పేదల ఇళ్ళ పట్టాలకై ఆందోళన..

సంఘటితంగా ఉద్య మించి ఇళ్ల పట్టాలు, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం సాధించుకోవాలని, లేకపోతే ఈ ప్రభుత్వం ఉన్న గూడును కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు కృష్ణాకరకట్ట నివాసుల పరిరక్షణకై రిటైనింగ్‌వాల్‌ నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో రామలింగేశ్వర్‌నగర్‌లోని తారకరామా నగర్‌, ఇతర ప్రాంతాల్లో సోమవారం పాదయాత్ర చేశారు. బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో కృష్ణాకరకట్ట పరివాహక ప్రాంత పరిధిలోని 8.5 కిలోమీటర్ల పరిధిలో పేదలు నివాసాలుండే గృహాలను తొలగించాలన్న ప్రభుత్వం యోచనను అందరూ సంఘటితంగా తిప్పికొట్టాలని కోరారు. ఇప్పటికే భవానీపురం ప్రాంతనివాసులకు కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. అయితే కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వర్‌నగర్‌ పరిధిలోని రణదివేనగర్‌, తారక రామానగర్‌, భూపేష్‌గుప్తానగర్‌ ప్రాంతాల్లో కృష్ణాకరకట్ట ప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడంతోపాటు ఇళ్లకు పట్టాలు మంజూరు చేయనున్నట్లు తూర్పునియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు వాటిని అమలు చేయకపోగా, రోజుకోమాట మాట్లాడుతూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారని మండిపడ్డారు. సిఎం చంద్ర బాబు మాటలకు, ఎమ్మెల్యే రామమోహన్‌ చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదని దుయ్య బట్టారు. ఒకవైపున కృష్ణాకరకట్ట పరిధిలో 8.5 కిలోమీటర్ల పొడవున సుందరీకరణ పేరుతో గృహాలను తొలగించాలని సిఎం సంబంధిత అధికా రులను ఆదేశిస్తుంటే, మరో వైపున తన నియోజక వర్గ పరిధిలో రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే మాట్లాడుతుండటం ఎవరిని మోసగించడానికని తీవ్రంగా మండిపడ్డారు.