పర్యాటక ప్రాజెక్టుల కోసం భూసేకరణ..

కేంద్ర పర్యాటకా ప్రాజెక్టుల కోసం ధరణికోట సత్తెనపల్లి రోడ్డులో ప్రభుత్వం 50 ఎకరాల భూ సేకరణ చేపడుతుందనే వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించడంతో అమరావతిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల ధరలు ఎకరం సుమారు రూ.4 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రభుత్వం భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే 30 లక్షల కంటే మించి పరిహారం వచ్చే అవకాశాలు లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని వారసత్వ నగరంగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడంతో అమరావతి అభివృద్ధికి భూమిని సేకరించి పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అమరావతిలో పర్యటించారు. అమరావతి అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ధ్యానబుద్ద ప్రాజెక్ట్‌, మ్యూజియం పరిసర పర్యాటక ప్రాంతాలు ఈ భూములకు దగ్గరలో ఉండటంతో అనూకూలంగా అధికారులు భావించారు. సిఆర్‌డిఎ భూ సేకరణ చేపట్టి వాటిని కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. ఇప్పుడు భూములకు ఉన్న విలువల కంటే తక్కువ పరిహారానికి సిద్ధమవుతున్నారు.