పున:పరిశీలించండి!

భూ సేకరణ చట్ట సవరణపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నిర్వహించిన నీతి ఆయోగ్‌ భేటీకి అధికశాతం ముఖ్యమంత్రులు మొహం చాటేయడం, ఆ చట్టం పట్ల దేశంలో ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. చట్ట సవరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ సిఎంలు, కాంగ్రెస్‌, బిజెపియేతర సిఎంలతో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ సిఎం కూడా చట్ట సవరణను తోసిపుచ్చడం బిజెపికి మింగుడుపడని విషయం. జమ్మూకాశ్మీర్‌లో బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పిడిపి సిఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ సైతం భూ సేకరణ చట్ట సవరణను అంగీకరించలేదంటే బిజెపి తన వైఖరిని పునఃపరిశీలన చేసుకోవడం అవసరం. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకానప్పటికీ రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఎపి సిఎం చంద్రబాబు చట్ట సవరణకు ఎలాంటి జంకూ గొంకూ లేకుండా మద్దతు ఇవ్వడం ఆందోళనకరం. మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చట్ట సవరణపై ఎటూ తేల్చకుండా తటస్థంగా వ్యవహరించడం అవకాశవాదం. అయినప్పటికీ మెజార్టీ ముఖ్యమంత్రులు భూ సేకరణ చట్ట సవరణకు నో అంటున్నా మోడీ సర్కారు ముందుకేననడం ఏకపక్ష, నిరంకుశ పోకడలకు నిదర్శనం.

           గత యుపిఎ ప్రభుత్వం 2013లో తెచ్చిన భూ సేకరణ చట్టం దాదాపు ఏకాభిప్రాయంతోనే వచ్చింది. చట్టంలో కొన్ని లొసుగులున్నప్పటికీ భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల హక్కులను పరిరక్షించే పలు అంశాలు దానిలో ఉన్నాయి. ఏకాభిప్రాయంతో తెచ్చిన చట్టానికి సవరణలపై ఏకాభిప్రాయం సాధించడం బిజెపి ప్రభుత్వ కనీస బాధ్యత. మెజార్టీ రాష్ట్రాల ఆమోదం కూడా లేకుండా సవరణ చేసి తీరతామని మోడీ సర్కారు మంకుపట్టు పట్టడం దుర్మార్గం. రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరిస్తామంటున్న బిజెపి ప్రభుత్వం ముందే మార్కులు నిర్ణయించి పరీక్ష పెడతామన్నట్లు మాట్లాడుతోంది. పైగా మీరూ మా దారిలోకి రావాలని ఒత్తిడి చేస్తోంది. సవరణకు మద్దతు ఇవ్వకపోతే భూ సేకరణ వ్యవహారాన్ని రాష్ట్రాలకు వదిలిపెడతామని, రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేసుకుంటే కేంద్రం మద్దతు తెలుపుతుందని హెచ్చరించే స్థాయికి వెళ్లింది. రాష్ట్రాలను కేంద్రం బ్లాక్‌ మెయిల్‌ చేయడం రాజ్యాంగం కల్పించిన పెడరల్‌ స్ఫూర్తికి విఘాతం.
నయా-ఉదారవాద విధానాల అమలు కోసమే భూ సేకరణ చట్ట సవరణకు బిజెపి సర్కారు తాపత్రయపడుతోంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ ఏర్పాటు కూడా అందుకే. నిధులు, విధులు, అధికారాలు వికేంద్రీకరించాలని, కేంద్ర పన్నుల్లో వాటాలు పెంచాలని ఎప్పటి నుంచో రాష్ట్రాలు మొత్తుకుంటుండగా నీతి ఆయోగ్‌తో కేంద్రీకరణ పెంచింది. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు మరింతగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. తాజాగా నీతి ఆయోగ్‌ వేదికగా భూ సేకరణ చట్ట సవరణకు రాష్ట్రాల మద్దతు కోరడం ద్వారా జాగ్రత్తగా ఉండాలనే సంకేతం ఇచ్చింది. రాజ్యసభలో మెజార్టీ లేకున్నప్పటికీ ఆర్డినెన్స్‌లు తెచ్చి భూ సేకరణ చట్టాన్ని సవరించడం చట్ట సభలను కించపర్చడమే. ఆర్డినెన్స్‌ల పాలన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఎలాగోలా చట్టాన్ని సవరించేందుకు కేంద్రం వేయని ఎత్తు లేదు. ప్రధాని, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి వారు పార్లమెంటులో భూ బిల్లును ఆమోదింపజేసుకుంటామని, అవసరమైతే జాయింట్‌ పార్లమెంటు భేటీ ఏర్పాటు చేసి పంతం నెగ్గించుకుంటామని పట్టుదలకు పోతున్నారు. గ్రామసభల్లో 80 శాతం మంది అంగీకరిస్తేనే భూములు తీసుకోవాలని 2013 చట్టంలో ఉంది. ఆ నిబంధనను సవరిస్తోంది బిజెపి సర్కారు. సేకరించిన భూమి ఐదేళ్లలో వినియోగంలోకి రాకపోతే తిరిగి స్వాధీనపర్చుకొని రైతులకు అప్పగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే క్లాజును ఎత్తేయాలనే ప్రతిపాదన ఎవరికి లాభం చేకూరుస్తుందో తెలుస్తూనే ఉంది.
రెండు పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించకూడదని 2013 చట్టం చెబుతోంది. ప్రభుత్వ అనుమతి తీసుకొని వ్యవసాయ యోగ్యమైన భూములను సైతం సేకరించొచ్చని బిజెపి సవరణ చేస్తోంది. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు అనేటట్లయితే ఈ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, రియల్‌ఎస్టేట్‌ మాఫియా ప్రయోజనాలకే కొమ్ము కాస్తుందని, రైతులు, ఆదివాసీల ప్రయోజనాలను పణంగా పెడుతుందని ఏడాది పాలన చూస్తే అర్థమవుతుంది. ఎందుకోసమైతే భూమి సేకరిం చారో అందుకు వినియోగించకుండా నిబంధనలు ఉల్లం ఘించి దుర్వినియోగం చేసిన వారిపై తీసుకునే చర్యల గురించి 2013 చట్టంలో ఉంది. ఆ క్లాజులను నిర్వీర్యం చేయడానికి బిజెపి సర్కారు నడుంకట్టింది. కొన్ని పరిశ్రమలకే భూమి అనే నిబంధననూ ఎవరికైనా అనే విధంగా సవరిస్తోంది. భూమికి భూమి అనే అంశానికి ప్రాధాన్యం తగ్గిస్తోంది. భూములు కోల్పోతున్న నిర్వాసితు లకు అన్యాయం చేసేందుకు ఉవ్విళ్లూరుతూ భూ సేకరణపై ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభన వలన గ్రామీణాభివృద్ధికి దెబ్బ తగులుతుందనడం మొసలి కన్నీరే. పాఠశాలలు, ఆస్ప త్రులు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు కుంటు పడతా యనడం మరీ ఘోరం. వినాశకరమైన భూ సేకరణ చట్ట సవరణలను రాజకీయ పార్టీలు ఐక్యంగా అడ్డుకోవాలి. రాజకీయాలకు తావు లేకుండా రైతులు, ప్రజల ప్రయోజ నాలకు కట్టుబడాలి. బిజెపి ప్రభుత్వం సైతం ప్రతిష్టకు పోకుండా ప్రజల ప్రయోజనాలకు, ప్రజాస్వామ్య విలువల కు, ఫెడరల్‌ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విలువ ఇవ్వాలి.