పరిశ్రమాధిపతులకు డికెటి భూములు..

 చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద 1,60,938 ఎకరాలకు పైగా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న డికెటి (అసైన్డ్‌) భూములపై కేంద్రీకరించి వివరాలను సేకరిస్తోంది. ఈ భూములు ఒకే దగ్గర వందల, వేల ఎకరాలు ఉంటున్నాయి. పాత చట్టాల ఆధారంగా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చని భయపెట్టి తీసుకుంటున్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా, అది ప్రభుత్వ స్థలంగా చూపి లాక్కోవాలని చూస్తున్నారు. మొత్తం చిత్తూరు జిల్లాలో 66 మండలాలుండగా, అందులో 22 మండలాల నుంచి 1,60,938.58 ఎకరాల భూమి సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు ఎపిఐఐసి వెబ్‌సైట్‌లోనూ, లాండ్‌ బ్యాంక్‌ ఖాతాలోనూ పొందుపరిచారు. ఇందులో డికెటి భూములే ప్రధానంగా ఉన్నాయి. పరిశ్రమాధిపతులను ఆకర్షించడానికి బాగా పంటలు పండే తూర్పు నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు మీద కేంద్రీకరించి సేకరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌కు 12 వేల ఎకరాలను సేకరించారు. ప్రస్తుతం 65 వేల ఎకరాలు సేకరించడానికి సిద్ధపడుతున్నారు. రేణిగుంట-చెన్నరు విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్టు, కోల్‌కతా-చెన్నరు జాతీయ రహదారి, అంతర్గత రహదారులు, తెలుగుగంగ నీరు, భూగర్భ జలాలు అందుబాటులో ఉండటం పెద్దలకు వరంగా, పేదలకు శాపంగా మారింది. సోమశిల, స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ కూడా ఈ ప్రాంతంలో రాబోతోంది. నగరి-గాలేరు ద్వారా కొంత భాగం సాగవుతుంది. రెండు, మూడు పంటలు పండే భూములను విదేశీ, స్వదేశీ బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించనున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను గుర్తించారు. శ్రీకాళహస్తి మండలంలో 29 బ్లాక్‌ల్లో 8,836.92 ఎకరాలను గుర్తించారు. ఇందులో ఏడు కంప్యాక్ట్‌ బ్లాక్‌లుగా గుర్తించారు. వాంపల్లి, పోలి, ఎంపేడు, వెంగళాపల్లి, వేలవేడు, ఓబులాయపల్లి, రెడ్డిపల్లి కలిపి ఒక కంప్యాట్‌ బ్లాక్‌గా నిర్ణయించారు. ఇందులో 4,627.34 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 3,802.61 ఎకరాల డికెటి భూములున్నాయి. మిగిలింది ప్రభుత్వ భూమి. గ్రామాలుగా చూసినప్పుడు కూడా వేలవేడు సర్వే నెంబర్‌ 2లో 980 ఎకరాలు ఉంది. ఇందులో 880 ఎకరాలు డికెటి భూమి కాగా వంద ఎకరాలు ప్రభుత్వ భూమి. అదేవిధంగా వేలవేడు గ్రామంలో 2,016.85 ఎకరాల భూమి ఉంది. అందులో డికెటి 1,789.37 ఎకరాలు, ప్రభుత్వ భూమి 227.48 ఎకరాలు. అక్కుర్తి సర్వే నెంబర్‌ 302లో 600 ఎకరాలు డికెటి ఉంది. రామాపురం సర్వే నెంబర్‌ 1లో 790 ఎకరాలు డికెటి ఉంది. అదేవిధంగా ఇనగలూరు, పోలి, వెలంపాడు, ఎంపేడు, తదితర గ్రామాలున్నాయి. ఏర్పేడు మండలంలో ఇప్పటికే ఐఐటికి, ఐఐఎస్‌ఇఆర్‌కు వెయ్యి ఎకరాల భూమిని మేర్లపాక, పంగూరు గ్రామాల్లో సేకరించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో మొత్తం 9,212 ఎకరాలు ఉంది. అలాగే రేణిగుంట మండలంలో 17,877.89 ఎకరాలు (ఫారెస్టు భూమి 17,393.29), తొట్టంబేడు మండలంలో 2,262.26 ఎకరాలు, సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను ఆరు మండలాల్లో 24,674.24 ఎకరాలను భూ సేకరణ చేపట్టనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలంలో 4,291.72 ఎకరాలు సేకరించడానికి పూనుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో 1,454.91 ఎకరాలు, శాంతిపురంలో 273.71 ఎకరాలు, 388.67 ఎకరాలు, ఇవిగాక రామకుప్పం, శాంతిపురంలలో విమానాశ్రయానికి 1,200 ఎకరాలు సేకరించాలని సర్వేకు పూనుకున్నారు. పీలేరు నియోజకవర్గంలో ఒక్క వాయల్పాడు మండలంలో నిమ్జ్‌ కొరకు 12,818.51 ఎకరాలను సేకరించనున్నారు. కలికిరిలో 1,650 ఎకరాలు, గుర్రంకొండలో 1,036 ఎకరాలు సేకరించనున్నారు. పలమనేరు నియోజకవర్గంలో గంగవరం మండలంలో 1,290 ఎకరాలు సేకరించనున్నారు.
పై లెక్కలన్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినవి. ఇప్పటికే పల్లెల్లో పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లు సేకరిస్తున్నారు. ఎదిరిస్తేనే భూములు కాపాడుకుంటామని, తమ భూములను కాపాడుకోవాలంటే ప్రతిఘటన తప్ప మరోమార్గం లేదని పేదలు గ్రహించారు. అక్రమ కేసులు పెడితే ఐదు గంటల పాటు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించినప్పుడు సాదరంగా ఆహ్వానించి జేజేలు పలికారు. తమకు అండగా ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తపరిచారు. కమిటీగా ఏర్పడి, సర్వేలు కూడా చేయనీయమని పేర్కొన్నారు. ఏర్పేడు మండలంలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం చేపట్టే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కపట బుద్ధిని అర్థం చేసుకుని ఎదిరిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ పోరాటాలు ఉధృతమవుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
- వందవాసి నాగరాజు
(వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి)