పడకేసిన ప్రాథమిక వైద్యం

                   మా బంధువు ఒకరు ఛాతిలో మంట ఉందని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళారు. వెంటనే ఎండోస్కోపీ, రక్తపరీక్షలు చేస్తేనే జబ్బు ఏంటో తెలుస్తుందని భయపెట్టి డాక్టర్‌ అన్ని రకాల పరీక్షలూ చేశారు. 15 రోజులకు రూ.2,200 విలువ చేసే మందులు సహా రూ.7,500 వసూలు చేశారు. అదే వ్యక్తిని కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే గ్యాస్‌ సమస్య ఉందని, కారం, మసాలాలు తగ్గించమని చెప్పి ఒక ట్యాబ్లెట్‌తోపాటు, మంట ఉన్నప్పుడు డైజిన్‌ మాత్ర చప్పరిస్తే సరిపోతుందని చెప్పారు. దీనికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చయింది. మన రాష్ట్రంలో ప్రజలను ప్రైవేట్‌ వైద్యశాలలు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో అర్థమవుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులలో శవాల మీద కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారు. వైద్యం వ్యాపారంగా ఎలా మారిందో పై ఉదాహరణలు తెలియజేస్తున్నాయి.
                   రాష్ట్రంలో ప్రతి ఐదు కుటుంబాల్లో రెండు వైద్యం కోసమే అప్పులు చేస్తున్నట్లు అనేక సర్వేలలో వెల్లడయింది. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల గత్యంతరం లేక ప్రజలు ప్రైవేట్‌ వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రజలు అప్పుల భారాల్లో మునుగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక వైద్యం అంపశయ్యపై ఉంది. గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తామని, ప్రతి కుటుంబానికీ అన్ని జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తామని వాగ్దానం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా విస్మరించింది. నిధులకు కోత విధించింది. కార్పొరేట్‌ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం వైద్య రంగానికి కేవలం రూ.5,728 కోట్లు కేటాయించింది. ఇది బడ్జెట్‌ మొత్తంలో 5 శాతం మాత్రమే. అందులో ఆరోగ్య శ్రీకి రూ.1,000 కోట్లు కేటాయించింది. కాగా ఇందులో సిబ్బంది జీతభత్యాలు, ఇతర అవసరాలు పోను పేదల వైద్యానికి కేటాయించింది రూ.1,600 కోట్లు మాత్రమే.
                   రాష్ట్రంలో 646 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి) ఉన్నాయి. వీటికి అనుబంధంగా మరో 885 ఉపకేంద్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ మూడు కోట్లకు పైగా ప్రజలు తమ ప్రాణాలు నిలుపుకోవడానికి అదే ఆధారంగా ఉంది. ఈ పిహెచ్‌సిలను గత ప్రభుత్వాలతోపాటు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రాథమిక వైద్యంపై డిఎల్‌హెచ్‌ఎస్‌-3 (డిస్ట్రిక్‌ లెవల్‌ హౌస్‌ హోల్డ్‌ అండ్‌ ఫెసిలిటీస్‌ సర్వే)లో అనేక సమస్యలు వెల్లడయ్యాయి. 646 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాను 50 శాతం కేంద్రాలు 24 గంటలు పనిచేయడం లేదు. 60 శాతం పిహెచ్‌సిలకు మహిళా డాక్టర్లు లేరు. ప్రతి ఐదింటిలో ఒక దానికి స్టాఫ్‌ నర్సు, మహిళా హెల్త్‌ అసిస్టెంట్స్‌ లేరని తేల్చింది. గత 5 సంవత్సరాల నుంచి 50 శాతం పిహెచ్‌సిలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయలేదు. 25 శాతం పిహెచ్‌సిలలో ఫార్మాసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు లేరు. ప్రతి ఐదు పిహెచ్‌సిలకు గాను ఒకదానిలో మెడికల్‌ ఆఫీసర్‌ లేరని తేల్చింది.

