పయనాన్ని అనుభవవాద రుజువులతో పరిశీలించదలిస్తే అక్కడక్కడా చిన్న చిన్న లోటుపాట్లు లేవని కాదు, అయితే ఇప్పటిదాకా నిర్దిష్టంగా రుజువు కాబడిన విషయ పరిజ్ఞానంతో పోలిస్తే అవి అంత పరిగణనలోకి తీసుకొనే అంశాలు కాదు. రానున్న కాలంలో ఇవన్నీ ఒకటొకటిగా పరిష్కారం అవుతాయని మనం ఆశించవచ్చు. అదయ్యే పనేనా అని ఎవరన్నా సందేహించ వచ్చు. ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రం వంటి శాస్త్రీయ పరిజ్ఞానం వందేళ్ళక్రితం ఊహింపశక్యం కాని విషయాలేగా, యాభై ఏళ్ళక్రితం దాకా శరీర శాస్త్రం, అంగ నిర్మాణ శాస్త్రం ఊహింపశక్యం కాని విషయాలేగా, నలభై ఏళ్ళ క్రితం దాకా కణ నిర్మాణాన్ని కనుగొంటారని ఎవరన్నా ఊహించి ఉంటారా?- ఇవీ అలానే పరిష్కారం అవుతాయి.
× × ×
అంతులేనన్ని సౌర గ్రహాలు, మన భూమండలం అంతర్భాగంగా ఉన్న సౌర వ్యవస్థ ఇవన్నీ పాలపుంత. ఇవన్నీ వాటి గమనవేగం కారణాన సంకోచించి చల్లబడి, మెరిసే ఘనీభవించిన వాయురూప పదార్థాలుగా అవతరించడం వెనుక గమన సూత్రాలు ఇమిడి ఉన్నాయని వెల్లడయిన తర్వాత, నక్షత్ర గమనం మీద వందల ఏళ్ళపాటు మనలో ఉన్న పొరబాటు భావాలు పటాపంచలయిపోయాయి. నూతన అవగాహన నూతన ఆలోచనలను తోడు చేసింది. అయితే అన్ని రంగాల్లో ఇది ఏకరీతిన జరగలేదు. 
ఖగోళశాస్త్రానికి నానాటికీ కృష్ణబిలాల ఉనికిని తప్పనిసరిగా గుర్తించాల్సిన అగత్యం ఏర్పడింది. కృష్ణబిలాలు అంటే ప్రకృతిలో ఇమిడి వున్న గ్రహాంతర పదార్థం మాత్రమే కాదు అవి ఆరిపోయిన సూర్యగ్రహాల మూలంగా ఏర్పడినవి (మాడ్లియర్‌), మరో ప్రక్కన వాయురూప పాలపుంతల్లో కొన్ని 'ప్లాచ్‌'లు మన సౌర వ్యవస్థలోనే ఇంకా పూర్తిగా ఏర్పడని సూర్యులని (సెచీ) ఆవిష్కరించబడడంతో ఇతర( నెబ్యూలాల)నక్షత్రమండలాల ఉనికిని కొట్టిపారెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. సాపేక్షంగా ఇవి ఏమేరకు అభివృద్ధి చెంది ఉన్నాయనేది 'స్పెక్టోస్కోప్‌'తో మాత్రమే నిర్థారించగలం.
పాలపుంత పదార్థరాశి క్రమంగా సౌరవ్యవస్థగా ఎలా అభివృద్ధి చెందినదీ ఎంతో వివరణాత్మకంగా ఆవిష్కరించాడు లాప్లాస్‌. ఇప్పటిదాకా దీన్ని మించిన వివరణ రాలేదు. తర్వాత తర్వాత జరిగిన పరిశోధనలు కూడా లాప్లాస్‌ ఆవిష్కరణలనే మరింత ఖచ్చితత్వంతో బలపరిచాయి. 
సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అని అంతరిక్షంలో మూడు రకాలుగా ఏర్పడడానికి చలనంలో ఉన్న ఆ పదార్థరాశి కలిగి ఉన్న ఉష్ణశక్తి కారణం. ఉష్ణశక్తిని నిర్దిష్ట పరిస్థితులలో విద్యుత్‌, అయస్కాంత శక్తులుగా మార్చే వీలున్నప్పుడు సూర్యుడు ఎంతటి తీవ్ర ఉష్ణోగ్రత కలిగి ఉన్నప్పటికీ అందులో మూలకాల రసాయన మిశ్రమాల చర్యలను కొట్టిపారెయ్యలేము. ఉష్ణానికి - గురుత్వాకర్షణకు మధ్య ఉండే ఘర్షణ మూలంగా సూర్యుడిలో యాంత్రిక చలనం కలుగుతుందని కనిపెట్టారు మరిన్ని పరిశోధనలలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. పరిమాణంలో చిన్నవిగా ఉండే పదార్థాలు పెద్దవాటికన్నా త్వరగా చల్లబడతాయి. అయితే రెండు సందర్భాలలో పదార్థ కేంద్రం అన్నింటికన్నా ఆఖర్న చల్లబడుతుంది.
ఏ పదార్థరాశి అయినా క్రమంగా చల్లబడేటప్పుడు భౌతిక, అంతర్గత కదలికలో మార్పులు ఒకదానినుండి మరొకదానికి రూపాంతరం చెందుతూ ఒక దశలో రసాయన మార్పులకు పరిస్థితులు పరిపక్వమై ఆ పదార్థరాశిలో రకరకాల రసాయనిక సంయోగ వియోగాలు చోటు చేసుకుంటాయి. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతోపాటుగా ఈ రసాయన సంయోగాలు అందలి మూలకాలతోపాటు, మూలక సంయోగాలను కూడా ప్రభావితం చేసి రసాయన సమ్మేళనాల ఏర్పాటుకు దారితీస్తాయి. క్రమానుగతంగా కొనసాగే ఈ మార్పుల మూలంగా వాయురూపంలో ఉన్న పదార్థం ముందుగా ద్రవరూపంలోకి, తరువాత ఘన పదార్థరూపంలోకి మారుతుంది. తద్వారా నూతన పరిస్థితులు ఆవిర్భవిస్తాయి. 
అట్లా ఒక గ్రహ పదార్థం గట్టి గుల్లగా తయారయినాక దాని ఉపరితలం మీద నీరు నిల్వ ఉండటం పెరుగుతూ ఉంటుంది. ఆ గ్రహ పదార్థ కేంద్రం నుండి వెలువడే ఉష్ణోగ్రతలతో పోలిస్తే దాని ఉపరితలం అంతర్గత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేకొలది (వీటి) ఆవిర్భావం పెరుగుతా వస్తుంది. ఆ రకంగా దాని వాతావరణంలో వచ్చే మార్పులు భౌగోళిక మార్పులుగా అవతరిస్తాయి.
అంతిమంగా ఉపరితలంమీద ఉష్ణోగ్రత గణనీయమైన ప్రదేశం మేరకు సరిసమానంగా ఉంటే ప్రోటీన్లు జీవం పోసుకొనే అవకాశాలు ఏర్పడతాయి. ఇతరత్రా రసాయన పరిస్థితులు కూడా అనుకూలిస్తే జీవం ఉన్న ప్రోటోప్లాజమ్‌ అవతరిస్తుంది. అనుకూల పరిస్థితులు ఏమిటనేవి మనకు తెలియకపోవచ్చు. ఆ మాటకి వస్తే ప్రోటీన్ల రసాయన ఫార్ములానే మనకు ఇంతరకూ తెలియదు. ప్రొటీన్లలో ఉండే వివిధ రసాయనాలు ఏమిటో కూడా పూర్తి సమాచారం లేదు. అయితే ఒక దశాబ్దం క్రితమే నిర్మాణ రహిత ఈ ప్రొటీన్‌ల మూలంగానే అరుగుదల, విసర్జన, కదలిక, కుంచించుకుపోవడం, ప్రతిస్పందన, ప్రత్యుత్పత్తి వంటి క్రియలన్నింటికీ కీలకం అని కనుగొన్నారు. 
అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి, ఈ ఆకార రహిత ప్రోటీన్‌ మొదటగా కణాన్ని ఉత్పత్తి చెయ్యడానికి, ఒక న్యూక్లియర్‌, ఒక కణపొర ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అయితే ఈ కణజాలం ఆవిర్భావంతో ఆర్గానిక్‌ ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. అసంఖ్యాకమైన సెల్యూలార్‌, నాన్‌-సెల్యూలార్‌ జీవులనేకం ఆవిర్భవించాయి. ఈ జీవులను వృక్షజాతి, జంతుజాతిగా వర్గీకరించారు. 
మనిషి అవతరణ కూడా ఇలానే జరిగింది. ఏక కణం నుండి సంక్షిప్త అంగ నిర్మాణం దాకా మానవజాతి అవతరణ ఒక చారిత్రక క్రమంలో జరిగినదే. చతుష్పాద జంతువులా నాలుగు కాళ్ళ నడక నుండి రెండు కాళ్ళు, రెండు చేతులుగా వైవిధ్యం సంతరించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. నిటారుగా నడవడానికి మరికొన్ని వేల ఏళ్ళు పట్టింది. కోతినుండి మానవరూపంలోకి పరిణామ క్రమం తరువాత మాటనేర్వడం, ఆ తరువాత మెదడు అభివృద్ధి చెంది ఆలోచించగలగడంతో మానవ పరిణామక్రమం పరిపూర్ణమయ్యింది. వానరుడికి నరుడికి మధ్యన పూడ్చలేని అగాధం ఏర్పడిపోయింది.
చేతిని పనిముట్టులా వాడుకోవడం మానవ కార్యకలాపాల్లో ప్రత్యేకతగా నిలిచింది. తద్వారా మానవుడికి ప్రకృతికి మధ్యన ఉత్పత్తి సంబంధం ఏర్పడింది. జంతుజాలానికి చేతులు ఉన్నాయి. వాటినీ ప్రకృతినుండి తమ ఆహార సముపార్జనకు వాడుకుంటాయి. అంతవరకే వాటి పరిమితి. కాని మానవుడి విషయంలో అలా కాదు. ప్రకృతిమీద తనదైన ముద్రవేశాడు. మొక్కలని, జంతుజాలాన్ని ఒకచోట నుండి మరొకచోటుకి మార్చగలగడం, తన ఆవాస ప్రాంత వాతావరణాన్ని తనకి అనువుగా మార్చుకోవడం ద్వారా నెమ్మది నెమ్మదిగా ప్రకృతిమీద పట్టు సాధించసాగాడు. మానవుడు ఇదంతా కేవలం తన చేతులతో సాధించాడు. ఆ తరువాత అంచెలంచెలుగా చేతులతో పాటు మెదడు అభివృద్ధి కావడంతో ఆ చైతన్యాన్ని ఉపయోగ పెట్టుకొని పరిస్థితులను విశ్లేషించి ఆచరణలో ఉపయోగపడతాయనుకొనే కార్యకలాపాలు చేపట్టసాగాడు. ప్రకృతి నియమాలకు సంబంధించి జ్ఞానాన్వేషణకు పూనుకున్నాడు. ప్రకృతి సూత్రాలను ఒకటొకటిగా అర్థం చేసుకోవడం ద్వారా ప్రకృతిమీద నానాటికీ పట్టు పెంచుకోసాగాడు. చేతులను పనిముట్టుగా వినియోగించడంతో పాటు సమాంతరంగా మెదడుకు పదునుపెట్టడం ద్వారా మానవాళి అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రకృతిని ఎక్కువగా వినియోగించుకోవటం సాధ్యపడింది.
మానవజాతి 'చరిత్ర'లోకి మనం అలా అడుగుపెట్టాం. జంతుజాలానికి ఒక చరిత్ర ఉంది. వాటి పుట్టుక, పరిణామక్రమం ఇవన్నీ వాటితో ప్రమేయం లేకుండా సాగిన చరిత్ర వాటిది. కాని వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన అనంతరం మానవుడు చైనత్యపూర్వకంగా తన చరిత్రను తానే నిర్మించుకున్నాడు. మానవజాతి చరిత్రలో అదృశ్యశక్తుల ప్రమేయంగాని, అదాటు పరిణామాల ప్రమేయంగాని నామావశిష్టంగా మారింది. మానవజాతి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా చరిత్ర ప్రభవించింది. అయితే ఇవే ప్రమాణాలను మానవజాతి చరిత్రకు అన్వయించి చూసుకుంటే మానవ మేధస్సు ఈ నాటికి ఎంత అభివృద్ధి చెందిందో, ఎంతటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నదో వాటికీ వాస్తవాలకు మధ్యన అంతులేని వ్యత్యాసం ఉండడం మనం గమనించవచ్చు. దీనికి కారణం అనియంత్రిత శక్తుల ఆధిపత్య ప్రభావాలే అని వేరుగా చెప్పనక్కరలేదు. ఇది ఇంతకన్నా భిన్నంగా ఉండకపోవడం సహజమైన విషయమే. ఎందుకంటే వానరుడు నరుడుగా అవతరించడానికి ఒక పాదార్థిక పునాది ఉంది. అసంఖ్యాకమైన కార్యకలాపాలకు ఈ పాదార్ధిక లక్షణాలే పునాదిగా నిలిచాయి. మానవాళి తన అవసరాలకోసం చేపట్టిన ఉత్పత్తి - సామాజిక ఉత్పత్తి - కార్యకలాపాలు అన్నీ అనియంత్రిత శక్తుల అవాంఛిత ప్రభావాలతో అంతర్గతంగా ఘర్షణపడి, కొన్ని మినహాయింపులతో విజయం సాధించినవే తప్ప ఎక్కువ సందర్భాలలో వైఫల్యం చెందినవే.
అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లో ప్రకృతి శక్తులను చెరబట్టి మానవాళి అవసరాల పేరిట అలవిమాలిన ఉత్పత్తిని చేపట్టారు. ఒకప్పుడు వందమంది పెద్దవాళ్ళు కలిసి చేసే ఉత్పత్తిని ఒక పిల్లవాడితో చేయిస్తున్నారు. దీని ఫలితం ఏమిటి? పనిభారం పెరిగింది. ప్రజల కష్టాలు కడగండ్లు పెరిగాయి. ప్రతి పదేళ్ళకు ఒకసారి భారీ సంక్షోభాలు వస్తున్నాయి. స్వేచ్ఛాపోటి, మనుగడ కోసం పోరాటం అన్న పదాలను అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవేత్తలు అత్యున్నత చారిత్రక విజయాలుగా కీర్తిస్తున్నారు. కాని అలాంటి జంతు లక్షణాలను గురించి డార్విన్‌ చెప్పిన వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. మానవాళిమీద, ముఖ్యంగా తన దేశ జనులమీద తాను రాసిన క్రూర పరిహాసం ఎటువంటి ప్రభావం చూపుతుందో బహుశా డార్విన్‌కి తెలిసి ఉండదు. చైతన్యయుతమైన, నిర్మాణాత్మకమైన సామాజిక ఉత్పత్తి మాత్రమే... ఎక్కడయితే ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికాబద్ధంగా సాగుతాయో - మానవాళిని జంతు ప్రపంచం నుండి వేరు పరుస్తుంది. ఇది కేవలం సామాజికపరమైన అంశమే కాదు.( దైహికపరమైన) అంశం కూడా. చారిత్రక పరిణామ క్రమం మాత్రమే అలాంటి సమాజాన్ని అనివార్యం చేస్తుంది. రోజు రోజుకీ ఆ సమాజ ఆవిర్భావాన్ని మరింత దగ్గర చేస్తుంది. అలాంటి సమాజం సాకారం అయిన రోజున చరిత్ర ఒక నూతన శకంలోకి ప్రవేశిస్తుంది. సకల మానవాళి, మానవాళి సకల కార్యకలాపాలూ, ముఖ్యంగా విజ్ఞానాభివృద్ధి ఫలాలు - మనుపెన్నడూ లేనంత స్థాయిలో అభివృద్ధి చెందుతాయి.( గతం మొత్తాన్ని విస్తుపోయేలా చేస్తుంది.)
