పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి

ఉండవల్లి హరిజనవాడకెళ్లే దారిలో ప్రభుత్వ భూమికి సంబంధించిన స్థలంలో ఇళ్లు వేసుకుంటామని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు స్థలాల్లోకి శనివారం చేరుకున్నారు. పుష్కరాల సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్ళస్థలాలిస్తామని హామీనిచ్చి మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం పేదల ఇళ్లు తొలగించారు. నెలలు గడుస్తున్నా పేదలకు స్థలాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇందుకు ఉండవల్లి హరిజనవాడకెళ్ళే దారిలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, మున్స్పిల కార్యాలయ ముట్టడి చేపసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పేదలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో పేదలు సిపిఎం నాయకులతో కలిసి స్థలంలోకి వెళ్ళారు. మీరు హద్దులు నిర్ణయించి పంచకపోతే తామే 60గజాల చొప్పున ప్లాట్లు వేసుకొని రోడ్లు విడగొట్టుకుంటామని సిపిఎం నాయకులూ, పేదలూ కమిషనర్‌ బిక్కిరెడ్డి శివారెడ్డికి తెలిపారు. స్థలంలోకి వచ్చిన కమిషనర్‌ సెంటు చొప్పున మున్సిపల్‌ ఎఈతో విడగొట్టి ఇస్తామని హామీనిచ్చారు. తాడేపల్లి ప్రాంతంలో పెరిగిన ఇంటి అద్దెలతో తాము అద్దెలు చెల్లించలేకపోతున్నామని పేదలు వాపోయారు. అధికారులు, పాలకవర్గం ఇచ్చిన హామీమేరకు ఇప్పటికైనా పేదలకు కేటాయించిన స్థలాల్లో విద్యుత్‌, మంచినీరు సౌకర్యం కల్పించడంతోపాటు రోడ్లు వేయాలని సిపిఎం డిమాండ్‌చేస్తుంది.