                 ఆసక్తికరమైన అంశమేమంటే అన్ని పిహెచ్‌సిలలో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది 20 శాతానికి మించి లేరని, కనీసం వేసక్టమీ ఆపరేషన్‌ కూడా చేసేవారు లేరని సర్వే చెబుతోంది. అత్యధిక శాతం పిహెచ్‌సిలలో ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నా సర్జన్స్‌ లేక పరికరాలు తుప్పుపట్టి ఉన్నట్లు తేలింది. ప్రతి పిహెచ్‌సిలో 20 నుంచి 50 శాతం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పింది. పాలకవర్గాలకు జేబులు నింపుతున్న కార్పొరేట్‌ వైద్యం మీద ఉన్న ప్రేమ ప్రభుత్వ వైద్యం మీద లేదన్నది తేటతెల్లమవుతోంది. ప్రాథమిక వైద్య సదుపాయాలు పతనావస్థలో ఉండాలన్నది ప్రభుత్వ అవగాహనగా ఉంది. సర్వే ఫలితాలు ఈ విషయాలనే రుజువు చేస్తున్నాయి. ప్రతి కార్పొరేట్‌ ఆసుపత్రి రోజుకు వారికి వచ్చే ఒపిలో 20 శాతం మంది పేదలకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ఎక్కడా దీన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
                    ఉదాహరణకు రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా వెనుకబడి అతి తక్కువ అక్షరాస్యత కలిగిన కర్నూలు జిల్లాలో కోసిగి మండలం పిహెచ్‌సి గురించి తెలుసుకుందాం. ఆ మండలంలో 68 వేలకు పైగా జనాభాకు ఒకే ఆసుపత్రి ఉంది. రోజూ వివిధ గ్రామాల నుంచి 100 మందికి పైగా రోగులు వస్తుంటారు. మంగళవారం సంత రోజు కాబట్టి ఆరోజు సుమారు 200 పైగా వస్తుంటారు. రానుపోను ఛార్జీలు, ఖర్చులు కలిసి వస్తాయని జబ్బులను కూడా వాయిదా వేసుకుని మంగళవారం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ప్రతి నెలా 150 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఈ ఆసుపత్రికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముగ్గురు వైద్య నైపుణ్యం కలిగిన డాక్టర్లు, నలుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక టెక్నీషియన్‌, ఒక ఫార్మాసిస్ట్‌ ఉండాలి. కానీ ఆ ఆసుపత్రిలో కేవలం ఒకే ఒక రెగ్యులర్‌ డాక్టర్‌ ఉన్నారు. ఆయన కూడా డెంటిస్ట్‌. ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు స్టాఫ్‌ నర్సులు కాంట్రాక్ట్‌ బేసిస్‌లో పనిచేస్తున్నారు. ఈ పిహెచ్‌సి పరిధిలో 17 మంది సిబ్బందికి గాను నేటికీ ఎనిమిది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఆసుపత్రి భవనం చాలకపోవడం వల్ల 30 పడకల కోసం గత ఐదు సంవత్సరాల క్రితం భవన నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్ల నేటికీ ఆ భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఈ మండల ప్రజలు ఏ చిన్న జబ్బు చేసినా ఈ ఆసుపత్రికే రావాలి.

                     మెరుగైన వైద్యం కావాలంటే 50 కిమీ దూరంలో ఉన్న ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రులకు వెళ్ళాలి. అక్కడికి చేరుకునే లోపు పేదల ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఇది ఒక కోసిగి మండల పరిస్థితే కాదు ఇంచు మించు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య శాలల పరిస్థితి ఇంతే. విశాఖ ఏజెన్సీ లాంటి ప్రాంతాలలో ప్రాథమిక వైద్య కేంద్రాలలో డాక్టర్లు లేక, సరైన మందులు అందక వందలాది మంది గిరిజనులు మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ లాంటి అనేక రకాల జబ్బులతో చనిపోతున్నారు.
                     రాష్ట్రంలో అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకానికి నేటికీ ప్రాథమిక వైద్య కేంద్రాలే ఆధారం. ఇటువంటి వైద్యశాలలు ప్రభుత్వ సహకారం లేక కొట్టుమిట్టాడుతున్నాయి. రోజూ సింగపూర్‌, జపాన్‌ జపం చేస్తున్న బాబుగారు 10 శాతం మంది సంపన్న వర్గాల కోసం వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తామని, లక్షల ఎకరాల భూములు ఉచితంగా ఇస్తామని వారికి ఎర్ర తివాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నారు. కానీ కోట్లాదిమంది ప్రజల ప్రాణాధారమైన వైద్యం గురించి పట్టించుకోకపోవడం లేదు. అర్థంలేని టెస్టుల పేరుతో అమాయక ప్రజలపై కార్పొరేట్‌ ఆసుపత్రులు వేసే భారాన్ని అదుపు చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన నియంత్రణ ఉండాలి. విద్యుత్‌ చార్జీల మొదలు తాగునీటి సరఫరా వరకు అన్ని సేవల రంగాలను నియంత్రించడానికి రెగ్యులేటరీ కమిషన్‌ను నియమిస్తున్న ప్రభుత్వాలకు మౌలిక వసతులైన విద్య, వైద్యం వంటి సేవల విషయం, ప్రైవేట్‌ దోపిడీని నియంత్రించడానికి అటువంటి రెగ్యులేటరీ వ్యవస్థ అవసరమన్న ఆలోచన తట్టకపోవడం శోచనీయం. ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా అమలు జరగాలన్నా ప్రాథమిక వైద్య సదుపాయాల కల్పన పటిష్టం కావాలి. కాబట్టి తక్షణమే ప్రాథమిక వైద్యానికి తగినన్ని నిధులు కేటాయించాలి. రోగులకు సరిపడా భవన నిర్మాణాలు చేపట్టాలి. తగినన్ని పరికరాలు అందించాలి. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ప్రతి పిహెచ్‌సిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఏర్పరచాలి. కావాల్సిన అన్ని రకాల మందులు సరఫరా చేయాలి. ప్రతి పిహెచ్‌సిని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేట్లు చూడాలి. అప్పుడే ప్రజల ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుతుంది.
- వి వెంకటేశ్వర్లు
(వ్యాసకర్త ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు)