పెరుగుతున్నధరలు-ప్రతికూల ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రభుత్వా ధికారులు విశ్లేషణలు చేస్తున్నారు. హోల్‌సేల్‌ ధరల సూచి 2014 జులై కన్నా 2015 జులైలో 4.05 శాతం తక్కువగా నమోదయిందని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవ చ్చునని, కాబట్టి ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు డిమాండు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వు బ్యాంక్‌ ఈ నెల 17-18 తేదీలలో జరిగే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటుందని పారిశ్రామికవేత్తలు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల జీవితాలకు సంబంధించి చూస్తే అధికారుల లెక్కలకు, వాస్తవ జీవితానికి పొంతన లేని పరిస్థితులున్నాయి. నిత్యావసర సరుకులన్నింటి ధరలు పెరుగుతున్నాయి. రోజువారీ ఆహారంలో వినియోగించుకొనే ప్రతి సరుకు ధర పెరిగిపోయింది. బియ్యం ధర కిలో రూ.40కి పైగా ఉంది. కందిపప్పు రూ.150కి చేరుకుంటున్నది. మినప, పెసర పప్పులు రూ.120 దాటి పెరుగుతున్నాయి. వేరుశనగ రైతులు దివాళా తీస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వేరుశనగపప్పు ధర మాత్రం కిలో రూ.120కి తగ్గటం లేదు. చింతపండు, పంచదార, బెల్లం, ఇతర ఏ సరుకుల ధరలూ తగ్గలేదు. నిజ జీవితంలో ధరలు పెరుగుతుంటే, ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని అధికారులు ఎందుకు ప్రకటిస్తున్నారు? 
ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని లెక్కించటానికి అనుసరిస్తున్న విధానంలోనే ఇందుకు మూలాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలను లెక్కించటానికి ప్రభుత్వం హోల్‌సేల్‌ ధరల సూచీ (డబ్లియుహెచ్‌ఐ), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ)లను ప్రమాణాలుగా తీసుకొంటున్నది. హోల్‌సేల్‌ ధరల సూచీలో మూడు ప్రధాన భాగాలుంటాయి. ప్రాథమిక వస్తువులు, ఇంధనాలు, తయారీ సరుకులు ఉంటాయి. ప్రాథమిక సరుకులకు 20.1 శాతం, ఇంధనాలకు 14.9 శాతం, తయారీ సరుకులకు 65 శాతం ప్రాధాన్యత (వెయిటేజీ) ఉంటుంది. హోల్‌సేల్‌ మార్కెట్లో జరిగే అమ్మకాలు, కొనుగోలు ధరల ఆధారంగా హోల్‌సేల్‌ ధరల సూచీలో హెచ్చు తగ్గులుం టాయి. దాని ఆధారంగా హోల్‌సేల్‌ ధరల సూచీని నిర్ణయి స్తారు. హోల్‌సేల్‌ ధరల సూచీలో జాతీయ మార్కె ట్‌లోని ధరలతో పాటు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు, ముడి సరుకుల ధరలు తగ్గాయి. హోల్‌సేల్‌ ధరల సూచీ ప్రకారం ఆహార సరుకుల ధరలు కూడా 1.16 శాతం మాత్రమే పెరిగాయి. కాబట్టి ధరలు తగ్గి, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులలోకి వెళ్ళబోతున్నట్లు నివేదికలు వెలువరిస్తున్నారు. 
