పొంచివున్న విద్యుత్‌ ఛార్జీల ముప్పు

ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఐదేళ్ళ బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తామనడం సబబు కాదు. ఇప్పుడు 2009-10 నుంచి 2013-14 వరకు ఎపిఇపిడిసిఎల్‌ రూ.1,158 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.6,051 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీలు ప్రతిపాదించారు. రెండు డిస్కాంల వాదనల్లో అనేక అంతరాలు, అసంగతాలు ఉన్నాయి. ఇఆర్‌సి అనుమతించిన దానికంటే తక్కువ విద్యుత్‌ను సరఫరా చేశారు. అలాగే కొనుగోలు చేసిన విద్యుత్‌ పరిమాణం కూడా తక్కువే. (పరిస్థితి ఇలావుండగా రానున్న ఐదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన గాల్లో మేడలు కట్టడమే కదా!) అయినా ఖర్చు మాత్రం చాలా పెరిగిందని డిస్కాంలు వాదిస్తున్నాయి.

గడచిన ఎన్నికల్లో ''జాబు కావాలంటే బాబు రావాలి'' అని చేసిన ప్రచారం సంగతి ఎలా ఉన్నా ''బాబు వచ్చారంటే కరెంటు ఛార్జీలు పెరుగుతాయి'' అన్నది మాత్రం నిజంలా ఉంది. తాజాగా ట్రూఅప్‌ ఛార్జీల పేరిట రూ.7,209 కోట్ల కరెంటు భారాన్ని వేయడానికి డిస్కాంలు ప్రతిపాదనలు సమర్పించగా వాటిపై బహిరంగ విచారణను సెప్టెంబరు 19న నిర్వహించాలని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఇఆర్‌సి) నిర్ణయించింది. ఇదికాక ఎపి ట్రాన్స్‌కో కూడా మరో రూ.285 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీల ప్రతిపాదన చేసింది. అంటే ప్రజలపై కొత్తగా రూ.7,494 కోట్ల కరెంటు భారాన్ని వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. శ్రీకాకుళం మొదలు నెల్లూరు జిల్లా వరకు తీరం వెంబడి అనేక థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల పేరిట సుక్షేత్రాలైన భూములను గుంజుకోవాలని సర్కారు ప్రయత్నిస్తోంది. భారత్‌-అమెరికా అణు ఒప్పందంలో భాగంగా కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు యంత్రాంగం కదుల్తోంది. ఇదంతా ఎందుకు అంటే విద్యుత్‌ వినియోగం రానున్న ఐదేళ్ళలో మూడు రెట్లు పెరుగుతుందని ప్రభుత్వం భ్రమ కల్పిస్తోంది. అందరికీ 24 గంటలు నిరంతరాయ విద్యుత్‌ అందిస్తామని చెబుతున్న మాటల ఆచరణ విషయం ఎలావున్నా ఒకవైపు ఛార్జీల భారం, ఇంకోవైపు కొత్త ప్లాంట్ల పేరిట వ్యవసాయ భూములు గుంజుకోవడం వంటి చర్యలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం 2000 ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌ అమరులయ్యారు. సుమారు 40 మంది తూటాల వల్ల గాయపడగా వేలాదిమందికి లాఠీదెబ్బలు తగిలాయి. దాదాపు దశాబ్ద కాలంపాటు కరెంటు ఛార్జీలు పెరగలేదు. ఇప్పటికీ వంద యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు సుమారుగా అప్పటి ఛార్జీలే అమలు కావడం కూడా ఆ ఉద్యమ ఫలితమే. ఆ నేపథ్యంలో నేటి పరిస్థితులను పరిశీలిద్దాం.
ఎందుకీ ఛార్జీల పెంపు?
