
విశాఖ: బాక్సైట్ తవ్వకాలను ఐక్యంగా అడ్డుకోవాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పేర్కొన్నారు. గిరిజన భవన్ బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, గిరిజన చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతర సంస్థ మాత్రమేనని, అటువంటి గిరిజనేతర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిస్తూ జీవో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గ్రామ సభ లు చేసిన తీర్మానాలే సుప్రీం అని అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ కంటే గ్రామ సభలకే అధికారం అధికమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.