పాదయాత్ర బృందానికి సమస్యల వెల్లువ

యడ్లపాడు మండలంలో దళితులు సాగు చేసుకునే భూములు ఆక్రమణలకు గురయ్యాయని, శ్మశాన స్థలాలు లేక దళితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. దళితుల సమస్యపై నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారానికి మూడో రోజుకు చేరింది. యాడ్లపాడులో ప్రారంభమైన యాత్ర కారుచోల, ఉన్నవ, వంకాయపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, కొత్తసొలస, పాత సొలస, కొండవీడు, ఛంగీజ్‌ఖాన్‌పేట, సంగం, బోయపాలెం తదితర గ్రామాల్లో దళితవాడల్లో సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి సమస్యలు వెల్లువెత్తాయి.మండలంలో అనేక గ్రామాలలో దళితులు సాగు చేసుకునే భూములు, శ్మశాన భూములు ఆన్యాక్రాంతమవుతున్నాయి. నీరు చెట్టు పేరుతో టెక్స్టటైల్‌ పార్క్‌లు, స్పైసెస్‌ పార్కుల పేరుతో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములు సేకరిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని సైతం తుంగలో తొక్కుతున్నారు. వంకాయలపాడు గ్రామంలో సర్వే నెం 482 బి లో 1974లో 42 మంది దళితులకు 35 ఎకరాల సాగు భూములు ఇవ్వగా టెక్స్ట్‌టైల్‌ పార్కు కోసం ఈ భూములను బలంవంతంగా సేకరించి ఏలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఉన్నవ, కారుచోల, ఉప్పరపాలెం, లింగారావుపాలెం గ్రామాలలో శ్మశానస్థలాలు ఆక్రమణకు గురైనాయి. రేవెన్యూ ఆధికారులు పట్టిపట్టనట్లు వ్వవహారిస్తున్నారు. పేదలు సాగు చేసుకుంటున్న యడ్లపాడులో 70 ఎకరాల చెరువు పోరంబోకు భూములు, లింగారావుపాలెంలో 12 ఎకరాలు దళితులు సాగు భూములు నీరు చెట్టు పేరుతో తొలగించారు. ఉన్నవ గ్రామంలో వి.ఆర్‌.ఒ స్వచ్ఛంద సంస్థ దళితులకు 180 ఇళ్ళు నిర్మాణం చేయగా అన్ని గృహాలు నెర్రలు ఇచ్చి ఎప్పుడు కూలిపోతాయో అని భయాందోళనలో ఉన్నామని, వాటిని తొలగించి ప్రభుత్వం వెంటనే గృహనిర్మాణం చేపట్టాలి. ఉన్నవలో దళితవాడలో ఊరి నుండివచ్చే డ్రెయినేజీ మొత్తం వెళుతుందని, వర్షాకాలంలో దళితవాడ మొత్తం డ్రెయినేజితో నిండిపోతుందని, శాశ్వత ప్రాతిపదికన డ్రెయినేజిని నిర్మించాలని కోరారు. సోలస గ్రామంలో 6.5 ఎకరాల శ్మశానస్థలం ఉండగా పెత్తదారులు ఆక్రమించగా 60 సెంట్లు మాత్రమే మిగిలిందని దళితులు చెప్పారు. కారుచోల గ్రామంలో రెండు దళితవాడలకు కమ్యూనీటి హాల్స్‌ లేవు.