పీర్‌లెస్‌ రక్షణ ప్రభుత్వ బాధ్యత..

దేశంలోని చిన్న మొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో ఉండి ఆర్‌బిఐ నిబంధనలకనుగుణంగా నడుస్తూ ప్రజాభిమా నాన్ని చూరగొన్న సంస్థ పీర్‌లెస్‌ జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ లిమి టెడ్‌. నిజాయితీగా తన ఖాతాదారులకు మెచ్యూరిటీ సొమ్మును అందిస్తున్న ఈ సంస్థ ఆర్‌బిఐ విధించిన ఆంక్షల ఫలితంగా తన వ్యాపారాన్ని 2011 ఏప్రిల్‌ 1 నుంచి ఆపేయాల్సి వచ్చింది. దీనితో పీర్‌లెస్‌ సంస్థ ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ఖాతాదారులు తిరిగి తమ డబ్బును పీర్‌లెస్‌ సంస్థలో పొదుపు చేసుకొనే అవకాశం కోల్పో యారు. అంతేకాక ఖాతాదారులు తాము కష్టపడి సంపాదించు కున్న మొత్తాలను దేశంలోని శారదా చిట్‌ఫండ్‌ లాంటి అనేక బోగస్‌ సంస్థలలో పెట్టుబడులు పెట్టి పలు మోసాలకు గుర య్యారు. దానితోపాటు కంపెనీ వ్యాపారాభివృద్ధి కోసం పెట్టు బడుల సేకరణలోనూ, ఆఫీసు పనిలోనూ నిమగమై పనిచేసిన వేలాదిమంది ఫీల్డు, ఆఫీసు ఉద్యోగుల ఉపాధిపై కూడా వేటుపడింది. పీర్‌లెస్‌ విషయంలో 1987లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సంస్థ వ్యాపారం అన్ని విధాలా చట్టబద్ధమైనదే నని ప్రకటించింది. అప్పటి నుంచి ఆర్‌ఎన్‌బిసి చట్టం (రెసిడ్యు యరీ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం) కింద ఆర్‌బిఐ నిబంధ నలను తూచ తప్పక పాటిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగి స్తున్నది. అంతేకాక 2010లో ఆర్‌బిఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఒక అఫిడవిట్‌లో పీర్‌లెస్‌ కంపెనీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నదనీ, కంపెనీ ఆస్తులు అది ఖాతాదారులకు చెల్లించాల్సిన అప్పుల కంటే చాలా ఎక్కువగానే ఉన్నాయనీ పేర్కొంది.
పీర్‌లెస్‌ దేశవ్యాప్తంగా ఉన్న తన ఖాతాదారులకు ఇప్పటి వరకూ రూ.20 వేల కోట్ల మెచ్యూరిటీ మొత్తాలను చెల్లించింది. ఒక ప్రయివేటు రంగంలోని ఫైనాన్స్‌ కంపెనీ ఇంత పెద్ద మొత్తాన్ని ఖాతాదారులకు చెల్లించడం ప్రతిష్టాత్మకమైన విషయం. ఖాతాదారులు కూడా పీర్‌లెస్‌ కంపెనీపై ఉన్న నమ్మకంతో తమ డబ్బును తిరిగి కంపెనీలో పొదుపు చేసుకొనేం దుకు సిద్ధంగా ఉన్నారు. కనుక పీర్‌లెస్‌పై ఆర్‌ఎన్‌బిసి వ్యాపారాన్ని నిలిపేయాలన్న ఆర్‌బిఐ నిబంధనలు సరైనవి కావనీ, అది చట్టవిరుద్ధమేకాక, ఉద్యోగ వ్యతిరేకమైనదనీ పీర్‌లెస్‌ కంపెనీలోని అన్ని తరగతుల ఉద్యోగులూ భావిస్తున్నా రు. చట్టం ప్రకారం ఇటువంటి వ్యాపారంలో ఏదైనా కంపెనీ ఆర్‌బిఐ నిబంధనలను అతిక్రమిస్తే ఆర్‌బిఐ చర్యలు చేపట్టి ఆ వ్యాపారం రద్దు చేయొచ్చు. కానీ పీర్‌లెస్‌ ఏనాడూ ఆర్‌బిఐ నిబంధనలను అతిక్రమించలేదు. కాబట్టి ఆర్‌బిఐ పీర్‌లెస్‌ను వ్యాపారానికి అనుమతించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సుప్రీంకోర్టు 1987లో ఇచ్చిన తీర్పులోకంపెనీని నియంత్రించే క్రమంలో ఆర్‌బిఐ విధించే నిబంధనలు ఉద్యోగుల ప్రయోజనా లకు భంగకరం కారాదని చెప్పింది. కానీ ప్రస్తుతం ఆర్‌బిఐ వ్యవహరిస్తున్న తీరు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే. కాబట్టి ఆర్‌బిఐ తన నిర్ణయాన్ని మార్చుకొని వ్యాపారం చేయడానికి కంపెనీని అనుమతించాలని అఖిల భారత పీర్‌లెస్‌ ఉద్యోగుల సంఘం (సిఐటియు) డిమాండ్‌ చేస్తోంది. ఈ విష యంలో యూనియన్‌ ప్రతినిధులు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను, ఆర్థిక మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, పి చిదంబరంతో సహా అప్పటి యుపిఎ ప్రభుత్వంలోని మంత్రులనూ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పలువురు ఎంపీలనూ కలిసి వారి సహాయం కోరారు. అంతేకాక ఆర్‌బిఐ గవర్నర్‌ సహా తదితర అధికారులను కూడా కలిసి పీర్‌లెస్‌ ఉద్యోగుల కోర్కెలను పరిగణించాల్సిందిగా కోరారు. కానీ ఆర్‌బిఐ నుంచి ఎటువంటి సానుకూల స్పందనా కనిపించలేదు.
గత్యంతరం లేని పరిస్థితిలో పీర్‌లెస్‌పై ఆర్‌బిఐ విధించి న ఆంక్షలను సవాలు చేస్తూ యూనియన్‌ కలకత్తా హైకోర్టులో 2012లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు దాఖలు చేసి 2016 మార్చికి నాలుగేళ్ళయింది. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్‌బిఐ లాంటి అత్యున్నత సంస్థపై ఒక చిన్న యూనియన్‌ న్యాయ పోరాటానికి దిగడమనేది కార్మిక సంఘాల చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ఉద్యోగులు ఒక్కొక్కరూ ఇప్పటి కి 32 రోజుల తమ వేతనాన్ని కోర్టు ఖర్చులకు విరాళంగా ఇచ్చారు. భవిష్యత్తులో అవసరమైతే సుప్రీంకోర్టు వరకూ వెళ్ళడానికి అవసరమైన మరిన్ని విరాళాలివ్వడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకూ కోర్టు ఖర్చులకు రూ.65 లక్షలకు పైగా అయింది. యూనియన్‌ ఏర్పడినప్పటి నుంచీ ఎల్లవేళలా కంపెనీ మనుగడ కోసమే కాక కంపెనీలోని ఉద్యోగులూ, ఖాతాదారుల ప్రయోజనాల కోసం కృషి చేస్తూనే ఉన్నది. 70వ దశకం చివరిలో యూనియన్‌ అప్పటి యాజమా న్యంపై ఒత్తిడి చేసి ఖాతాదారుల డబ్బు జమ అవుతున్న బ్యాంకుల వివరాలు ప్రకటింపజేసి ఖాతాదారులకు భరోసా కల్గించింది. 1978లో చిట్‌ఫండ్‌ కంపెనీల నిషేధ చట్టం క్రింద కంపెనీకి నోటీసులు వచ్చినప్పుడు యూనియన్‌ చొరవ తీసుకొని కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని యాజ మాన్యానికి సూచించడమేకాక, అప్పటి ప్రముఖ న్యాయవాది సోమనాథ్‌ ఛటర్జీని కేసు వాదించాలని కోరింది. ఆ మేరకు ఆయన సుప్రీంకోర్టులో వాదించి కేసును గెలిపించారు. 1987లో కంపెనీకి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడింది. ఆ తీర్పులోని కోర్టు ఆదేశాల ప్రకారం ఆర్‌బిఐ కంపెనీపై నిబంధ నలు పెట్టేటప్పుడు ఉద్యోగుల, ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని చెప్పింది. కానీ ఆర్‌బిఐ సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి పీర్‌లెస్‌ వ్యాపారాన్ని 2011 నుంచి నిలిపేసింది.ఆర్‌బిఐ అనుమతిస్తే వ్యాపారం చేయడానికి తాము సుముఖంగా ఉన్నామని పీర్‌లెస్‌ యాజమాన్యం కోర్టు కేసు మొదటిదశలో అఫిడవిట్‌ ద్వారా తెలిపింది. కానీ మూడేళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు కేసు ముగింపు దశకు వచ్చిన సందర్భంలో దానికి విరుద్ధంగా తాను వ్యాపారం చేయడానికి సుముఖంగా లేనని యాజమాన్యం మరో అఫిడవిట్‌ సమర్పిం చింది. ఉద్యోగులు కోర్టు నుంచి సానుకూల తీర్పును ఆశిస్తున్న సమయంలో యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరిం చింది. అయినా తమ న్యాయమైన పోరాటంలో విజయం సాధించగలమనే విశ్వాసంతోనే ఉద్యోగులున్నారు. సంస్థ ఉనికి కోసం యాజమాన్యం చేయాల్సిన న్యాయ పోరాటాన్ని ఉద్యోగులు తమ భుజాలపై వేసుకొని, తమ వేతనాల ఖర్చుతో పోరాడుతున్న ఈ సమయంలో యాజమాన్యం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని యూనియన్‌ నిరసిస్తోంది. ఉద్యోగులలో భయాందోళనలు కలిగించేందుకు తన బ్రాంచి ఆఫీసులను విలీనం పేరుతో యాజమాన్యం మూసివేస్తోంది. ఇప్పటి వరకూ 60 బ్రాంచీలను విలీనం చేశారు. 1987లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్‌బిఐ రెండు విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ఒకటి, ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడాలి. రెండోది, వేలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి. ఖాతాదారుల భద్రత కోసం వారి మెచ్యూరిటీ డబ్బును కంపెనీ యుబిఐ ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు ఉద్యోగుల భద్రతకు సంబంధించిన ప్రశ్నపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత ఉండాలంటే కంపెనీ వ్యాపారం కొనసాగిం చాలి. కోర్టులో యాజమాన్యం విఆర్‌ఎస్‌ ప్రతిపాదన తేగా హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ... అది ఉద్యోగులకు ప్రత్యా మ్నాయం కాజాలదనీ, ఉద్యోగులను రోడ్డ్డుపాలు చేయడానికి వీల్లేదనీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
పీర్‌లెస్‌ ఉద్యోగులు ప్రస్తుతం ప్రశ్నార్థకమైన తమ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని సంస్థను స్వాధీనం చేసుకొని ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని యూనియన్‌ కోరుతున్నది. సంస్థ నికర స్వార్జిత ఫండు (ఎన్‌ఒఎఫ్‌) ప్రస్తుతం రూ.1,600 కోట్లు ఉన్నది. అంతేకాక సంస్థలో చెల్లింపులు కాని ఖాతాదారుల మెచ్యురిటీ డబ్బు రూ.1,560 కోట్లకు పైబడి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం గతంలో నష్టాలలో ఉన్న కొన్ని బ్యాంకులను జాతీయం చేసిన ఉదాహరణ లున్నాయి. కనుక ప్రభుత్వం పీర్‌లెస్‌ కంపెనీని జాతీయం చేస్తే ప్రభుత్వానికి నష్టమేమీ లేకపోగా ఇంత పెద్ద మొత్తంలోని డబ్బును దేశ ప్రయోజనాల కోసం వినియో గించవచ్చు.

- గౌతం ఛటర్జీ