పనికిరాని నిబంధనలతో పంచాయతీ ఎన్నికలా? సిపిఎం

రోహతక్‌: పంచాయతీ రాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు విద్యార్హతలతో సహా పలు అంశాల్లో నిబంధనల్ని కఠినతరం చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సిపిఎం రాష్ట్ర శాఖ ఒక బుధవారం ఒక ప్రకటనలో ఖండించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త నిబంధనలు పూర్తి అప్రజాస్వామికమని సిపిఎం వ్యాఖ్యానిం చింది. పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు కనీస విద్యార్హతగా మెట్రిక్యులేషన్‌ను నిర్ణయించింది. 
మహిళలు, ఎస్సీ అభ్యర్ధులు కచ్చితంగా మిడిల్‌ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.వాటితోపాటు విద్యుత్‌బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, కోపరేటివ్‌ రుణాలు పెండింగ్‌లో ఉన్నా, అభ్యర్ధు లపై క్రిమినల్‌ ఆరోపణలు ఉన్నా వారిని పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల్ని మరింత బలహీనపరిచేవిగా ఉన్నాయని సిపిఎం అభిప్రాయపడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం హర్యానా రాష్ట్ర అక్షరాస్యతా శాతం 75.6. అందులో పురుష అక్షరాస్యత 84.1 శాతం కాగా, స్త్రీల అక్షరాస్యతా శాతం 65.91గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతా శాతం 74.1గా ఉండగా, షెడ్యూల్డ్‌ కులాల అక్షరాస్యతా శాతం 66.85గా ఉంది. వారిలో పురుష అక్షరాస్యతా శాతం 66.85 గా, స్త్రీల అక్షరాస్యత 56.85శాతంగా ఉంది. అయితే 8, 10 తరగతులు పాసైతేనే పోటీలో నిలబడాలంటే చాలా కష్టతరమైన పనిగా సిపిఎం అభివర్ణించింది. అందులోనూ ఎస్సీి మహిళల్లో అత్యంత తక్కువ అక్షరాస్యత ఉంటుందని అభిప్రాయపడింది. ఒకవైపు రాష్ట్రంలో విద్యా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటే, చదువు ఎలా వస్తుందని తెలిపారు. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే తాము పరిగణిస్తున్నామని పార్టీ పేర్కొంది.
ఇక క్రిమినల్‌ అభియోగాలుంటే పోటీకి అనర్హులుగా పరిగణించడాన్ని కూడా సిపిఎం తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రకారం కోర్టులో దోషిగా తేలితే తప్ప వారు అందరి పౌరులులాగే సమానత్వాన్ని కలిగి ఉంటారని వ్యాఖ్యానించింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో లేని నిబంధనల్ని పంచాయితీ రాజ్‌ ఎన్నికల్లో ఎందుకు ప్రవేశపెడుతున్నారని సిపిఎం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇలాంటి విధానాల వలన పంచాయితీరాజ్‌ వ్యవస్థ పూర్తిగా మరుగున పడిపోతుందని సిపిఎం అభిప్రాయపడింది. వెంటనే ప్రభుత్వం నూతన నిబంధనల్ని రద్దు చేయాలని పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ విషయంపై ఆగస్టు13న నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు పార్టీ రాష్ట్ర కమిటి కార్యకర్తలకు పిలుపు నిచ్చింది.