పార్టీ బలోపేతమే లక్ష్యంగా సిపిఎం ప్లీనం..

 పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తేగాని పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను సాధించలేము. ఆ నిర్ణయాల్లో మొదటిది, పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం. దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతను పెంపొందించాలి. అలాగే ఇది సాధించేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి జాతీయ స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డి ఎఫ్‌)ను ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచుకోవాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పద్ధతులను మార్చుకొని, నయా ఉదారవాద విధానాల వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల ఏ వర్గాల ఐక్యత బలపరచాలనేది కోరుతున్నామో వాటిని నిర్దిష్టంగా విశ్లేషించి, నిర్దిష్ట నిర్ణయాలు, అవసరమైన మార్పుల ద్వారా సిపిఎం నిర్మాణ పద్ధతుల్లోకి ఆ వర్గాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. 1964లో సిపిఎం ఏర్పడిన తర్వాత చారిత్రాత్మక బర్ద్వాన్‌ ప్లీనం జరిగింది. మళ్లీ 37 ఏళ్ల క్రితం హౌరా జిల్లాలోని సాల్కియాలో ప్లీనం జరిగింది. సిపిఎం అవిర్భావం తర్వాత మూడో ప్లీనం కోల్‌ కతాలో డిసెంబర్‌ 27 నుంచి 31 వరకు జరగబో తోంది. సిపిఎం నిర్మాణ ప్లీనరీ సమావేశాల్లో చర్చిం చబోయే అంశాలను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజాశక్తికిచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పేర్కొన్నారు.
అసంఖ్యాక ప్రజానీకంలోకి పార్టీని ఎలా తీసుకెళ్లబోతున్నారు?
దేశంలో ఉండే అసంఖ్యాక ప్రజానీకం లోకి పార్టీని తీసుకుపోయేందుకు అవసరమైన నిర్ణయాలు పార్టీ ప్లీనంలో తీసుకోబోతున్నాం. సిపిఎం ప్రజల కోసం, దేశ భవిష్యత్‌ కోసం పనిచేస్తుంది. కనుకనే ప్రజలను ఏ విధంగా పార్టీలో ఇముడ్చుకోవాలి, ఏ విధంగా పార్టీ పట్ల ఆకర్షణీ యుల్ని చేయాలనే అంశాలపై ఈ ప్లీనంలో చర్చిస్తాం.
పార్టీ నిర్మాణంలో మార్పులు ఏమైనా ఉండవచ్చా?
ప్రజలను పార్టీలో ఇముడ్చుకునే విధంగా మార్పులు ఉంటాయి. అలాగే ఎప్పుడో తయారు చేసిన నిర్మాణాన్ని మార్చవలసి ఉంటుంది. ఎందుకంటే నేడు సమాజంలో అనేకాంశాలు మారాయి. అనేక నూతన అవసరాలు సృష్టించబడ్డాయి. కనుక ప్రస్తుతం నెలకొన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పార్టీ నిర్మాణంలో మార్పులు ఉంటాయి. అంతే తప్ప పార్టీ ప్రాథమిక సిద్ధాంతా నికి విరుద్ధంగా ఉండవు.
పార్టీకి, ప్రజా సంఘాలకు మధ్య సమన్వయం లోపిస్తుందా?
పార్టీకి, ప్రజా సంఘాలకు మధ్య సమన్వయ లోపమేమీ లేదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. పార్టీకి, ప్రజా సంఘాలకు మధ్య ఉండే సంబంధానికి పార్టీ కేంద్ర కమిటీ గతంలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలుచేయాల్సిన అవసరం ఉంది.
ఇటీవలి కాలంలో ప్రజా సంఘాల పాత్ర గణనీయంగా తగ్గిందనిపిస్తోందా?
ప్రజా సంఘాలు బలపడితే తప్ప పార్టీ బలపడడం కష్టం. ప్రజా సంఘాలను బలపర్చడమంటే ప్రజా ఉద్యమాలను బలపర్చాల్సిన ప్రాధాన్యత ఉంది. ఇటీవలి కాలంలో ప్రజా సంఘాల పాత్ర తగ్గడం వాస్తవమే. కానీ సమాజంలో మార్పుల కారణంగా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సమాజ మార్పులో పార్టీతో పాటు ప్రజా సంఘాల పాత్ర కూడా చాలా కీలకమైనది.