సృష్టిలో ప్రతిదీ లయం కావల్సిందే. లక్షల ఏళ్ళు గడవనీ, వందల వేల తరాలు జన్మించి మరణించనీ, ప్రపంచమంతటికీ వేడిమిని పంచుతున్న సూర్యుడిలో ఉష్ణోగ్రతలు తగ్గి ధృవప్రాంతాల్లో మంచును కరిగించడంలో విఫలమవుతాయి. మానవజాతి భూమధ్యరేఖ సమీపంలోకి కిక్కిరిసి చేరిపోతారు. అప్పటికీ బతకడానికి తగినంత వేడిమి పొందలేకపోతారు. క్రమేపీ ఈ భూమ్మీద జీవజాలం తన ఉనికిని కోల్పోతుంది. జీవం అంతరించిపోతుంది. ఈ భూమి కూడా చలికి బిగుసుకుపోయిన మరో చంద్రగ్రహంలా మారుతుంది. చీకటి కుహరంలోకి జారిపోయి, సంకుచిత కక్ష్యలో తిరుగాడుతూ అప్పటికే అవశేషప్రాయంగా మారిన సూర్యగ్రహంలోకి కూలిపోతుంది. ఇంతకుముందు ఉన్న గ్రహాలకు పట్టిన దుస్థితి ఇదే. మిగిలిన గ్రహాలకూ పట్టబోయే దురవస్థా అదే. తన వేడిమితో సౌరవ్యవస్థ మనుగడకు ప్రాణవాయువుగా నిలిచిన సూర్యగ్రహం చప్పున చల్లారిపోతే జరగబోయే వినాశనం ఇది. అయినప్పటికీ ఈ గ్రహాలు విశ్వాంతరాళంలో మృతకక్ష్యలో తిరుగాడుతూనే ఉంటాయి. మన సౌరవ్యవస్థకు పట్టిన గతే ఈ విశ్వాంతరాళంలో ఉన్న మిగిలిన గ్రహ వ్యవస్థలకూ పడుతుంది. మన భూమిమీదకి ఇప్పటికీ తన కాంతిని ప్రసరింపచెయ్యలేనంత సుదూర తీరాల్లో ఉన్న గ్రహాల వెలుగు రేపు ఎప్పుడైనా ఈ భూమిని తాకినా దానిని ఆస్వాదించే మానవ నేత్రం మిగిలి ఉండదు.
సౌరవ్యవస్థ జీవచరిత్ర అంతటితో అంతరించిపోయి 'చావు'ను చవిచూస్తుందా? ఆ తర్వాత ఏమిటి? ఈ అనంత విశ్వంలో సూర్యగ్రహ కళేబరం అంతం లేకుండా పరిభ్రమిస్తుంటుందా? వైవిధ్యభరితమైన వివిధ ప్రాకృతిక శక్తులు ఒకే ఒక చలన రూపాన్ని 'ఆకర్షణ'ని సంతరించుకుంటాయా?