గడిచిన సంవత్సరాల ఎఆర్‌ఆర్‌లలో పేర్కొననివి, అంతకుముందు అనుకున్నా ఆచరణలో తేడాల వల్ల జరిగే అదనపు ఖర్చును తరువాతి సంవత్సరాల్లో రాబట్టడానికి ట్రూఅప్‌ ఛార్జీలని పేరు పెట్టారు. ఏటా ఎఆర్‌ఆర్‌ ప్రతిపాదనలు ఇఆర్‌సి ముందుంచడం, అనేక విశ్లేషణలు చేయడం, వాటిపౖౖె బహిరంగ విచారణ జరిగిన అనంతరం ఛార్జీల పెంపుదలను నిర్ధారిస్తారు. ఆ సందర్భంలోనే అన్ని రకాల ఖర్చులను, అంతకు ముందరి ఏడాది చూపించని ఖర్చులతో కలిపి ప్రతిపాదనలు పెడితే సరిపోతుంది. అంతే తప్ప ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఐదేళ్ళ బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తామనడం సబబు కాదు. ఇప్పుడు 2009-10 నుంచి 2013-14 వరకు ఎపిఇపిడిసిఎల్‌ రూ.1,158 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.6,051 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీలు ప్రతిపాదించారు. రెండు డిస్కాంల వాదనల్లో అనేక అంతరాలు, అసంగతాలు ఉన్నాయి. ఇఆర్‌సి అనుమతించిన దానికంటే తక్కువ విద్యుత్‌ను సరఫరా చేశారు. అలాగే కొనుగోలు చేసిన విద్యుత్‌ పరిమాణం కూడా తక్కువే. (పరిస్థితి ఇలావుండగా రానున్న ఐదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన గాల్లో మేడలు కట్టడమే కదా!) అయినా ఖర్చు మాత్రం చాలా పెరిగిందని డిస్కాంలు వాదిస్తున్నాయి. ఎస్‌పిడిసిఎల్‌ 7,060 మి.యూ తక్కువ కొన్నది. కానీ అనుమతించిన రూ.27,176 కోట్ల బదులు రూ.30,070 కోట్లు ఖర్చయిందంటున్నది. అలాగే ఇపిడిసిఎల్‌ కూడా 2,851 మి.యూ తక్కువ కొనుగోలు చేసి రూ.1,818 కోట్లు అదనపు ఖర్చు పేర్కొంది. కొనుగోలు, సరఫరా చేసిన విద్యుత్‌ పరిమాణం తగ్గినా ఖర్చు పెరిగిందన్న వాదనను ఎలా అంగీకరించగలం? అసలు ఈ ఖర్చుల పెంపుదలకు సంబంధించి డిస్కాంలు ఎలాంటి వివరాలూ పేర్కొనలేదు. సంవత్సరాలవారీగా అనుమతించిన పరిమాణం, ఖర్చు, వాస్తవంగా జరిగిందింత అని పట్టికలు ఇచ్చారే తప్ప స్పష్టమైన వివరాలు లేవు. ఇంధన సర్‌ఛార్జి సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఎ) ప్రతిపాదనల సందర్భాల్లో ఇలాంటి వివరాలన్నీ పేర్కొనేవారు. ఇప్పుడెందుకలా వెల్లడించలేదో కారణం తెలియదు. ఆశించి నంత ఆదాయం కూడా రాలేదని డిస్కాంలు వాదిస్తున్నాయి. ఇందుకు కారణాలుగా అంచనా వేసినదానికన్నా విద్యుత్‌ అమ్మకం తగ్గిందని, దాంట్లో కూడా వివిధ కేటగిరీల శాతాల్లోనూ హెచ్చుతగ్గులు వచ్చాయని తెలిపారు. అంటే పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేల వినియోగం 50 శాతం అంచనా వేయగా అది 52 శాతానికి పెరిగిందని, ఆ కారణంగా ఆదాయంలో తేడాలు వచ్చాయన్నారు. కానీ ఇందుకు సంబంధించి కూడా గుండుగుత్తగా అంకెలిచ్చారే తప్ప వివరాల్లేవు.
డిస్కాంల వాదనల్లో వ్యత్యాసాలెన్నో...
నిర్వహణ (ఓÊఎం) ఖర్చులు ఎస్‌పిడిసిఎల్‌కు రూ.2,573 కోట్లు అనుమతించగా రూ.3,782 కోట్లు అంటే 47 శాతం పెరిగింది. అదే ఎపిడిసిఎల్‌ రూ.1,987 కోట్ల నుంచి రూ. 2,524 కోట్లకు పెరిగింది. అంటే పెరుగుదల 27 శాతం మాత్రమే. రెండు డిస్కాంలు రాష్ట్ర ప్రభుత్వ రంగంలోనే ఉండగా ఇంత తేడా ఎలా వచ్చిందో! ఇక ఉద్యోగుల జీతభత్యాల విషయమూ అలాగే ఉంది. ఎస్‌పిడిసిఎల్‌లో అనుమతించిన దానికంటే రూ.1,001 కోట్లు, ఇపిడిసిఎల్‌లో రూ.471 కోట్లు పెరిగింది. ఎస్‌పిడిసిఎల్‌లో 50 శాతం పెరుగుదల కాగా ఇపిడిసిఎల్‌లో పెరుగుదల 27 శాతం కావడానికి కారణాలు వివరించలేదు. రిపేర్ల విషయం మరింత అన్యాయంగా ఉంది. ప్రైవేటు వారికి అప్పగించబడిన సబ్‌ స్టేషన్లు ఎస్‌పిడిసిఎల్‌లో 2009-10లో 738 కాగా అవి 2013-14 నాటికి 1,133కు పెరిగాయి. ఇపిడిసిఎల్‌లో ఇదే కాలంలో 402 నుంచి 520కి పెరిగాయి. అయితే ఒక్కో సబ్‌ స్టేషన్‌కు కాంట్రాక్టరుకు చెల్లించిన మొత్తాల్లో విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఇపిడిసిఎల్‌లో 2013-14లో రూ.4.9 లక్షలు చెల్లించగా ఎస్‌పిడిసిఎల్‌లో రూ.6.44 లక్షలు చెల్లించారు. ఎస్‌పిడిసిఎల్‌లో 2012-13లో సబ్‌స్టేషన్‌కు రూ.7.04 లక్షలు చెల్లించగా తరువాత ఏడాది రూ.6.44 లక్షలకు తగ్గింది. రేటు తగ్గింపు మూలంగా డిస్కాంకు ఆదా అయిన మాట నిజమే అయినా అంతకు ముందరి ఏడాది చాలా ఎక్కువ మొత్తం కాంట్రాక్టర్లకు చెల్లించారన్నది అంతకంటే కఠోరమైన వాస్తవం. ఇంతింత వ్యత్యాసాలకు కారణాలు ఏమిటో ఎక్కడా వివరణ లేదు. రెండు డిస్కామ్‌ల మధ్య గల ఇంత తేడాకు కారణమేమిటో కూడా తెలపలేదు.
క్యారీయింగ్‌ కాస్ట్‌ పేరిట దగా
ఐదేళ్ళ కాలంలో పేరుకుపోయిన మొత్తాలను ట్రూఅప్‌ ఛార్జీల పేరిట ఒకేసారి వసూలు చేయడం అన్యాయం కాగా ఆ మధ్య కాలానికి వడ్డీ వసూలు చేయడం మరింత దుర్మార్గం. దానికే క్యారీయింగ్‌ కాస్ట్‌ అని ముద్దు పేరు పెట్టారు. నిజానికి ఈ ఐదేళ్ళలో పేరుకున్న మొత్తం రూ.5,462 కోట్లు. కానీ దానికి క్యారీయింగ్‌ కాస్ట్‌ పేరిట ఏడాదికి 12 శాతం వడ్డీ చొప్పున రూ.1,747 కోట్లు కలిపి ట్రూఅప్‌ ఛార్జీల భారం రూ.7,209 కోట్లు ప్రతిపాదించారు. క్యారీయింగ్‌ కాస్ట్‌ నిజంగా ఉంటే డిస్కాంలతో పాటు ట్రాన్స్‌కోకు కూడా వర్తించాలి. కానీ 2015 మార్చి 16న ట్రాన్స్‌కో సమర్పించిన ట్రూఅప్‌ ఛార్జీల ప్రతిపాదనలో క్యారీయింగ్‌ కాస్ట్‌ పేర్కొనలేదు. మరి డిస్కాంలు ఎందుకు విధిస్తున్నాయి? విద్యుత్‌ వినియోగదారులపై ఈ వడ్డీ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇఆర్‌సి అనుమతించరాదు. ప్రతి ఏడాది ఒకసారి ఛార్జీలను నిర్ణయించడం, అలాగే అంతకు ముందరి ఏడాదికి సంబం ధించిన ఊహించని ఖర్చులను, హెచ్చుతగ్గులను టారిఫ్‌ నిర్ణయంలో కలిపేస్తేనే వినియోగదారులకు ఎప్పటిదప్పుడు తేలిపోతుంది. డిస్కాములకూ అదే మంచిది. కానీ మల్టీ ఇయర్‌ టారిఫ్‌ (ఎమ్‌వైటి) విధానం పేరిట ఐదేళ్ళకొకసారి ప్రజలపై అదనపు భారాన్ని వేయడం తగదు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చి ప్రతి సంవత్సరం మార్చిలో ఎఆర్‌ఆర్‌తో పాటు అన్నీ కలిపి నిర్ణయించే విధానాన్ని ఇఆర్‌సి చేపట్టాలి. డిస్కాం లేదా ట్రాన్స్‌కో అదనపు ఖర్చుల విషయమై ఇఆర్‌సికి ప్రతిపాదిస్తే అనుమతించిన మేరకు ఆ మొత్తాలను ఏ సమయంలో లేదా ఎన్ని వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారో ముందే చెబుతారు.

కానీ ఈ ట్రూఅప్‌ ఛార్జీలను ఎప్పుడు, ఎలా వసూలు చేయనున్నదీ ప్రతిపాదనల్లో ఎక్కడా పేర్కొనలేదు.
మరి ఈ కసరత్తు ఎందుకు చేస్తున్నట్లు? కేవలం ఇఆర్‌సి వద్ద నమోదు చేయడం కోసమేనా? ఇప్పుడు అనుమతి పొంది ఆ తరువాత దొంగచాటుగా ఛార్జీలు పెంచాలన్న దుష్ట తలంపు ప్రభుత్వానికుందా? ఈ విషయా లను బహిరంగ విచారణ సందర్భంగానైనా వెల్లడించడం అవసరం. ఆ మేరకు ఇఆర్‌సి డిస్కాంలను ఆదేశించాలి.ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని డిస్కాంల్లో కొనసాగిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే ట్రూఅప్‌ ఛార్జీలను తెలంగాణలోనూ విధించాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని అక్కడి విద్యుత్‌ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ వినియోగదారులపై భారం వేయడానికి తహతహలాడుతోంది. కరెంటు ఛార్జీల పెంపుదలకు, తెలుగుదేశం పాలనకు విడదీయరాని ముడి ఉందన్న మాట. రాష్ట్ర ప్రభుత్వం వేయజూస్తున్న భారాలను ప్రజలు తిప్పికొట్టాలి. ఈ ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకుకు అందని పోకకు పొందని వాదనలతో డిస్కాంలు చేసిన ట్రూఅప్‌ ఛార్జీల ప్రతిపాదనలను ఇఆర్‌సి తిరస్కరించాలి.
బి. తులసీదాస్‌