ప్రజా సంఘాల్లో విస్తృత పార్టీ నిర్మాణానికి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు?
ప్రజా సంఘాలను పెంచుకో వడమే ముఖ్యం. పార్టీ పెరగడంలో ప్రజా సంఘాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సమస్యల కారణంగా ప్రజా సంఘాల్లో పార్టీ నిర్మాణం తగ్గింది. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం.
విద్యార్థులను, యువకులను సమీకరించేందుకు పార్టీ కృషి ఎలా ఉండబోతోంది?
యువకుల్లో నయా ఉదారవాద విధానాల ద్వారానే చాలా లోతైన మార్పులు వచ్చాయి. గతంలో ఏ విధంగా అయితే కాలేజీల్లోనూ, యూనివర్శిటీల్లోనూ ఎస్‌ ఎఫ్‌ఐ పనిచేసేదో ఆ విధానాలు ఈ రోజు ఉండే నిర్దిష్ట పరి స్థితుల్లో అమలు చేయడం కష్టం. ఎందువల్లనంటే విద్యా రంగంలో ప్రయివేటీకరణ పెరిగింది. విద్యార్థి సంఘాలకు, విద్యార్థి రాజకీయాలకు గతంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉండేవి. కానీ నేటి పరిస్థితుల్లో ఆ అవకాశాలు కాస్తా కొర వడ్డాయి. ఈ మార్పులకు అనుగుణంగా ప్రజా సంఘాల నిర్మాణంలో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంది.
పెరుగుతున్న మధ్యతరగతికి పార్టీ చేరువయ్యేందుకు ఏయే అంశాలపై దృష్టి కేంద్రీకరించబోతున్నారు?
నయా ఉదారవాద విధానాల అమలు ద్వారా ఇటీవలి పెద్ద ఎత్తున మధ్యతరగతి వర్గం పెరిగింది. ఈ వర్గాలను సమీకరించేందుకు కొత్త రకమైన యూనియన్లను సృష్టించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ కార్మికులే కాదు, వ్యవసాయంతో పాటు అనేక వృత్తుల్లో గ్రామీణ యువకులు తమ బ్రతుకుతెరువు కోసం పనిచేస్తున్నారు. ఈ వర్గాలను ఆర్గనైజ్‌ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులు ప్రజాసంఘాల్లో చేయాలి. స్పష్టంగా వ్యవసాయ కార్మికులే కాకుండా అనుబంధంగా నూతన యూనియన్లను సృష్టించాలి.
సమాజంలో యాంత్రీకరణతో కార్మిక వర్గం తగ్గి మధ్య తరగతి వర్గం పెరగడం వల్ల వర్గ పోరాటం సాధ్య పడుతుందా?
యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో కార్మిక వర్గం తగ్గి మధ్యతరగతి వర్గం పెరగడం వాస్తవమే. సమా జంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కార్మిక వర్గంలో అనేక మార్పులు వచ్చాయి. సంఘటిత రంగంలో కార్మికుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున తగ్గింది. శాశ్వత కార్మికులు, ట్రేడ్‌ యూనియన్‌లో ఉండే కార్మికుల సంఖ్య 6 శాతం కంటే ఎక్కువ లేదు. మిగతా 94 శాతం కార్మిక వర్గం అసంఘటిత రంగం, క్యాజువల్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌లో ఉన్నారు. ఈ వర్గాలను ఏవిధంగా వర్గ పోరాటాల్లోకి తీసుకురావాలి, ఆకట్టుకోవాలి అనే దానికి సంబంధించి నిర్మాణంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఆ విధంగా వారిని వర్గ పోరాటానికి సన్నద్ధం చేయాల్సి ఉంది.
అర్ధ భూస్వామ్య, పెట్టుబడిదారీ సమాజంలో వర్గం పోరాటం ఎలా సాధ్యమౌతుంది?
