పచ్చి దగా..

వందల కోట్లు ఖర్చు చేసి త్రీ-డి ఎఫెక్టుతో దసరా రోజు నిర్వహించిన అమరావతి శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది మినహా రాష్ట్ర ప్రజలకు ఎలాం టి ప్రయోజనం చేకూర్చలేదు. పదహారు మాసాలుగా విభజన హామీల అమలు కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న జనం కనీసం శంకుస్థాపన నాడైనా తమకు భరోసా లభిస్తుందని ఆశించగా ఫలితం శూన్యం. శంకుస్థాపన వేదికపై ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని, తీపి కబురు చెబుతారని బిజెపి, టిడిపి నాయకులు ఊరించగా మోడీ తుస్సు మనిపించారు. హోదా సంజీవని కాదని బుకాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ప్రధాని అమరావతికొచ్చి బీహార్‌ కంటే అధిక ప్యాకేజీ ముట్టచెబుతారని నర్మగర్భంగా ప్రచారం చేశారు. తీరా మోడీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు మోసుకొచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. టిడిపి, బిజెపి మాటలు నమ్మి లక్షల కోట్ల 'డబ్బు మూట' తెస్తారనుకున్న జనం ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మాత్రం భాగ్యానికే బాబు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మన్ను, నీళ్లే అండ పిండ బ్రహ్మాండమన్నట్లు తాను సంతోష పడటమే కాదు ప్రజలనూ తన ఆనందంలో పాలుపంచుకోమంటున్నారు. బిజెపితో చెలిమి మొదలుపెట్టిన దగ్గర నుంచి చంద్రబాబుకు కూడా మత క్రతువుల ధ్యాస ఇంతింతై వటుడింతై అన్నట్లు తయారైంది. నా ఇటుక-నా అమరావతి-నా మట్టి-నా నీరు అంటూ భావోద్వేగా లను, సెంటిమెంట్‌ను రగిలించి తన వైఫల్యాలకు, తప్పుడు విధానాలకు 'పవిత్ర' ముసుగు కప్పేందుకు ప్రయత్నించడం దారుణం. దీనికి మోడీ నేను సైతం అమరా వతి నిర్మాణంలో పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ధార పోశానంటూ మహాకవి శ్రీశ్రీ కొటేషన్‌ అరువు తెచ్చుకోవడం అన్యాయం. అదే శ్రీశ్రీ మెచ్చిన తెలుగునాట మేటి కవి గురజాడ దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు అని ఎప్పుడో గడ్డి పెట్టా రు. గురజాడ కొటేషన్‌ను ప్రధాని, బాబు గుర్తుకు తెచ్చుకుంటే మట్టి, నీళ్లతో ఇంత డ్రామా ఆడేవారు కాదు.
అంగరంగ వైభవం, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లతో సాగిన శంకుస్థాపనతో రాష్ట్రానికి బాబు సాధించిందేమీ లేదు. జూన్‌లో పది కోట్లు భూమి పూజకు వెచ్చిం చారు. మళ్లీ నాలుగు నెలలకు రూ.400 కోట్లు కుమ్మరించారు. ఇంతా చేసి, తాను కనుక ప్రధానిని తీసుకొస్తున్నానని గొప్పలకు పోయి చివరికి రూపాయి కూడా అదనపు సాయం సాధించలేదు. విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎపి ప్రజలకు ప్రధాని ప్రసంగంలో ఎక్కడా ఉపశమనం దొరకలేదు. విభజన హామీలను అమలు చేస్తామని పాత పాటే పాడారు. పదహారు నెలలవుతున్నా చట్టంలో పొందుపర్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారో మోడీ చెప్పాలి. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ బాసలకు విలువ లేదా? హోదాపై ఇన్నాళ్లూ కల్లబొల్లి కబుర్లు చెప్పి బిజెపి, టిడిపి నేతలు నెట్టుకొచ్చారు. శంకుస్థాపన నాడు కూడా ప్రధాని స్పష్టత ఇవ్వకుండా ఇంకెప్పుడో ఒరగబెడతామంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ఎన్నికలకు ముందు మోడీ, వెంకయ్య, బాబు త్రయం తాము నమ్మే తిరుపతి వెంకన్న సాక్షిగా హామీలు అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఓట్లేయించుకొని అధికారంలోకొచ్చారు. అమరావతిలో కాకపోయినా తిరుపతిలోనైనా వాటి ఊసెత్తకుండా ప్రజలనే కాదు వెంకన్ననూ వంచించిందా త్రయం.
కేంద్రం ఎపి ప్రయోజనాలను ఇంతగా కాలరాస్తున్నా తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రాతిపదికన పుట్టిన టిడిపి అధినేత ఎందుకు మౌనం దాలుస్తున్నారన్నదే ప్రశ్న. కేంద్రం మెడలు వంచైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తానని ఎన్నికల్లో బాబు చేసిన వాగ్దానం ఇప్పుడెందుకు భంగమైంది? శంకుస్థాపన వేదికపై ప్రధానికి కనీసం ప్రజల ఆకాంక్షలను ఎందుకు వ్యక్తీకరించలేకపోయారు? హోదాతో సహా విభజన హామీలపై మోడీ సర్కారు నాన్చుతున్నా ఎందుకు స్పందించట్లేదో బాబు ప్రజలకు జవాబు చెప్పా లి. బిజెపి దోబూచులాటలో ఎందుకు భాగం పంచుకుంటున్నారో వివరణ ఇవ్వాలి. హోదాపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉద్యమాలు బయలు దేరాయి. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్యాకేజీల కోసం ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేంద్రం తూతూ మంత్రంలా ఏడు వెనుకబడ్డ జిల్లాలకు ప్రకటించిన రూ.350 కోట్లు ఏ మూలకూ సరిపోదు. గాలిలో పేలపిండి కృష్ణార్పణం అన్న చందంగా బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలు తయారయ్యాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రకు కావాల్సింది అలాంటి కంటితుడుపు ప్యాకేజీలు కాదు. సమగ్ర అభివృద్ధికి నిర్ణీత కాల వ్యవధితో కూడిన ప్యాకేజీ కావాలి. రాజధానికి నాలుగు లక్షల కోట్లు కావాలని బాబు పేర్కొన్నారు. అమరావతికి కేంద్రం ఎంతిస్తుందో ఇప్పటికైతే పజిల్‌. రాజధాని కోసం భూములు త్యజించిన రైతులను శంకుస్థాపన రోజు మూడు దొంతరల అవతల ఉంచారు. ప్రధాని సైతం రైతుల గురించి మాట మాత్రం ప్రస్తావించలేదు. మాస్టర్‌ ప్లాన్‌లో రైతులకు భూమి ఎక్కడిస్తారో తెలపకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా బిజెపి, టిడిపి నాటకాలు కట్టిపెట్టి హోదా, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీలతో సహా విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలి. కేంద్రంపై బాబు ఒత్తిడి తేవాలి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రెండు పార్టీలూ దగా చేస్తే ప్రజలు క్షమించరు.