పది వామపక్షాల తీర్మానం...

ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వమే పొదుపు చెల్లిస్తుందనే పేరుతో వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీ మీద వడ్డీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బకాయిలున్నాయనే పేరుతో బ్యాంకర్లు రుణాలివ్వడం లేదని తెలిపారు. దీనికితోడు నూతన మద్యం పాలసీని తీసుకొచ్చి మహిళలను ఇబ్బందుల పాల్జేస్తోందని,ప్యాకెట్లలో మద్యం సరఫరాకు శ్రీకారం చుట్టిందన్నారు, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించాల్సి ఉందని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ, అన్ని ఎన్నికల్లోనూ రుణమాఫీ గురించి ఊదరగొట్టిన చంద్రబాబు.. ఎన్నికలయిన తరువాత దాని గురించి మాట్లాడడం మానేశారని తెలిపారు. వామపక్షాల నాయకులు వెంకటరెడ్డి, గౌతమ్‌, సుందరరామరాజు, రామారావు, అమర్‌నాథ్‌, మూర్తి మాట్లాడుతూ, రుణమాఫీ జరగకుండా చేసి సామాజిక సంక్షోభానికి చంద్రబాబు కారణమవుతున్నారని అన్నారు. డ్వాక్రా, పొదుపు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కె.స్వరూపరాణి మాట్లాడుతూ, ప్రభుత్వం చెల్లిస్తుందనే ఉద్దేశంతో పొదుపు చెల్లించకపోవడంవల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళలకు సంబంధించిన సంఘాలు ఎక్కువగా డిఫాల్టయ్యాయని, వాటికి వెంటనే రుణాలు పునరుద్ధరించాలని కోరారు. మహిళా సమాఖ్య నాయకులు పి.దుర్గాభవానీ, ఎ.వనజ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళల పొదుపు విధానంపై జాతీయస్థాయి అవార్డులొచ్చాయని తెలిపారు.ఐద్వా నాయకులు కె.శ్రీదేవి, గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ, పొదుపును తీసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. పిఓడబ్ల్యు నాయకులు గంగాభవానీ, విష్ణు, దుర్గ మాట్లాడుతూ, అంగన్‌వాడీలను ఉపయోగించుకుని లబ్ధిపొందిన నాయకులు ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని వివరించారు. ఎఐఎఫ్‌డిడబ్ల్యు నాయకులు ఆర్‌.అరుణ, మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు లలిత మాట్లాడుతూ మహిళలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. 
తొమ్మిది తీర్మానాలు ఆమోదం
రౌండ్‌టేబుల్‌ సమావేశం సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి ప్రవేశపెట్టిన తీర్మానాలను వామపక్ష పార్టీలు, పలు సంఘాలు ఆమోదించాయి. ప్రస్తుతం జమచేస్తున్న మూడువేల రూపాయలను పెట్టుబడి నిధిగా కాకుండా రుణమాఫీ ఖాతాకు జమచేయాలని, అభయహస్తం పథకం సభ్యులకు రూ. 500 పెన్షన్‌ వాగ్దానం మేరకు అమలు చేయాలని తీర్మానించారు. స్కాలర్‌షిప్‌ కింద అర్హతున్నవారికి చెల్లించాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని, పొదుపు డబ్బు వినియోగంపై బ్యాంకు ఆంక్షలు ఎత్తివేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఇసుక క్వారీల్లో వచ్చే ఆదాయంలో 25 శాతం ఇస్తామన్న జీవో ప్రకారం విడుదల చేయాలని, డ్వాక్రా గ్రూపులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. నూతన మద్యం పాలసీ విధానాన్ని ఉపసంహరించాలని, ఎస్‌సి, ఎస్‌టి గ్రూపులకు ప్రభుత్వమే సంపూర్ణంగా రుణాలు చెల్లించాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై అన్ని జిల్లాల్లోనూ రౌండ్‌టేబుల్‌ సమావేశం, రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.