అన్ని విధాలా వెనుకబాటుకు గురైన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ది కోసం రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని వామ పక్ష నేతలు ప్రకటించారు. జిల్లాను అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురిచేసిన పాలక, ప్రతిపక్ష పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదన్నారు. రాష్ట్రానికి హోదా కావాలని కోరుతున్న ముఖ్యమంత్రికి వెనుకబడిన జిల్లాలు గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. అభివృద్ధిని కోరే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏటీసీ హాలులో జరి గిన సదస్సుకు సిపిఎం ప్రకాశం జిల్లా (తూర్పుప్రాంత) కమిటీ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్.నారాయణ అధ్యక్షత వహించారు. జిల్లా అభివృద్ధిపై 17 అంశాలతో కూడిన తీర్మానాన్ని పూనాటి ఆంజనేయులు ప్రవేశ పెట్టారు. జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయించాలని, తక్షణం వెనుకబడిన జిల్లాగా గుర్తించాలన్నవి ప్రధానాంశాల్లో వున్నాయి. అనంతరం సిపిఐ (ఎంఎల్), జనసేన, అమ్ ఆద్మీ, లోక్‌సత్తా, బహుజన రాజ్యం, బిఎస్పీ పార్టీల నేతలు, అభివృద్ధి వేదికల నా యకులు తీర్మానాన్ని బలపరుస్తూ ఇంకొన్ని సూచనలు చేశారు.
పోరాటాలకు సమాయత్తం కావాలి : రామకృష్ణ
సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లా డుతూ.. ప్రకాశం జిల్లా అన్ని విధాలా వెనుకబడిందన్నారు. ప్రభుత్వ నిరాదరణకు గురైన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రకాశం జిల్లా కోసం పోరాటాలు చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు 2016 నాటికి పూర్తి చేస్తామని చెప్పి నేటికీ పూర్తి చేయలేక పోయారన్నారు. రామాయపట్నం పోర్టు కోసం కేంద్రానికి నివేదిక పంపలేదన్నారు. జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓట్ల డిగే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి పదేళ్లు హోదా కావాలని కోరిన బిజెపి నేతలు ఇపుడు దాటేసే సమాధానాలు చెబుతున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం, బిజెపి లకు ఓట్లడిగే అర్హత కూడా లేదన్నారు. ఇక వైసిపి ఎమ్మెల్యేలు గెలిచినా అసెంబ్లీకి వెళ్లరనీ, ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదనీ అన్నారు. అందుకే ప్రత్యామ్నాయ పార్టీలు కీలకమన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలు రావాలన్నారు.
జిల్లాను వెనుకబడిన జాబితాలో చేర్చాలి : శ్రీనివాసరావు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రకాశంను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలన్నారు. ఇందుకోసం ఓ అధ్యయన కమిటీని వేయాలన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీల గుత్తాధిపత్యానికి దెబ్బకొట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాల్సిన అవసరం వచ్చిందన్నారు. సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కలిసికట్టుగా ఉమ్మడి పట్టుపట్టాలన్నారు. టిడిపికి ఓట్లేయలేదని నిధులు ఇవ్వలేదంటున్నారని, కక్ష సాధింపు మీ పతనానికి నాంది పలుకుతుందని ముఖ్యమంత్రిని హెచ్చరిం చారు. జిల్లాలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించాల్సిన వైసిపి ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా పార్టీలు మారారన్నారు. నిధుల కోసం వెళ్లామని చెబు తోన్న వైసిపి ఎమ్మెల్యేలు జిల్లాకు ఎన్ని రూ.కోట్లు నిధులు తెచ్చారని ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినా ఆ స్పృహ వారిలో లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం, వెనుకబాటుపై పోరా డిన సిపిఎం నేతలను జైలుకు పంపారన్నారు. పుష్కరాలకు గోదావరిలో రూ.రెండు వేల కోట్లు పోశారన్నారు. అవి వెలుగొండకు ఇస్తే అది పూర్తయ్యేదన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు సమగ్రాభివృద్ధిని కోరుతుంటే.. పాలకులు కార్పొరేట్ల అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధిని పట్టించుకోని పాలకులు అభివృద్ధి కోసం పోరాడుతోన్న కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ పి.జె. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిపై శాసన మండలిలో పోరాడామని, ప్రభుత్వాన్ని నిలదీశామని చెప్పారు. వెనుకబాటుకు తెలుగుదేశం, కాంగ్రెసుపార్టీలే కారణమన్నారు. సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బా రావు, సిపిఐ రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య తదితరులు మాట్లాడారు.