పింఛన్లు ఇవ్వాలని CRDA వద్ద ధర్నా

రాజధాని ప్రాంతలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం సిఆర్‌డిఎ కన్వీనర్‌ సిహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ పేదలకు పింఛన్లే ఇవ్వలేనివారు రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి రూ.10కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం పేదలకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. తన సొంత ఇల్లు చూసుకున్న సిఎం పేదల ఇళ్ల గురించి మర్చిపోవడం దారుణమన్నారు. దళితుల నుండి తీసుకున్న భూములకు ఇంకా కౌలు చెక్కులు ఇవ్వలేదని, ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.