పేదలంటే ప్రభుత్వానికి అలుసెందుకు?

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 15 లక్షల ఎకరాలతో భూమి బ్యాంకునే ఏర్పాటు చేసి పారిశ్రామిక వృద్ధికి వినియోగించాలని చెబుతున్నది ఈ భూ సేకరణకు ప్రభుత్వం ఎసైన్డ్‌ భూములను లక్ష్యంగా పెట్టుకున్నది. దీని వల్ల రాజ్యాంగ లక్ష్యమైన పేదరిక నిర్మూలన దెబ్బతింటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భూమి పంపకం జరగకుండా పేదరిక నిర్మూలన జరగడం కల్ల అని చెప్పారు. మహత్తర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలు, అతివాద ఉద్యమాలు భూపంకం ఎజెండాను ముందుకు తెచ్చాయి. అందువల్లనే 1955 ఎఐసిసి ఆవడిలో భూ సంస్కరణలు తెస్తామని తీర్మానం చేయవలసి వచ్చినది. ఈ నేపథ్యంలో వచ్చిన అనేక చట్టాలలో భూసంస్కరణ చట్టం 1972 ముఖ్యమైనది. అప్పటి వరకు ప్రభుత్వ భూములు, బంజర్లకు అక్కడక్కడా ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చింది. కొన్ని చోట్ల ఫీల్డ్‌ లేబర్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీలను భూమి లేని పేదలతో ఏర్పాటు చేసి వారు సమిష్టిగా సాగు చేసుకునేందుకు పట్టాలిచ్చింది. ఈ విధంగా పంచిన భూముల విషయమై 1977లో సమీక్ష జరిగింది. పంపిణీ జరిగిన భూములను పేదరిక నిర్మూలనకై ఇవ్వగా వాటిని భూస్వాములు, ధనాఢ్య వర్గాలు, పలుకుబడిగలవారు పేదలను బెదిరించి, డబ్బుతో ప్రలోభపెట్టి హస్తగతం చేసుకున్నారు. భూ పంపిణీ తర్వాత కూడ పేదల స్థితిగతుల్లో మార్పురాలేదు. ఈ నేపథ్యంలోనే అనేక అధ్యయనాలు, ఉద్యమాల అనంతరం ''భూ బదలాయింపు నిరోధక చట్టం 1977 (పిఒటి) తెచ్చారు.
పేదరికిన్నా నిర్మూలించాలంటే ఎట్టి పరిస్థితిలోను ఎసైన్డ్‌ భూమి అన్యాక్రాంతం కాకుండా, పేదల దగ్గరే ఉండేట్లు ఆ చట్టంలో కట్టుదిట్టం చేశారు. అందుకు ఎసైన్‌మెంటు భూమి కొన్నా లేక అక్రమం కల్గి ఉన్నా ఆ వ్యక్తిని బాధ్యుణ్ణి చేశారు. అందుకు 6 నెలల జైలు లేక రూ.10,000 జరిమానా లేక ఆ రెండూ విధించే పద్ధతి అందులో పొందుపర్చారు. అంతేగాక ఎసైన్‌మెంటు భూమిని సబ్‌రిజిస్ట్రారు ఆఫీసులో రిజిస్టరు కాకుండా నిరోధించారు. ఒక వేళ రిజస్టరు చేస్తే ఆ అధికారికి శిక్ష విధిస్తారు. అంతేకాక ఆ భూమిని అసలు ఎసైనీకి లేదా వారి వారసులకు రీ ఎసైన్‌ చేస్తారు. తిరిగి అన్యాక్రాంతమైతే మరొక అర్హుడైన పేదవానికి ఎసైన్‌ చేస్తారు. కానీ ఈ చట్టంలో అన్యాక్రాంతం కాకుండా ఉన్న ఈ చర్యలను ప్రభుత్వ ఇంత వరకు తీసుకున్న పాపానపోలేదు. 2006-2007లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిగాయి. అన్యాక్రాంతమైన భూములను గుర్తించటం జరిగిందని చెప్పినప్పటికీ ఆక్రమణదారులపై చర్య తీసికునేందుకు వీలున్న సెక్షన్‌-7 క్రింద ఎక్కడా కేసులు పెట్ట లేదు.
ఈ సందర్భంలోనే ఇడుపులపాయలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అక్రమంగా వందల ఎకరాలు ఎసైన్‌మెంటు భూమి కల్గి ఉన్నట్టు బహిర్గతమయింది. దాని నుంచి బయటపడేందుకు ఆయన ఎసైన్‌మెంటు యాక్టు సెక్షన్‌-7కు సవరణ తెచ్చారు. ఎసైన్‌మెంటు భూమిని అక్రమంగా కల్గిఉన్న వ్యక్తి ఈ సవరణను శాసనసభ ఆమోదించి అమలులోకి వచ్చిన 20 రోజుల లోపల ఆ భూమిని ప్రభుత్వా నికి అప్పగిస్తే ఆ వ్యక్తి శిక్ష నుంచి మినహాయించబతాడు. దీనివల్ల రాజశేఖరెడ్డి మినహాయించబడ్డారు. కానీ ఇతరు లెవరూ ప్రభుత్వానికి భూములు అప్పగించిన దాఖలాలు లేవు.
ప్రభుత్వం రాజధాని నిర్మాణం కొరకు భూ సమీకరణ ద్వారా సుమారు 2,000 ఎకరాల ఎసైన్‌మెంటు భూమి తీసుకున్నది. జిరాయితీ భూమి తీసుకున్న రైతులకు కౌలు చెల్లింపు జరగలేదు. ఎంత చెల్లించాలనేది కూడా నిర్ణయించలేదు. నష్టపరిహారం క్రింద అభివృద్ధి పరచిన భూమి జిరాయితీ రైతులకు 1,300 నుండి 1400 చదరపు గజాలు వాణిజ్య, నివాస భూమియిస్తుండగా ఎసైన్‌మెంటు రైతులకు ఎకరాలకు కేవలం 800 చదరపు గజాలు మాత్రమే ఇస్తానని ప్రకటించింది. నష్టపోయే దానిలో జిరాయితీ (పట్టా భూమి) రైతులకు, ఎసైన్‌మెంటు భూమి రైతులకు తేడా లేదు. కానీ పరిహారం ఇవ్వటంలో ప్రభుత్వం ఎందుకు వివక్షత పాటిస్తున్నది? ఈ ఎసైన్‌మెంటు రైతులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు, పేదలు, పలుకుపబడి లేనివారు. ప్రభుత్వం భూ సేకరణ జరిపినప్పుడు ఎసైన్‌మెంటు భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని 2005లో ప్రభుత్వ జీవో 135 తెలియజేస్తున్నది. అంతేగాక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఎసైన్‌మెంటు భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. పులిచింత ప్రాజెక్టు పునరావాస కాలనీల భూ సేకరణలో జీవో 135 ప్రకారం పట్టా భూములతో సమానంగా ఎసైన్‌మెంటు భూములకు నష్టపరిహారం చెల్లించారు. కాని తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానం అమలు జరపటానికి నిరాకరిస్తున్నది?
ఈ సంవత్సర వేసవిలో ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టింది. దీని వల్ల ప్రభుత్వం ఒక్క చుక్క నీరు నిలబెట్టింది లేదు. ఒక చెట్టును అదనంగా పంచిందిలేదు. జరిగింది మాత్రం నీరు నిలవని చెరువు లోతట్టు ప్రాంత భూముల సాగుదార్లయిన పేదలు, దళితులను భూముల నుంచి తొలగించారు. పాలక పార్టీ నాయకులు మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా పేదలను తొలగించారు. అధికార యంత్రాంగం అధికార పార్టీ నాయకుల పనిముట్లుగా మాత్రమే పనిచేశారు. కారణం సాగుదార్లు పేదలు, దళితుల కావటమే. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, చట్టబద్ధమైన కార్యనిర్వహణ చేయవలసిన రాజ్యాంగ యంత్రంలో ఇటీవలి కాలంలో పెద్ద మార్పు వచ్చింది. పోలీసు, ప్రభుత్వ అధికార్లు అధికారంలో ఉన్నవారి మౌఖిక ఆదేశాలు అమలుచేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. దళితులు, పేదలకున్న చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు కాపాడే స్థితిలో అధికార యంత్రాంగం లేదు. పాలక వర్గాల ప్రయోజనం కోసం పనిచేసే అధికార పార్టీ ప్రజలను చూసే దృష్టిలో గతానికి, ఇప్పటికి మార్పు వచ్చినట్లు కన్పిస్తున్నది.
అందుకే ఆంధ్రప్రదేశ్‌లో దళితులు, వెనుకబడిన కులాలవారు, పేదలు, రైతుల ప్రయోజనాలను బలిపెట్టటానికి 15 లక్షల ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుకు పూనుకున్నది. పారిశ్రామికవేత్తలకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, విదేశీ వ్యాపారులకు భూములు కట్టబెట్టేందుకు పూనుకున్నది. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనం కాపాడేందుకేనా? వీరికోసం ఈ ప్రజలందర్నీ బలి చేయటం ఎందుకు? పేదల జీవితాలలో మౌలిక మార్పు సమగ్ర భూ పంపిణీ వల్ల మాత్రమే వస్తుంది తప్ప ఇప్పటి ప్రభుత్వ విధానాలు తేలేవు. దేశంలో గత 69 సంవత్సరాల అనుభవం చెబుతున్నదదే. దేశం ప్రభుత్వ భూ దాహాన్ని నిలువరించాలంటే పెద్ద ప్రజా ఉద్యమం అవసరం సామాజిక మార్పు భూ పంపిణీ ద్వారా మాత్రమే సాధ్యం.
- గద్దె చలమయ్య
(వ్యాసకర్త సిపియం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ సభ్యుడు)