
దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పది వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించింది. గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలపాలని నాయకులు నిర్ణయించారు. జర్రెల ప్రాంతానికి 10 వామపక్ష పార్టీల నాయకులు వెళ్ళి బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా తొలగించడానికి నిరసనగా గ్రామాల్లో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం పర్యటించాలని నిర్ణయించారు.