భారతదేశంలో అర్ధ భూస్వామ్య, పెట్టుబడి దారీ సమాజాన్ని పార్టీ అంచనా వేసింది. వర్గ పోరాటం ద్వారానే సమాజంలో మార్పు జరుగుతుందని భావిస్తోంది. ఏ సమాజంలోనైనా వర్గం పోరాటం తప్పనిసరి.
ప్రత్యామ్నాయ వామపక్ష విధానాల గురించి కొంచెం వివరిస్తారా?
దేశ భవిష్యత్‌కు, ప్రజల జీవన విధానం మార్పు నకు సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలను సూచి స్తుంది. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ప్రజల అవసరాలకు అనుగు ణంగా ఆర్థిక నిర్ణయాలు జరగాలంటుంది. ఎందుకంటే ప్రస్తుత పాలక వర్గాలు విదేశీ, కార్పొరేట్‌ వర్గాలకు దోచిపెట్టే విధానాలను అవలంబిస్తున్నాయి. వాటిని సిపిఎం వ్యతిరేకిస్తోంది.
వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డి ఎఫ్‌) జాతీయ స్థాయిలోనా లేక ఆయా రాష్ట్రాల్లోనా?
జాతీయ స్థాయిలో పాలక వర్గాలు రాజకీయ ఆధిపత్యం వహిస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో వామపక్ష, ప్రజాతంత్ర కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను రాజకీయ రహితులుగా తయారు చేసేందుకు పాలక వర్గాలు పూనుకుంటున్నాయి. ఈ సైద్ధాంతిక సవాళ్లను ఒకవైపు నుంచి తట్టు కోవాలి, మరోవైపు పార్టీ నిర్మాణ పద్ధ తులను, ప్రజా పోరాట విధానాలను, సిపిఎం ప్రచార పద్ధతులు, నినాదాల్లో అనుకూలమైన మార్పు లు తీసుకురావాలి.
పార్టీ ప్లీనం సన్నాహాలు ఎలా ఉన్నాయి?
పార్టీ నిర్మాణం ప్లీనం సన్నాహాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 27న చారిత్రాత్మక ప్రజా ర్యాలీ(బ్రిగేడ్‌)తో ప్లీనం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో నిర్వహించ బోయే అంత పెద్ద ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ప్లీనం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఏమైనా ఆటంకాలు ఎదురవు తున్నట్లు మీరు భావిస్తున్నారా?
కోల్‌కతాలో జరగనున్న సిపిఎం చారిత్రాత్మక ప్లీనంను అడ్డుకునేందుకు అడుగడుగునా తృణమూల్‌ కాంగ్రెస్‌ దాడులు చేస్తోంది. ప్లీనం సందర్భంగా పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన జాతాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు, దాడులు సిపిఎం కార్యకర్తలపై పెరుగు తున్నాయి. సిపిఎం బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత మిశ్రాపై తృణమూల్‌ గూండాలు దాడి చేశారు. అయినా సిపిఎం కార్యకర్తలు అకుంఠిత దీక్షతో ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి పనిచేస్తున్నారు. బ్రిగేడ్‌ ర్యాలీకి ముందు ఈ రకమైన హింస, దాడులు, కేసులు సిపిఎం కార్యకర్తలపై పెట్టడం పెరిగింది. వాటినన్నింటినీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఈ ప్లీనం దేశానికి ఏ రకమైన సందేశాన్నివ్వబోతోంది?
సిపిఎంను బలపర్చాలన్నదే ఈ ప్లీనం పేద ప్రజలకు, పీడిత వర్గాలకు, యువకులకు ఇచ్చే సందేశం. దానికనుగుణంగా ప్రజా పోరాటాలను, వర్గ పోరాటాలను బలపరచాలి. ఎందుకంటే దేశ భవిష్యత్‌కు, ప్రజల బతుకు తెరువును మెరుగుపర్చుకోవటానికి వీలైన స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాలను సిపిఎం మాత్రమే చెప్ప గలుగు తోంది. ఆ ప్రత్యామ్నాయ విధానాల ఆధారంగా దేశంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది.
(ఇంటర్వ్యూ : జగదీశ్‌, ప్రజాశక్తి న్యూఢిల్లీ ప్రతినిధి)