లేక సెక్‌చీ ప్రశ్నించినట్లు ''ప్రకృతిలోని ఈ శక్తులు మృతప్రాయమైన వ్యవస్థను తిరిగి మెరిసే పాలపుంతలాంటి తన యధాతథస్థితికి రూపాంతరం చెందుతాయా, నూతన జీవానికి తిరిగి ప్రాణం పోస్తాయా?'' ఏం జరగనున్నదో మనకి తెలియదు. 
అప్‌కోర్స్‌, మనకు తెలియదు అన్నామంటే మనకు రెండు రెళ్ళు నాలుగని, పదార్థ ఆకర్షణ శక్తి దూరానికి అనుగుణంగా పెరుగుతూ తరుగుతూ వస్తుందని తెలిసినంత పక్కాగా తెలియదని కాదు. ప్రకృతి శాస్త్రం సిద్ధాంతపరంగా సాధ్యమైన మేరకు ప్రకృతితో సామరస్య సహ జీవన ప్రాపంచిక దృక్పధాన్ని కలుగచేస్తుంది. ఆలోచనలేని శుద్ధ అనుభవవాదులు కూడా దీన్ని అంగీకరిస్తారు. మనం మన పరిజ్ఞాన లోపాన్ని అధిగమించాలంటే మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనేఆసక్తి, నిరంతర ధ్యాస మనలో ఉండాలి. పదార్థ చలనాన్ని నాశనం కావించలేమనే తత్వశాస్త్ర సూత్రాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్రం (సైన్స్‌) అందిపుచ్చుకోవాలి. ఈ సూత్రాన్ని వదిలిపెడితే విజ్ఞానశాస్త్రం అనేదే మన జాలదు. పదార్థ చలనాన్ని కేవలం యాంత్రిక చలనంగానో, ఒక చోటు నుండి మరొక చోటుకు మారడం అనే సామాన్య అర్థంలోనో చూడకూడదు. పదార్థ చలనం అంటే ఉష్ణ, కాంతి, విద్యుత్‌ అయస్కాంతాల తలతన్యత, అంతర్గత చలనం రసాయన సంయోగం, వియోగం, జీవం, అన్నింటికీ మించి అది ఒక చైతన్యం. అనంతకాలంలో పదార్థ ఉనికి ఒకే ఒక రూపంలో ఉంటుంది. పదార్థ అనంతత్వంతో పోలిస్తే ఈ అనంతకాలం అతి స్వల్పమైన కాలం. అయితే ఈ పదార్థం చలనం ద్వారా వైవిధ్యత సంతరించుకుంటుంది. చలనం పదార్థ లక్షణాన్నే మార్చివేస్తుంది. ఏతావాతా పదార్థమనేది జీవరహితమైనది. చలనం అనేది జవజీవమైనది అని మనం అర్థం చేసుకోవచ్చు. చలనాన్ని నాశనం చెయ్యలేమని పరిమాణాత్మకంగానే కాదు, గుణాత్మకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యాంత్రిక చలనం ఒక ప్రదేశంనుండి మరొక ప్రదేశానికి మారడమే అయినప్పటికీ నిర్దిష్ట అనుకూల పరిస్థితులలో అది ఉష్ణంగా, విద్యుత్‌గా, రసాయన చర్యగా, జీవంగా మారుతుంది. కాని చలనం తనంతతానుగా ఈ నిర్దిష్ట అనుకూల పరిస్థితులను సృష్టించలేదు. అలాంటిదానినే జడంగా మారిన చలనం అంటాం. రూపాంతరం చెందే శక్తిని కోల్పోయిన చలనానికి తిరిగి ఆ సామర్థ్యాన్ని అందించాలంటే 'శక్తి'ని సంతరిస్తే సరిపోదు. దానికి 'డైనమిక్స్‌' జత చెయ్యాలి. అలా చెయ్యాలంటే పాక్షికంగా దాన్ని ధ్వంసం చెయ్యాలి. అయితే ఈ రెండు ఊహింపనలవి కానివి.
