ఏళ్లతరబడి సాగు చేసుకొంటున్న భూములను పేదల నుంచి బలవంతంగా తీసుకునే సత్తా ప్రభుత్వంతోపాటు ఎవరికీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకిలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రభావిత ప్రాంతాలైన సన్యాసిరాజుపేట, ఓదిపాడు, తోటాడ గ్రామాల్లో శుక్రవారం ఆయన పరిశీలించారు. పోలాకి మండల కేంద్రంలో రైతులతో మాట్లాడారు. జిఒ 1307 ప్రకారం బలవంతంగా భూములు లాక్కోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 థర్మల్ ప్రాజెక్టులున్నాయని, రాష్ట్రావసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి ఉండగా, ఇంకా కొత్త పవర్ ప్లాంట్ల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.