పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు శివారెడ్డి

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పీడిత ప్రజల పక్షాన పోరాడిన మహా యోధుడు సింహాద్రి శివారెడ్డిని ఆయన ఆశయబాటలో నేటి యువతరం పనిచేయాలని సిపిఎం జిల్లాకార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం అమరావతి తల్లం బ్రహ్మయ్య స్మారక భవన్‌లో నిర్వహించిన శివారెడ్డి సమస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. 1928లో ఖాజా గ్రామంలో ధనిక కుటుంభంలో పుట్టిన శివారెడ్డి ఆ ప్రాంతం రైతాంగ సమస్యల కోసం 1944లో గ్రామంలో రైతుసంఘం ఏర్పాటు చేశారన్నారు. ఆ తరువాత 1946లో పార్టీ శాఖ ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోను, మంగళగిరి ప్రాంతంలోను జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని తెలిపారు. వీరతెలంగాణా సాయుధ పోరాటంలో నాటి ధళాల్లో చేరి పోరాటానికి సహకరించారని, జిల్లాలో ఉన్న కొండవీటి వాగు ముంపు నివారణకు ప్రభుత్వాల కు అనేక సూచనలు చేశారని అన్నారు. నేటి రాజకీయా లు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ధనవంతుల ప్రభావం ఉన్నాయని వీటికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి శివారెడ్డి అన్నారు. ఆయన ఆశయంతో అతివాద, మితవాద పోకడలకు వ్యతిరేకంగా పోరాటాలకు యువత ముందుకు నడవాలన్నారు. సిపిఎం ఏరియా కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ శివారెడ్డితో తనకున్న అనుంబంధాన్ని గుర్తుచేశారు. సిపిఎం అమరావతి శాఖ ఏర్పాటలో శివారెడ్డి కృషిని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు వల్ల ధరలు తగ్గుతాయని చెప్పిన ప్రధాని ధరలను పెంచడమేంటని ప్రశ్నించారు.