పశ్చాత్తాపం - ఫలితం?

జులై 30వ తేదీకి ఉరిశిక్ష విధించిన బాంబు పేలుళ్ళ కేసు నిందితుడు యాకూబ్‌ మెమన్‌ ఇప్పటి వరకు 21 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు. జీవిత ఖైదీకి మనదేశంలో విధించే శిక్ష 14 నుంచి 20 సంవత్సరాలు. ఆ విధంగా చూస్తే యాకూబ్‌ మెమన్‌ ఇప్పటికే ఒక జీవిత ఖైదు అనుభవించాడు. పోనీ నిందితుణ్ణి మన చట్టబద్ధ సంస్థలు శోధించి బంధించాయా? దానికి ఎంత పరిశోధన చేశాయి? ఎలా పట్టుకున్నాయి? అని ప్రశ్నించు కుంటే అలాంటిదేం లేదు. మెమన్‌ తనకు తానుగా లొంగిపోయాడు. లొంగిపోయిన అతణ్ణి అరెస్టు చేసి ఆయన ఇచ్చిన సమాచారంతోనే విచారణ సాగించిన సంస్థలు సుదీర్ఘ విచారణ చేసిన మేరకు అతడే నిందుతుడని తేల్చిన టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది. వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళు పైన గడిచిపోయాయి. వృత్తిరీత్యా చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ అయిన యాకూబ్‌ మెమన్‌ సుదీర్ఘ జైలు శిక్షలో ఉండగానే ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి రెండు డిగ్రీలు పొందడం, అందులో ఒకటి ఆంగ్ల సాహిత్యంపై 2013లో, మరొకటి పొలిటికల్‌ సైన్స్‌పై 2014లో కావడం గమనార్హం.
నిజమే భారతదేశంలో జరిగిన అనేక విధ్వం సాలలో ముంబయి పేలుళ్ళు అత్యంత విషాదక రమైనవి. ఒకరా, ఇద్దరా 257 మంది మరణించారు. 700 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కాళ్ళూ, చేతులూ పోగొట్టుకొని అంగవైకల్యంతో దుర్భర జీవితం గడుపుతున్నవారి ఆక్రోశం గుండెలను కదిలించివేస్తుంది. మరణించినవారు ఏ మతానికో లేదా ప్రాంతానికో పరిమితం కారు. అయినా బాధితులకు మతం అంటూ పరిమితులు ఏముం టాయి. జాతిని మొత్తాన్నీ కలిచివేసిన ఆ ఘటనకు కారణం ఏమిటి? ఏ దుర్మార్గం మరో ఘోర విషాదానికి కారణమైంది? 1993 మార్చి 12న జరిగిన ముంబయి దుశ్చర్యపై రగిలిపోయేవారు సరిగ్గా దానికి మూడు నెలల ముందు జరిగిన హింసాకాండను ఎందుకు ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారు. చర్యకు ప్రతిచర్యలో భాగంగా జరిగిందే ముంబయి మారణ హోమం అని అర్థం అవుతూనే ఉన్నప్పటికీ 1993 మార్చికి ముందు జరిగిన హింసాకాండకు కారకులను కనిపెట్టారా? శిక్షించారా? జవాబు ఇవ్వవలసింది ఎవరు? మనుషుల మధ్య మతం అనే కుంపటిని రాజేసి నునువెచ్చటి వాతావరణంలో అధికార సుఖాలను అనుభవిస్తున్న నాయకులు ఆపరేషన్‌ బ్లూస్టార్‌ను, ఇందిరా గాంధీ హత్యను, హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన ఊచకోతలను విడివిడిగా చూడ గలరా? అలాగే రాజీవ్‌ మరణానికి, దానికి ముందు శ్రీలంకకు బలగాలను పంపే విషయంలో భారతదేశ ప్రధాని హోదాలో రాజీవ్‌ గాంధీ తీసుకున్న నిర్ణయానికి గల పరిణామ క్రమం ప్రత్యేకంగా చెప్పాలా?
