పేదలు,విద్యార్థులపై కేసులా?

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఒక దళితుడి చేయి విరిగిందని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా, పేదలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారని మండిపడ్డారు. పోలీసులు భూస్వామికి కొమ్ము కాసి తప్పుడు కేసులు మోపడం దుర్మార్గమన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసులు ఉపసంహరించుకుని పేదలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కడప నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్ధినుల మృతి పట్ల ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ తదితర విద్యార్ధి సంఘ నాయకులు 14 మందిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు కూడా ఆయన ఖండించారు. వీరందరినీ ఈ నెల 19వ తేదీ రాత్రి జైలుకు పంపారన్నారు. ఇదే సంఘటనపై గుంటూరులో ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేసి, రోడ్లపై ఈడ్చుకువెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిపై నిర్భంధం ప్రయోగించడం గర్హనీయం అన్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ నిర్భంధ చర్యల్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ నిర్భంధాన్ని ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, తప్పుడు కేసులు ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.