కానీ వినియోగదారుల ధరల సూచీ ప్రకారం చూస్తే ధరలు పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో సగటు వినియోగదారుల ధరల సూచీ పెరుగుదల 5.96 శాతంగా ఉంది. హోల్‌సేల్‌ ధరలు, వినియోగదారుల ధరల సూచీల మధ్య సాధారణంగా ఒక శాతం వ్యత్యాసం ఉంటుంది. ఇపడు ఈ రెండింటి మధ్య 7-8 శాతం వ్యత్యాసం ఉంది. ఇంత వ్యత్యాసం ఉండటానికి కారణమేమిటి? ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి. అంతర్జాతీయంగా చమురు ధరలలో వచ్చిన గణనీయమైన తగ్గుదలను ప్రభుత్వం వినియోగదారులకు అందించలేదు. గత సంవత్సర కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 50 శాతానికి పైగా తగ్గగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను పెంచటం వల్ల చమురు ధరలు తగ్గిన ఫలితం వినియోగదారులకు చేరలేదు. దేశంలో చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ముడిసరుకుల ధరలు కూడా తగ్గాయి. ముడి సరుకుల ధరలు తగ్గితే ఆ సరుకులతో తయారైన వినియోగ సరుకుల ధరలు కూడా తగ్గాలి. కానీ తయారీ సరుకుల ధరలు తగ్గలేదు. ఏ మేరకు ముడి సరుకుల ధరలలో తగ్గుదలను ఫ్యాక్టరీ యజమానులు తమ లాభాలను అదనంగా పెంచుకోవటానికి వినియోగించుకున్నారు. 
రెండవది. హోల్‌సేల్‌ ధరల సూచీలో ప్రాథమిక సరుకులకు 20.1 శాతం ప్రాధాన్యతను ఇవ్వగా, అందులో ఆహార సరుకులకు 14.3 శాతం ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ వినియోగదారుల ధరల సూచీలో ఆహార సరుకులకు 45.86 శాతం ప్రాధాన్యతను ఇచ్చారు. అంటే హోల్‌సేల్‌ ధరల సూచీకన్నా వినియోగదారుల ధరల సూచీలో ఆహార సరుకులకు మూడు రెట్లకుపైగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఆహారధాన్యాలు కళ్ళాల్లో ఉన్నపుడు, ధాన్యం ఇళ్ళకు చేరగానే సామాన్య రైతాంగం అమ్మటానికి పూనుకున్నపుడు వారిలో ఎక్కువ మంది కనీసమైన గిట్టుబాటు ధరలను కూడా పొంద లేకపోయారు. ప్రస్తుతం ఆహార సరుకులతో పాటు నిత్యా వసరాల సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. వినియోగదారుల ధరల సూచీలో ఆహార సరుకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ధరల సూచీ ఎక్కువగా పెరిగింది. 
హోల్‌సేల్‌ ధరలు, వినియోగదారుల ధరల సూచీకి మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణాలు ఇపుడు స్పష్టమౌతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గటం వలన వినియోగదారులు పొందవలసిన ప్రయోజనాన్ని ప్రభుత్వం వారికి దక్కకుండా చేసింది. ముడి సరుకుల ధరల తగ్గుదల వలన తయారీ సరుకుల ధరలు తగ్గి వినియోగదారులు పొందవలసిన ప్రయోజనాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు స్వంతం చేసుకున్నాయి.
ఆ విధంగా పెట్టుబడి దారులు ప్రజలను దోపిడీ చేసి అక్రమ లాభాలు పొందుతుంటే, వారిని నిలువరించి, ఆ దోపిడీని అరికట్టటానికి ప్రభుత్వమూ పూనుకోలేదు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందలేక రైతాంగం నష్టపోయి, ఆత్మహ త్యలు చేసుకొం టుంటే రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ఆహారధాన్యాల ధరలు పెంచి, ప్రజలను కొల్లగొట్టి, బడా వ్యాపారులు అపారలాభాలను స్వంతం చేసుకొంటున్నారు. ఈ విధంగా దోపిడీ తీవ్రం కావటమే హోల్‌సేల్‌ ధరల సూచీకి, వినియోగదారుల ధరల సూచీకి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటానికి కారణంగా ఉంది. పరిస్థితి ఇలా ఉండగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వుబ్యాంకు సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపుకు చర్యలు తీసుకుంటుందని వ్యాపారవర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గితే రుణాలు చౌక అవుతాయి కాబట్టి పారిశ్రామిక వేత్తలు అధికంగా రుణాలు తీసుకుని ఉత్పత్తిని పెంచటానికి ప్రయత్నం చేస్తారని, వినియోగదారులు కూడా రుణాలు తీసుకొని సరుకులను కొనుగోలు చేయటాన్ని పెంచుతారని, ఆ విధంగా ఆర్థికవ్యవస్థ శీఘ్రంగా పెరుగుదల సాధిస్తుందని సరళీకరణవాదులు భావిస్తున్నారు. ఒకవేళ వారు భావిస్తున్నట్లే రిజర్వుబ్యాంకు 25 లేదా 50 బేసిస్‌ పాయి ంట్లు వడ్డీరేట్లు తగ్గించినా అభివృద్ధిని వేగవంతం చేయటం సాధ్యం కాదు. రెండు కారణాల రీత్యా ఇది సాధ్యం కాదు. మొద టిది. వడ్డీరేట్ల తగ్గింపు వలన పారిశ్రామికవేత్తలు ఎక్కువగా రుణాలు తీసుకొని ఉత్పత్తిని పెంచినా, ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోవటంతో ఆ ఉత్పత్తులను అమ్ముకోవటం సాధ్యం కాదు. కొనుగోలుశక్తిని పెంచకపోగా గతం కన్నా ఎక్కువగా ప్రజల కొనుగోలుశక్తిని హరిస్తున్నారని హోల్‌సేల్‌, వినియోగ దారుల ధరల సూచీల మధ్య పెరిగిన వ్యత్యాసం మనకు స్పష్టం చేస్తున్నది. కాబట్టి రుణం తీసుకొని తాత్కాలికంగా ఉత్పత్తిని పెంచినపుడు కొంత అభివృద్ధి జరుగుతున్నట్లు కనిపించినా, సరుకులు మార్కెట్లోకి వచ్చి, అమ్ముకోవాల్సి వచ్చినపుడు గతం కన్నా తీవ్రమైన మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవది. ఆసియా దేశాలలోని మాంద్యం, అమెరికా ఆశించిన మేరకు కోలుకోలేకపోవటం తదితర కారణాల వలన ఎగుమతులకు కూడా అవకాశాలు తగుతాయి. అందువలన పారిశ్రామికా భివృద్ధిని పెంచటానికి వడ్డీరేట్లు తగ్గించకపోవ టమే ప్రధాన కారణమని పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలుచేసే వాదన సరికాదని స్పష్టమౌతున్న ది. హోల్‌సేల్‌ ధరల సూచీ గత సంవత్సరం కన్నా 4.05 శాతం తక్కువగా ఉండటానికి దేశీయంగా ప్రజల కోనుగోలుశక్తి తగ్గటమే ప్రధాన కారణం. ప్రభుత్వం ప్రజల కొనుగోలుశక్తిని హరించే చర్యలు తీసుకొంటు న్నది. గత రబీ సీజన్‌లో ప్రతికూల వాతావరణం వలన తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎటు వంటి సహాయం చేయ టానికి పూనుకోలేదు. ఈ సంవత్సరం దేశంలోని కొన్ని ప్రాంతాలలో సరైన వర్షాలు లేక రైతులు పంటలు వేయలేక పోయారు. అటువంటి ప్రాంతాల్లో వ్యవసా య కార్మికులకు పనులు తగ్గిపోయాయి. ఉపాధి హామీ పథ కాన్ని నీరు కార్చ టంతో గ్రామీణ ప్రాంత ప్రజల కొనుగోలుశక్తి తగ్గింది. ప్రభు త్వం ప్రారంభించిన కార్మిక సంస్కరణలతో కార్మికుల కొను గోలుశక్తి తగ్గుతుంది. నిరుద్యోగం పెరుగు తుంది. దేశ ప్రజల కొనుగోలుశక్తి తగ్గిన తర్వాత పారిశ్రామికా భివృద్ధి ఎలా సాధ్యమౌతుంది?
అందువలన ప్రభుత్వ విధానాలు మారితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమౌతుంది. సంస్కరణలను వేగవంతం చేస్తే సంక్షోభం చేరువౌతుంది. దేశీయ మార్కెట్‌ విస్తరణకు చర్యలు తీసుకుంటే అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఆర్థికవ్యవస్థ ప్రతికూలాభివృద్ధిలోకి పోతుందనే భయాలు తొలగిపోతాయి. బిజెపి ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయటానికి కంకణం కట్టుకొని ముందుకుపోతున్నది కాబట్టి రానున్న కాలంలో ఆర్థికవ్యవస్థ మరింత అనిశ్చితిని, సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 
- ఎ కోటిరెడ్డి