ముంబయి పేలుళ్ళ కేసులో యాకూబ్‌ మెమన్‌ది ప్రత్యేక పరిస్థితి. విషయం కూడా అతను ఎప్పుడూ తన తప్పు చేయలేదనో లేదా తను అమాయకుడననో ఎన్నడూ అనలేదు. చేసింది తప్పని తెలుసుకొని ప్రాయశ్చిత్తంతో లొంగిపోయాడు. ముంబయి మారణహోమానికి మూలకారకుడైన దావూద్‌ ఇబ్రహీంను పట్టేస్తాం, భారత్‌కు తెచ్చేస్తామని ఎంత మంది నాయకులు ఎన్నిసార్లు హామీలు ఇచ్చారు. ఎన్ని శపథాలు చేశారు. గడిచిన ఎన్నికల ముందు గంభీర వదనంతో మోడీ ఇచ్చిన హామీ ఏమైంది. దావూద్‌ను పట్టుకురావడం సంగతి సరే, అసలు ఆచూకీ కనిపెట్ట లేకపోవడం నిజం కాదా? ఓ దుర్మార్గం ప్రతిగా మరో ఘోరంతో ఈ విషాద క్రీడ మొదలైంది ముంబయి తోనే కాదు, అంతమైంది ఇంతవరకూ లేదు. ఉక్కు పాదంతో అణచి వేస్తున్నామని ఆవేశంతో ప్రసంగాలు చేయడమే కాని ఉగ్రవాదం మూలాలకు పోయిం దేలేదు. ఖర్మకాలో, పొరపాటునో లేదా ఏమరు పాటునో టెర్రరిస్టులు దొరికిపోవాలేకానీ ఘనత వహించిన మన దర్యాప్తు సంస్థలు స్వయం శోధన చేసి పట్టుకున్న సంఘటనలు ఎన్ని? నిన్న మొన్నటి ముంబయి తాజ్‌ విషాదం దర్యాప్తు సంస్థల వైఫల్యం, బాధ్యతా రాహిత్యం ఫలితం కాదా?
అర్ధ సత్యాలతో ప్రజలను మభ్యపెట్టడం, ప్రతి దుస్సంఘటనకు ముద్దాయిలను రెడీమేడ్‌గా నిర్ణయి ంచడం, వాటికి మతం రంగు పులిమేయడం, తీర్పులు చేయడం, సగం తెలిసిన సమాచారంతో ఓ అవగా హనకు రావడం, దానికి విరుద్ధంగా ఎవరేం మాట్లా డినా దేశద్రోహులుగా జమగట్టడం ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. యాకూబ్‌ మెమన్‌ విషయంలో అడిగేదొక్కటే. మానవతా విలువల గురించి లేదా మానవతా దృక్పథం గురించి ఆలోచిం చమని కాదు. ఉరిశిక్షను ఉంచాలా, ఉరెయ్యాలా? అన్నది కూడా కాదు. చట్టమైనా దొరికితేనే గదా శిక్షించేది. అసలు యాకూబ్‌ మెమన్‌ సోదరుడు టైగర్‌ మెమన్‌తో విభేదించి పశ్చాత్తాపంతో భార్యాపిల్లలతో కలిసి భారత్‌కు వచ్చి లొంగిపోకుండా దర్జాగా దుబారులో దావూద్‌ ఇబ్రహీంతోనే కలిసి ఉంటే ఇప్పుడు ఇదే రోజుకు ఏం జరిగి ఉంటుంది? మన దర్యాప్తు సంస్థలు ఏం చేయగలిగి ఉండేవి? అన్నది సూటి ప్రశ్న. సమాధానం ఊహించలేనిది కాదు. తెలియనిది అంతకన్నా కాదు. 
నిజంగానే యాకూబ్‌ మెమన్‌కు వేసిన ఉరిశిక్షతో భారతదేశంలో తీవ్రవాద చర్యలు అగిపోతాయని, అతని మరణంతో తీవ్రవాద మూలాలు కదిలిపో తాయని, ఆ దుర్మార్గానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అతనేనని, అందులో దావూద్‌ ఇబ్రహీంకు లేదా టైగర్‌ మెమన్‌కు ఎటువంటి సంబంధం లేదని భావిస్తే అలాగే కానివ్వండి. గుజరాత్‌ నరమేథాలు, హైదరా బాద్‌ బాంబు పేలుళ్ళు పునరావృతం కావని భరోసా ఇవ్వగలిగితే కూడా అలాగే కానివ్వండి. కనీసం తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజా నికి భారత్‌ చేస్తున్న రాజీలేని పోరాటం అని చెప్పుకునే నైతిక హక్కైనా ఉంటుందని భావించినా కూడా అలాగే కానివ్వండి. కానీ ఏదో చేయాలని ఆలోచనలు, ఏదేదో చేసేయ్యాలనే అనాలోచిత చర్యలతో దేశం తరపున వేస్తున్న ఉరిశిక్ష వల్ల ఎటువంటి విపరిణామాలు జరిగినా దానికి బాధ్యులుగా ఎవరు ఉండాలి అన్నది కూడా ముందే తేల్చుకోవాలి. ఎందుకంటే అప్పటికే ప్రాయశ్చిత్తం కోసం అజ్ఞాతం నుంచి భారత్‌కు వచ్చి కుట్ర మూలకోణాలను తెలియపరచిన యాకూబ్‌ మెమన్‌ మరణించి ఉంటాడు కనుక.
- నరసింహప్రసాద్‌ గొర్రెపాటి