పారిశ్రామికాభివృద్ధితో సంబంధంలేని భూసేకరణ

 రాజధాని నిర్మాణం కోసం సేకరించే భూమి కాక, రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణం కోసం 15 లక్షల ఎకరాల భూమిని సమీకరి స్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అందుకను గుణంగానే వివిధ ప్రాంతాలలో సేకరించ టానికి భూములను గుర్తిస్తున్నది. కొన్ని చోట్ల నోటిఫికేషన్‌ జారీచేసి భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఫారెస్టు భూములు, ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములు, గతంలో దళితులు, పేదలకు పంచిన పట్టా భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వచ్చే పరిశ్రమలు వేళ్ళ మీద లెక్కబెట్టేటన్ని కూడా లేకపోయినా భూములు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుండటంతో రైతులు భయాందోళనలతో తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోవటానికి ప్రయత్ని స్తున్న ప్రతి ప్రాంతంలోనూ రైతులు ప్రతిఘటిస్తున్నారు. మంత్రులను, శాసనసభ్యులను నిలదీస్తున్నారు. కృష్ణాజిల్లా బందరు ఓడరేవు భూ సేకరణ ప్రయత్నాన్ని ఆ గ్రామాల్లోని ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములివ్వబోమని రైతులు అడ్డం తిరుగుతున్నారు. ప్రభుత్వం భూ సేకరణకు పూనుకున్న ప్రతిచోటా ఇదే విధంగా రైతులు ప్రతిఘటిస్తున్నారు. ఈ పూర్వరంగంలో 15వ తేదీన ఇంజనీర్ల దినోత్సవం సంద ర్భంగా విజయవాడలో జలవనరుల శాఖ నిర్వహించిన సమా వేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ''పరిశ్ర మల కోసం, అభివృద్ధి కోసం భూములివ్వకుంటే ఎలా?'' అని ప్రశ్నించారు. ''ప్రభుత్వానికి భూములిచ్చి రైతులు అడుక్కు తినాలా?'' అని ముఖ్యమంత్రిగారి ప్రశ్నకు రైతులు సమాధా నం చెబుతున్నారు. రాష్ట్రంలో గతంలో అభివృద్ధి పేరుతో రైతుల భూములు తీసుకొని, సరైన పరిహారాన్ని ఇవ్వకపోవటంతో వారు దుర్భరమైన జీవితాల్ని గడుపు తున్నారు. గుంటూరు జిల్లాలో పులిచింతల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులలో కొందరికి ఈ నాటికీ పరిహా రం అందలేదు. ఓడరేవు, పారిశ్రామిక కారిడార్‌ అంటూ వాన్‌ పిక్‌ పేరుతో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 20 వేల ఎకరా లకు పైగా భూమిని సేకరించారు. ఆ భూముల్లో నేటికీ ఎక్క డా పరిశ్రమ అనేది రాలేదు. సెజ్‌ల పేరుతో కేంద్ర ప్రభుత్వం సేకరించిన భూముల్లో మూడొంతులు ఖాళీగా ఉన్నాయి.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుముందు పరిశ్రమలు వస్తాయని, వారికి భూములు కావాలనే పేరుతో భూ సేకరణకు పూనుకున్నది. సేకరించిన భూములను భూ బ్యాంకులో పెట్టి, తర్వాత పారిశ్రామికవేత్తలకు కేటాయి స్తానని చెబుతున్నది. ప్రభుత్వం నిర్దిష్టంగా వచ్చాయని చెబుతున్న పరిశ్రమలకు కూడా అవసరమైన దానికన్నా పది రెట్లు అదనంగా భూమిని సేకరిస్తున్నది. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న సింగపూర్‌లో విమానాశ్రయం 1,200 ఎకరాల లోనే ఉన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానా శ్రయాల్లో నాలుగు చోట్ల నుంచి విమాన సర్వీసులు నడుస్తు న్నాయి. ఇంకా 14 విమానాశ్రయాలు నిర్మిస్తానని ప్రభుత్వం చెబుతున్నది. సింగపూర్‌లో విమానాశ్రయమే 1,200 ఎకరాలలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 20కి పైగా విమానాశ్రయాలు నిర్మిస్తానని చెబుతూ ఒక్కో విమానా శ్రయానికి ఐదు ఎకరాల నుంచి 15,000 ఎకరాల వరకు ఎందుకు, ఎవరి కోసం సేకరిస్తున్నదో ప్రభుత్వం స్పష్టం చేయాలి. రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలలో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లోనూ, అంతర్జాతీయంగానూ ఆర్థిక మాంద్యం తీవ్రమౌతున్నది. ఉన్న పరిశ్రమలే సరిగా నడవటం లేదు. దేశంలో అమ్మకాలు తగ్గుతున్నాయి. విదేశాలకు ఎగుమతులు తగ్గుతున్నాయి. ఇటువంటి స్థితిలో పరిశ్రమలు పెట్టటానికి ముందుకు వచ్చేవారి సంఖ్య పరిమితంగా ఉంటుంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి ముసుగు తగిలించటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తంతులో తాజా అంకం తమిళనాడులో జయలలిత నిర్వ హించిన పారిశ్రామికవేత్తల సమావేశం. ఆ సమావేశంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు ప్రకటించారు. అన్ని రాష్ట్రాలలోనూ ఈ విధంగానే సమావేశాలు జరిపి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు తీసుకుంటు న్నారు. ఈ వాగ్దానాలు ఇంజనీరింగ్‌ కాలేజీలలో క్యాంపస్‌ సెలక్షన్స్‌లాగా తయారవుతున్నాయి. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో వంద మందిని ఉద్యోగాలలోకి తీసుకుంటామని ఎంపిక చేసుకున్న కంపెనీ ఆచరణలో ఒక్కరిని కూడా తీసుకోని ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రభుత్వాలు పారిశ్రామికాభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవటం న్యాయబద్ధమేనని చెప్పటానికి, అభివృద్ధి ముసుగు వేసుకోవటానికి ఈ సమావేశాలలో చేసిన వాగ్దానాలను ఉపయోగించుకుంటున్నాయి. ఆ వాగ్దానాలలో 10-15 శాతం కూడా వాస్తవరూపం దాల్చటం లేదు.
రాష్ట్రంలోకి నిజంగా పరిశ్రమలు వస్తే పరిశ్రమలకు భూమి కేటాయించాలి. ఇందుకు ఎవరూ వ్యతిరేకం కాదు. పరిశ్రమల కోసం మొదట ప్రభుత్వ భూములను కేటాయించాలి. ప్రభుత్వ భూములు సరిపోకపోతే అప్పుడు రైతుల నుంచి ఆ పరిశ్రమకు అవసరమైన మేరకే భూములు సేకరించాలి. పరిశ్రమల కోసం ప్రభుత్వానికి తమ భూములిచ్చిన రైతులకు ఇప్పటికన్నా సుఖప్రదమైన జీవితం గడిపే స్థితి ఉండాలి. అలా జరిగినప్పుడే అభివృద్ధిలో ఆ రైతులు కూడా భాగస్వాములౌతారు. అటువంటి పరిస్థితులను కల్పిస్తే పరిశ్రమలకు, ప్రభుత్వ అవసరాలకు భూములివ్వటానికి రైతులు వ్యతిరేకించరు. కానీ నేడు ప్రభుత్వం చేస్తున్నదేమిటి? లాండ్‌ పూలింగ్‌ పేరుతో ఏ మాత్రం చట్టబద్ధం కాని విధంగా రైతుల భూములను తీసుకునే ప్రయత్నం చేస్తోంది. రైతాంగం వద్ద నుంచి బలవంతంగా, మోసపూరితంగా భూములు లాక్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్నది. పరిశ్రమలతో నిమిత్తం లేకుండా ఈ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వచ్చినవారికి కేటాయిస్తారు. ఇటువంటి వారిలో ఎక్కువమంది తమ వారుండేలా చూసుకొని, బినామీ సంస్థలను ఏర్పాటు చేసి, తామే స్వయంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నడపటానికి పూనుకుంటారు. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించి, వారూ వీరూ కలిసి (క్విడ్‌ప్రోకో) పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ విధానాలనే మరింత విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నది.
ఇటువంటి విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేయకపోగా అభివృద్ధిని వెనుకపట్టు పట్టిస్తాయి. ప్రభుత్వం 15 లక్షల ఎకరాల భూమిని తీసుకుంటే ఆ భూమిలో వ్యవసాయం ఆగిపోతుంది. ఆ మేరకు వ్యవసాయోత్పత్తిని రాష్ట్రం నష్టపోతుంది. పరిశ్రమలు రావు కాబట్టి పారిశ్రా మికంగా అభివృద్ధి చెందటం సాధ్యం కాదు. సాధారణ రైతు లకు లాండ్‌పూలింగ్‌ అయితే వెయ్యి గజాలు నివాస స్థలం, 200 గజాలు వాణిజ్య ప్రాంతంలో స్థలం కేటాయిస్తామని, ఈ స్థలాలు అమ్ముకుంటే భూములిచ్చిన రైతులకు చాలా లాభం వస్తుందని చెబుతున్నారు. ఇది అవాస్తవం. ప్రతిచోటా భూములు తీసుకొంటుంటే ఈ వేల ఎకరాలలో ఇళ్ళస్థలాలను ఎవరు కొంటారు? పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్న వారు ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మార్చి లాభాలు సంపాదిస్తారు లేదా ఆ భూములను బ్యాంకుల్లో పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటారు. ఏ విధంగానైనా భూములు తీసుకున్న వ్యాపారులు, వారికి భూములిచ్చిన పాలకులు లాభపడతారు. రైతాంగం నష్టపోతారు. భూములుపోతే వ్యవసాయ కార్మికులకు ఉపాధి పోతుంది. అందువల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు భూములను రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలి.
- దినకర్‌