అయితే ఒకటి మాత్రం తథ్యం. విశ్వాంతరాళంలో మనం ఉన్న ఈ భూగోళం ఏదో ఒక స్థాయి చలనంలో వేడెక్కింది. తద్వారా మనం చూస్తున్న 'సౌర వ్యవస్థ' ఆవిర్భవించింది. అది ఏ స్థాయి చలనమో ఇప్పటికీ అంతుబట్టలేదు. మనం చూస్తున్న పాలపుంతలో హీనపక్షంగా 20 లక్షల నక్షత్రాలు వున్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక నాటికి అంతరించిపోతాయి. 
మరి తరువాత ఏం జరుగుతుంది? ఫాదర్‌ సెక్‌చీ అంచనా వేసినట్లుగా మన సౌర వ్యవస్థ నుండే మరో నూతన సౌరవ్యవస్థ ఆవిర్భవించటానికి తగిన ముడి సరుకు దొరుకుతుందా? ఏమని సమాధానం చెప్పగలం. అయితే భావవాదులు భావించినట్లు ఆ సృష్టికర్తే పునఃసృష్టి చేస్తాడని ఓ దణ్ణం పెట్టి సరిపెట్టుకోవాలి. లేదంటే భౌతికవాద దృక్పధం ప్రకారం పదార్థ చలనం మూలంగా మరలా సౌరవ్యవస్థ, ఈ విశ్వం ఏర్పడతాయని నిర్ణయానికి రావడమా. మొదటి సూత్రం ప్రకారం చిటికెలోనో, ఏడు రోజుల్లోనో ఈ సృష్టి జరిగిపోవాలి. కాని రెండవ సూత్రం ప్రకారం అలాంటి సృష్టి జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. పరిస్థితులు కలిసివచ్చే అవకాశం ఉంటేనే అదైనా జరుగుతుంది.
శాస్త్రవేత్తలు అలాంటి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతరిక్షంలో భారీ శకలాలు ఒకదానిమీద మరొకటి కూలిపోతాయని, అలా భారీ శకలాలు ఒకదానినొకటి ఢకొీట్టే సమయంలో వెలువడే ఉష్ణోగ్రతల మూలంగా కొత్తగా నక్షత్రాలు ఆవిర్భవించవచ్చు. మరికొన్ని మరింత వెలుగు సంతరించుకోవచ్చు అని ఖగోళ శాస్త్రజ్ఞులు లెక్కలు కట్టి చెబుతున్నారు. మన గ్రహాలు ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లే, సూర్యగ్రహం కూడా మనకు కనబడే విశ్వంలో తిరుగుతున్నది. ఈ విశ్వం అంతా అంతరిక్షంలోని ఇతర విశ్వాలతో సమాంతర ఆకర్షణ శక్తితో తిరుగుతూ ఉంటుందని, ఇవన్నీ పరస్పర ఆకర్షణతో అంతరిక్షంలో గిరికీలు కొడుతున్నాయని తేల్చి చెబుతున్నారు. అంతరి క్షంలో అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు ఒకేస్థాయిలో లేవని ఇప్పటికే చాలామంది చెబుతున్నారు. చివరిగా మనం తేల్చుకోవాల్సింది ఏమిటంటే ఏదో స్వల్ప మినహాయింపులు మినహా ఈ విశ్వంలో ఉన్న అసంఖ్యాకమైన సూర్యుల వేడిమి అంతరిక్షంలోకి అదృశ్యమైపోయినా అంతరిక్ష ఉష్ణోగ్రతను ఒక సెంటీగ్రేడు డిగ్రీలో లక్షవవంతు కూడా పెంచలేదు.
మరయితే అంతటి వేడిమి ఏమైపో యినట్టు? విశ్వాంతరాళాన్ని వెచ్చచేసే ప్రయత్నం లో ఆవిరయి పోయిందా? ప్రాక్టికల్‌గానే అంతటి ఉష్ణం అదృశ్యమైపోయిందా? కేవలం సైద్ధాంతికంగా మాత్రమే ఉనికిలో ఉందా? చలనానికి నాశనం ఉండదనే సూత్రం ప్రకారం పై సందేహాలకు అసలు తావు ఉండకూడదు. భారీ శకలాలు ఒకదానితో ఒకటి ఢకొీని పతనమవుతూ యాంత్రిక చలనం ఉష్ణంగా మారి విశ్వంలోకి వికిరణం చెందుతుంది. పదార్థశక్తి అవిచ్ఛిన్నమైనది అయినట్లే చలనంకూడా అవిభాజ్యమైనది. కాబట్టి మనం ఏం భావించవచ్చు అంటే - విశ్వంలోకి వికిరణం చెందిన ఉష్ణోగ్రత మరో (పదార్థ) చలన రూపం తీసుకోవచ్చు. అలా చలన రూపంలో నిల్వ ఉన్న ఉష్ణం చల్లారిన సూర్య గ్రహాల్లో తిరిగి వేడిమిని పుట్టించవచ్చు. ఈ అంశాన్ని భవిష్యత్‌ పరిశోధనలు శాస్త్రీయంగా నిగ్గు తేల్చాల్సివుంది.
ఈ అనంత విశ్వంలో అనేకానేక ప్రపంచాలు ఉన్నాయనే అంచనా ప్రకారం ఈ ప్రపంచం నాశనమైనా తిరిగి పునరుద్భవిస్తూనే ఉంటుంది. ఇది అనంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది అంటాడు జె.డబ్ల్యు.డ్రేపర్‌. పదార్థ చలనం అనేది వర్తులం రూపంలో అనంతంగా కొనసాగుతుంటుంది. ఈ వర్తులం ఒక కక్ష్యలో పరిభ్రమణం కావించడానికి ఎన్ని కాంతి సంవత్సరాలు పడుతుంది అనేది ఇప్పటికయితే సరైన అంచనా లేదు. ఈ వర్తులకాలంలో ఒక దశలో అత్యున్నతస్థాయి అభివృద్ధి కారణంగా సేంద్రియ జీవం ఏర్పడి జీవం పట్ల, ప్రకృతి పట్ల చైతన్యాన్ని సంతరించుకుంది. సూర్యుడు, నక్షత్ర ధూళి (నెబ్యూలా), ఏకకణజీవి, బహుకణ జీవి. రసాయన సంయోగ వియోగాలు అన్నీ... ఏదీ అనంతమైనది కాదు, కానీ అనంతంగా మార్పులకు లోనవుతూనే ఉంటాయి. పదార్థం అనేది చలన సూత్రాల ప్రకారం చలిస్తుంది. మార్పుకు లోనవుతుంటుంది. ఒక సౌర వ్యవస్థలో అదీ ఒకే ఒక్క గ్రహం మీద సేంద్రియ జీవాభివృద్ధికి తగిన పరిస్థితులు ఉన్నాయి. అనేక జీవాలు పుట్టి గిట్టే క్రమంలో మానవుడి మెదడు అభివృద్ధి చెందింది. ఈ మొత్తం పరిణామ క్రమం అంతా చివరికి అంతమై తీరుతుంది. కాని పదార్థం మాత్రం మిగులుతుంది. పదార్థం అనేక రూపాల్లోకి మార్పులు చెందినా దాని లక్షణాలు మాత్రం కోల్పోదు. అందుకే ఈ భూమి అంతరించిపోయినా, ఆలోచనా జ్ఞానం కలిగిన మానవజాతి అంతరించిపోయినా తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఇదే పరిణామ క్రమం పునరావృతం కాక మానదు.