'పోలాకి' థర్మల్‌ అధర్మాలు..

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డదార్లు తొక్కుతోంది. ఎనిమిది గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాల భూములు గుంజుకోజూస్తున్నది. రైతులు సుక్షేత్రాలైన భూములను కోల్పోతే వ్యవసాయ కార్మికులు, వృత్తిదార్ల జీవనోపాధి పోతుంది. ప్లాంట్‌ నిర్మాణం చేపట్టడానికి ముందుగా చేయాల్సిన కనీస నియమ నిబంధనలను పాటించకపోవడమేగాక సాధారణ ప్రజాతంత్ర హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్‌రంగ పరిస్థితి అంటే ఇప్పుడు పని చేస్తున్న, నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే ప్రకటించిన ప్లాంట్లు, విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా, తదితర వివరాలు చూద్దాం. ప్రపంచమంతటా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అణు విద్యుత్‌ కేంద్రాలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు వద్దే వద్దంటున్న నేపథ్యంలో పోలాకిలో థర్మల్‌ ప్లాంటు నిర్మాణం కోసం ప్రభుత్వం పడుతున్న తహతహ, నియమ నిబంధనల ఉల్లంఘన తీరుతెన్నులు పరిశీలిద్దాం.
విద్యుదుత్పత్తి పరిస్థితి
ప్రస్తుతం రాష్ట్రంలో థర్మల్‌, హైడల్‌, గ్యాస్‌ ఉత్పత్తితోపాటు కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి స్థాపిత సామర్థ్యం 11,450.22 మెగా వాట్లు. ఇవికాక ఎపి జెన్‌కో, మరో రెండు ప్రాజెక్టులు (కృష్ణపట్నం, ఆర్‌టిపిపి) 3,800 మెగావాట్ల సామర్థ్యం కలవి వస్తున్నాయి. అంతేగాక ప్రయివేటు రంగంలో ఇప్పటికే ఐదు ప్రాజెక్టులు 4,130 మె.వా. సామర్థ్యం కలవి నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాక విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో 4,000 మె.వా. పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించిన పబ్లిక్‌ హియరింగ్‌ కూడా ఇటీవల జరిగింది. ఇప్పటికే అనుమతులు పొందినవి, ప్రకటింపబడినవి నవ్యాంధ్రప్రదేశ్‌లో 50 వేల మె.వా. స్థాపక సామర్థ్యంతో ప్లాంట్లు రానున్నాయని అంచనా. రాష్ట్రంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌లు (ప్రభుత్వ, ప్రయివేటు) 2,770 మె.వా. సామర్థ్యం గలవి ఉన్నప్పటికీ గ్యాస్‌ కేటాయింపు లేనందు వల్ల కేవలం 500 మె.వా. సామర్థ్యం కలవి మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం 2014 జులైలో విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొంది. హైడల్‌ ప్లాంట్ల సామర్థ్యం 1,747.6 మె.వా. అయినా వర్షాలు, రిజర్వాయర్ల నీటి మట్టాలపై ఆధారపడి వాటి ఉత్పత్తి ఉంటుంది.
డిమాండ్‌, సరఫరా
విద్యుత్‌ వాడకం సంగతి చూస్తే గత ఏడాది కాలంలో 43,810 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగం జరిగింది. దాదాపు కొరత ఏర్పడలేదు. ఈ ఏడాది మే 27న గరిష్టంగా 155.32 మి.యూ. డిమాండ్‌ రాగా ఆరోజున 147.8 మి.యూ. సరఫరా అయ్యింది. అంటే కేవలం 7.5 మి.యూ. మాత్రమే కొరత ఏర్పడింది. కాబట్టి రాష్ట్రంలో గరిష్ట డిమాండ్‌ ఉన్ననాడు కూడా సరఫరా కొరత ఐదు శాతం కూడా లేదు. రానున్న ఏడాది అంచనా పరిశీలించినా అంత తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం లేదు. పైపెచ్చు రాష్ట్రంలో ప్రధాన వినియోగమైన పారిశ్రామిక రంగం ఇబ్బందుల్లోనే కొనసాగు తున్నది. ఇప్పటికే జూట్‌ మిల్లులు, ఫెర్రోఎల్లారు పరిశ్రమలు మూతబడ్డాయి. కొత్త పరిశ్రమలు అంతగా స్థాపించ బడడంలేదు. ముఖ్యమంత్రి ఊదరగొడుతున్న ప్రతిపాదిత సంస్థలన్నీ కంప్యూటర్‌ ఆధారితమైనవే తప్ప వస్తూత్పత్తి రంగానికి చెందినవి అతి స్వల్పం. (ఆ రంగంలోనే విద్యుత్‌ వినిమయం ఎక్కువగా ఉంటుంది.) ఈ రాష్ట్రమేగాక దేశంలో వస్తూత్పత్తి రంగం వృద్ధి రేటు మందగమనంలోనూ కొన్ని త్రైమా సికాల్లో ప్రతికూలంగానూ ఉంది. కాబట్టి విద్యుత్‌ డిమాండ్‌ అంతగా పెరిగిపోయే స్థితి లేదు. కానీ 2018-19 కల్లా డిమాండ్‌ 82,392 మిలియన్‌ యూనిట్లకు అంటే నాలుగేళ్లలో రెట్టింపవుతుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి డిమాండ్‌ పెంచి చూపడం గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న జిమ్మిక్కే! 90వ దశ కం నాటి ఎన్రాన్‌ ఉదంతం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
రాష్ట్రంలోని డిమాండ్‌ తీర్చడానికి ఇప్పటికే ఏర్పాటైన జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్లను పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయించాలి. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లకు మన తీరంలోని కెజి బేసిన్‌ నుంచి సహజ వాయువును కేటాయిస్తే పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతామని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు గ్యాస్‌ కేటాయింపులను సాధిస్తే డిమాండ్‌ పెరిగినా మనకు విద్యుత్‌ కొరత కలిగే అవకాశమే రాదు.
అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతున్నదేమిటి?
రాష్ట్రంలో విద్యుత్‌ కొరత అంత తీవ్రంగా లేదు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్న నేపథ్యంలో కొత్తగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను నిర్మించవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. కానీ విదేశీ మోజు, కొత్త ప్రాజెక్టులొస్తున్నాయన్న ప్రచారం కోసం ప్రభుత్వం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. దేశమంతటా పవర్‌ ప్లాంట్ల కోసం వెంపర్లాట విపరీతంగా ఉంది. మోడీ అధికారానికి వచ్చాక చేస్తున్న ''మేక్‌ ఇన్‌ ఇండియా'' ప్రచారంలో విదేశాల నుంచి వస్తుందని చెప్పే పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క విద్యుత్‌ రంగంలోనే ఉండడం అందుకు నిదర్శనం. అంతేగాక విదేశీ బొగ్గు మీద సైతం మన పాలకులకు మోజు విపరీతంగా ఉంది. దేశంలో బొగ్గు నిల్వలున్నా వాటిని సక్రమంగా వినియోగించకుండా విదేశీ బొగ్గును దిగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2000-01లో 20.93 మిలియన్‌ టన్నుల బొగ్గు దిగుమతి కాగా 2015 మార్చి ఒక్క నెలలోనే 24.3 మిలియన్‌ టన్నులు దిగుమతి అయ్యింది. గత ఏడాది అంటే 2014-15లో 242.4 మిలియన్‌ టన్నులు దిగుమతి జరిగిందంటే ఈ 15 సంవత్సరాల్లో డజను రెట్లు పెరిగిందన్నమాట. ఇవే విధానాలు అనుసరిస్తే హనుమంతుడి తోకలా ఇంకెంత పెరుగుతుందో కదా!
థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు కాలుష్య కారకాలని, వాటిని పరిహరించాలని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఘోషిస్తున్నారు. దేశ దేశాల్లో పెరిగిన ప్రజా ఒత్తిడికి పాలకులు తలొగ్గక తప్పలేదు. అమెరికా, ఇంగ్లండ్‌తో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కొత్తగా థర్మల్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఎక్కడా ప్రజా ధనం వినియోగించరాదన్న విధానాన్ని అమలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆగష్టు 3న ప్రకటించిన 'క్లీన్‌ పవర్‌ ప్లాన్‌'లో ఆ దేశ కర్బన ఉద్గారాల్లో అతి పెద్ద భాగం థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లదేననీ, 2030 కల్లా ఉద్గారాలను 32 శాతం తగ్గిస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, భవిష్యత్తరాల సంక్షేమానికి ఇది ఎంతో అవసరమన్నారు. అంటే అమెరికాలో రానున్న కాలంలో కొత్త థర్మల్‌ ప్లాంట్లు రాకపోవడమేగాక ఉన్నవాటిలోనూ కొన్నింటిని మూసివేయడం లేదా ఉత్పత్తి తగ్గించడం జరుగుతుందన్న మాట. అమెరికా విద్యుదుత్పత్తిలో 37 శాతం థర్మల్‌ కాగా భారత్‌లో దాని వాటా 60 శాతం. కాబట్టి ఇక్కడి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కదా! ఎక్కడ మాట్లాడినా సింగపూర్‌, జపాన్‌ అంటూ గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి అభివృద్ధి చెందిన దేశాలకు నాయకుడుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు చెప్పే ఇలాంటి మాటలను పట్టించుకోరా?
గోప్యత... నిబంధనలకు పాతర
రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం (2001) ప్రకారం ఏదైనా భారీ ప్రాజెక్టు డెవలపర్లను, కన్సల్టెంట్లను నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం ఓపెన్‌ బిడ్డింగ్‌తో సహా పారదర్శకమైన విధానాన్ని అనుసరించవలసి ఉంది. కానీ ఇవేవీ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం జపాన్‌కు చెందిన సుమిటోమో కంపెనీని నిర్ణయించింది. అంటే ప్రభుత్వమే చట్ట ఉల్లంఘనకు పాల్పడిందన్నమాట. అంతేగాక సుమిటోమోతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని (ఎంఒయు) రహస్యంగా ఉంచింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆ ఒప్పంద ప్రతి కోసం ప్రయత్నించినా దాన్ని తొక్కిపట్టారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఎయస్‌ అధికారి ఇఎయస్‌ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినా సర్కారులో చలనం రాలేదు.
ప్లాంట్‌ కోసం ఎనిమిది గ్రామాల్లోని సుమారు 2,000 ఎకరాల పైగా భూములను గుంజుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో దాదాపు మూడవ వంతు ప్రభుత్వ భూములేనని కూడా చెబుతోంది. నిజానికి ఆ భూములన్నీ జిరాయితీ, బంజరు, పోరంబోకు... ఏ పేరుతో ఉన్నా స్థానిక ప్రజల అనుభవంలో ఉన్నాయి. అంతేగాక సుమారు 40 శాతం భూములు వంశధార ప్రాజెక్టు నీటితో రెండు పంటలు పండుతున్నవే! ప్రాజెక్టుకు కేంద్ర బిందువుగా చెప్పబడుతున్న మెట్ట (చిన్నపాటి కొండ) గొర్రెలు, మేకలకు పచ్చిక బీడుగానూ, ఈత చెట్లతోనూ నిండి ఉంది. మెట్ట చుట్టూ కొన్ని దోభీ ఘాటు ్లన్నాయి. కాబట్టి థర్మల్‌ ప్లాంటు వస్తే రైతులు సారవంతమైన భూములను కోల్పోవడమేగాక వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు. గీత కార్మికులు, గొర్రెలు, మేకల పెంపకం దార్లు, ఇతర వృత్తిదార్లు కూడా జీవనోపాధి లేకుండా పోతారు. కాబట్టే అక్కడి ప్రజలంతా ప్లాంటు మాకొద్దని వ్యతిరేకిస్తున్నారు. జులై 9న పోలాకిలో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ నృశింహంతోనూ అదే మొర పెట్టుకున్నారు.
నిర్బంధం
బాధిత ప్రజానీకాన్ని కలిసి వారి కష్టాలను తెలుసుకొని, ఆందోళనల్లో వారికి తోడు నిలుస్తామని చెప్పేందుకు వెళ్ళిన సిపియం రాష్ట్ర కార్యదర్శి పి మధును ఆముదాలవలస రైల్వే స్టేషన్‌లో ఆగష్టు 12న అరెస్టు చేసిన తీరు ఎమర్జెన్సీని తలిపించింది. ఇంకా తెల్లవారక ముందే రైలు దిగిన వెంటనే ప్లాట్‌ఫాం మీదనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుణ్ణి పోలీసులు చుట్టుముట్టడం, సెల్‌ ఫోన్‌ గుంజుకోవడం ఏ సంస్కృతికి నిదర్శనం? ఆగస్టు 2న పోలాకి జూనియర్‌ కాలేజీ ఆవరణలో సదస్సు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోగా వేరే ప్రదేశంలో జరుపుకోవలసివచ్చింది. ప్రభుత్వం చేస్తున్న చట్ట ఉల్లంఘనలు బహిర్గతమౌతాయని, ప్రజలు సంఘటితమై ప్రతిఘటన పెరుగుతుందనే ప్రభుత్వం నిర్బంధానికి తెగబడుతోంది. అంత మాత్రాన సత్యం దాగివుండదు కదా! ప్రపంచంలో అనేకచోట్ల నిర్బంధం ప్రయోగిస్తే ఉద్యమాలు సమసిపోలేదు సరికదా మరింతగా పెల్లుబికాయి. పోలాకిలోనూ అదే పునరావృతం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నేల విడిచి సాము చేయడం కాకుండా ఉన్న విద్యుత్‌ ప్లాంట్లను నడపడానికి గ్యాస్‌ కేటాయింపులు సాధించడం, నిర్మాణంలో ఉన్న జెన్‌కో ప్లాంట్ల నిర్మాణం వేగ వంతం చేయడంపై దృష్టి పెట్టాలి. ఇంకా పెరిగే అవసరాలకు సౌర, పవన విద్యుదుత్పత్తి దిశగా యోచించడం మంచిది.
 - బి తులసీదాస్‌