పేదల ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కై ఆందోళన

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. కబేళా, సింగ్‌నగర్‌లో, జక్కంపూడి వైఎస్‌ఆర్‌కాలనీలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లు పూర్తి చేసి పేదలకు కేటాయించాలని, ఎక్సెల్‌ ప్లాంట్‌ స్థలంలో ఉన్న చెత్తను తరలించి మొత్తం స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని కోరారు. డిస్నీల్యాండ్‌లోని 57 ఎకరాలు, ఇతర ప్రభుత్వ ఖాళీ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని, న్యూ ఆర్‌ఆర్‌పేటలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు వెంటనే కేటాయించాలని కోరారు. పేదలకిచ్చే ఇళ్లలో లబ్ధిదారుడి వాటా, రుణం 10 శాతం మించకుండా చేసి మిగిలిన 90 శాతం ప్రభుత్వమే భరించాలని, జక్కంపూడి, నూ ఆర్‌ఆర్‌పేట, వాంబేకాలనీ, రాధానగర్‌, కండ్రికలోని జి+3, ఇతర ఇళ్ల బకాయిలు రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్లతో కూడిన పట్టాలు పేదలకు పంపిణీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.