పార్టీల గుండెల్లో రైళ్లు

సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను ఎక్కడ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తుందోనన్న భయంతో నాయకులు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తే కాంగ్రెస్,బిజెపి తదితర జాతీయ పార్టీలతో పాటు టిఆర్‌ఎస్, తెలుగుదేశం, అన్నా డిఎంకె, డిఎంకె, సమాజ్‌వాదీ, ఆమ్‌ఆద్మీ లాంటి మెజారిటీ ప్రాంతీయ పార్టీల ఆర్థిక రావాదేవీలన్నీ బట్టబయలవుతాయి. అందుకే ఆయా పార్టీల నాయకుల గుండెల్లో గుబులుపుట్టింది. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు బిజెపి, కాంగ్రెస్ తదితర ఆరు పార్టీలకు నోటీసులు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు ప్రజా నాయకులను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే ఎన్‌జిఓ దాఖలు చేసిన పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు ఈ నోటీసులు జారీ చేశారు. రాజకీయ పార్టీల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేందుకు వీలుగా వీటిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ సచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు చేపట్టేందుకే సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు బిజెపి, కాంగ్రెస్ తదితర ఆరు పార్టీలకు నోటీసులు ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌జివో కోర్టును అభ్యర్థించింది. 20 వేలు అంత కంటే తక్కువ విరాళాలకు సంబంధించిన వివరాలను కూడా ప్రజల ముందు పెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజాఅధికారులే కాబట్టి అవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావలసిందేనని ప్రధాన సమాచార కమిషన్ ఇది వరకే తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ఈ సర్క్యులర్‌ను ఖాతరు చేయటం లేదు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు విరాళాలు వసూలు చేసే విధానం లోపభూయిష్టమే కాకుండా అక్రమాలతో కూడుకున్నవరి అనేక ఆరోపణలున్నాయి. విరాళాల పేర్లతో లక్షలు, కోట్ల రూపాయలను సేకరిస్తున్న పార్టీలు దాతల వివరాలను మాత్రం వెల్లడించటం లేదు. పార్టీల వార్షిక సదస్సులో కార్యకర్తలు ఒక రూపాయ, రెండు రూపాయల చొప్పున విరాళాలు ఇచ్చారంటూ కోట్లాది రూపాయలను ప్రకటించటం పార్టీల అధినేతలకు ఓ అలవాటుగా మారింది. రాజకీయ పార్టీల రెండు రోజుల సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా ఇలా కోట్లాది రూపాయల విరాళాలు వచ్చినట్లు ప్రకటించటం తెలిసిందే. పలు సందర్భాల్లో రాజకీయ పార్టీలు నల్ల ధనాన్ని విరాళాల పేరుతో తెల్ల ధనంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. దీనికితోడు ఆయా రాజకీయ పార్టీల అధినాయకులు విరాళాల రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయలను తమ ఇష్టానుసారం ఉపయోగించుకోవటంతోపాటు ఎన్నికల సమయంలో ఈ ధనాన్ని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, మభ్య పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తే ఈ వ్యవహారానికి తెర పడుతుంది. అందువల్లే సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది.