నేతిబీరలో నెయ్యి - కార్పొరేట్‌ సామాజిక భద్రత

సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను రూపుమాపే లక్ష్యం తోనే 'సామాజిక బాధ్యత' అనే అం శం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది అధికారం లో ఉన్న పాలకవర్గాలే. దాని కోసమే 'సంక్షేమ రాజ్యం' అనే భావన వాడుకలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి ప్రభు త్వాలు వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్‌ సంస్థలకు ఆ బాధ్యతలను బదలాయిస్తున్నాయి. ఈ మార్పిడి సత్ఫలితా లనిస్తుందని పాలకవర్గాలు ఆశిస్తున్నాయి. దాన్ని సాకుగా చూపి పాలక వర్గాలు చేతులు దులిపేసుకుం టుంటే కార్పొరేట్‌ సంస్థలు అమలు చేస్తున్న సామాజిక బాధ్యత పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నది.ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేవ నేది ప్రజాస్వామ్యవాదుల భావన. దేశంలోని వనరులన్నింటి మీదా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. దేశం, ప్రజల అవసరాలను బట్టి శాసనాలు రూపొందించేది కూడా ప్రభుత్వాలే. శాసనాలు అమలు చేసే అధికార యంత్రాంగం ప్రభుత్వాధీనంలోనే ఉంటుంది. 
అన్ని రకాలైన అధికారాలు, వనరులు చేతిలో ఉన్న ప్రభుత్వాలే సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను రూపుమాపలేకపోతుంటే, వ్యక్తిగత లాభాపేక్ష, ఇతరుల ఆధీనంలోని ఆస్తులన్నీ అప్పనంగా తన ఖాతాలో పడిపోవాలని కోరుకునే కార్పొరేట్‌ సంస్థలు 'సామాజిక బాధ్యత నెరవేరుస్తాయని' నమ్మబలకడం 'గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకునే చందాన్ని' జ్ఞప్తికి తేకమానదు.
భారతదేశ జనాభాలో 80 శాతం మంది రోజుకు తిండికి రూ.20 కూడా ఖర్చు చేయలేని స్థితిలో బ్రతుకుతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమకొచ్చే ఆదాయంలో 70 శాతం తిండి గింజలకు ఖర్చు పెట్టుకోవాల్సిన దుస్థితి. దేశంలో 60 శాతానికి పైగా ప్రజలు రోగాల బారి నుంచి బయటపడటానికి అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇప్పటికీ దేశంలో 65 శాతం మంది ఇంకా వ్యవసాయం పైనే ఆధారపడి బ్రతుకుతున్నారని, 40 శాతం ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలుపుతోంది. సగం మంది మహిళలు రక్త హీనతతో బ్రతుకుతున్నారు. పుట్టిన ఏడాదిలోపే చనిపోతున్న బిడ్డలు ఏటా 55 లక్షల వరకు ఉంటున్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధిగ్రస్థులలో అత్యధిక శాతం మంది మనదేశంలోనే ఉన్నారు.
తిండికి గడవక పస్తులుండే ప్రజల అవసరాలు తీర్చాలనే 'పనికి ఆహార పథకం' అనే నినాదంతో దశాబ్దాల తరబడి ఉద్యమాలు నడిచాయి. కమ్యూనిస్టు మహోన్నత నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య తనే స్వయంగా సైకిల్‌పై నిత్యావసర సరుకులు, కూరగాయలు తెచ్చి తక్కువ ధరలకు ప్రజలకు అందించిన చరిత్ర ఉంది. తొలుత రూపాయికే కిలో బియ్యం అమ్మించిన ఘనత కూడా కమ్యూనిస్టులదే. ఆ తరువాతే ప్రభుత్వాలు కళ్లు తెరిచాయి. ఇంటికో బర్రె, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, సన్నకారు-చిన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు వంటి పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ క్రమంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థ రూపుదిద్దుకుంది. బియ్యం, గోధుమలు, కిరోసిన్‌, ప్రస్తుతం చింతపండు, కందిపప్పు, పసుపు, కారం వంటివి సబ్సిడీ ధరలపై పంపిణీ చేయబడుతున్నాయి. వృద్ధాప్య, వితంతు, గీత, నేత కార్మికులకు పెన్షన్‌ పథకం వచ్చింది. వలస దోపిడీ నివారణ, స్థిర జీవనం లక్ష్యంతో వామపక్ష పార్టీల కృషి ఫలితంగా 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' ఆ కోవకు చెందిందే. ఈ పథకాలన్నీ గుడ్డి కన్నా మెల్ల మేలు ఆన్న చందంగా పేదోళ్ళకు తోడ్పడ్డాయనే చెప్పుకోవచ్చు.
దేశంలో 1991 తరువాత అమలు చేయబడుతున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల మూలంగా పాలక వర్గాల విధానాల్లో పెను మార్పులు వచ్చాయి. సంక్షేమ పథకాలు సోమరిపోతులను తయారు చేస్తున్నాయంటూ దాడి ప్రారంభమైంది. సంక్షేమ పథకాల అమలుపై రోజురోజుకూ పరిమితులు విధించబడుతు న్నాయి. నిధులలో కోత పెట్టబడుతున్నాయి. 'శాశ్వత ఉపాధి కల్పనా విధానానికి స్వస్తి పలుకబడుతోంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం, పారితోషికాలు, పీస్‌రేట్లు, తదితర పేర్లతో కూడినవి ఉపాధి కల్పన రంగంలోకి తీసుకురాబడ్డాయి. దీనివల్ల చాలీచాలని జీతాలు, నిత్యం అభద్రతతో బ్రతకాల్సిన దుస్థితిలో కోట్లాది మంది కార్మికులు నలిగిపోతున్నారు.
కాగా పెట్టుబడిదారులకు కష్టాలు కలగకుండా చూస్తే దేశం బాగుపడుతుందనే ధోరణితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కొత్త పరిశ్రమలొస్తాయని, ఉపాధి కల్పన పెరుగుతుందని, దానితో పాటు సామాజిక బాధ్యత కూడా పెట్టుబడిదారులు వహిస్తారు అనే ప్రచారం ఊపందుకుంది. ఆ పేరుతో కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాలు పెట్టుబడిదారులను సంతోషపెట్టే పనిలో నిండా మునిగిపోయాయి. అమెరికా, జపాన్‌ పర్యటనల సందర్భంగా పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానించి వచ్చారు. యజమానుల స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలలో మార్పులు చేస్తున్నారు. కార్మికులకు కొద్దోగొప్పో మేలుచేసే అంశాలను తొలగిస్తున్నారు.
మరోవైపు పేద ప్రజల ఉద్ధరణకు ప్రవేశపెట్టబడిన పథకాలను సహితం వీరు వదిలి పెట్టడంలేదు. సబ్సిడీ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కోత పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులలో 2014-15 సంవత్సరం నుంచి 2015-16 కేటాయింపులలో ఉన్న వ్యత్యాసాలను ఈ క్రింది పట్టికలో గమనించవచ్చు.
కేంద్ర ప్రభుత్వమే పథకాలకు నిధుల్లో పెద్ద ఎత్తున కోత పెడితే, రాష్ట్రాలు ఇచ్చే 10 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు కూడా అదే మోతాదులో పడిపోతుంది. అయితే ఆయా పథకాలకు ప్రతి ఏటా మెయిన్‌టెనెన్స్‌ ఖర్చులు మాత్రం 4 నుంచి 5 శాతం వరకు పెంచి చూపించడం ఆనవాయితీగా మారిపోయింది. తగ్గిన నిధుల కేటాయింపు, పెరిగిన మెయిన్‌టెనెన్స్‌ ఖర్చుల భారాన్ని అధిగమించేందుకు కార్మికులపై వేటువేయడం, కార్మికులకున్న అరకొర సౌకర్యాలను కత్తిరించడం ద్వారా ఈ లోటును భర్తీ చేసే చిట్కాలుగా యాజమాన్యాలు, అధికార యంత్రాంగం ప్రయోగిస్తున్నది.
కోట్ల రూపాయల లాభాలు మూటగట్టుకుంటున్న కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను గాలికొదిలేస్తున్నాయి. గత 5 ఏళ్లుగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) నిధులను నామమాత్రం గానే మంజూరు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ క్రింది పట్టికను పరిశీలిస్తే అర్థమౌతుంది.
2014-15 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాల పురోగతి తీరు-నిధులు (కోట్ల రూ||లలో)పైన తెల్పిన నిర్థారణలను బట్టి 'సామాజిక బాధ్యత'ను ప్రభుత్వాలు, కార్పిరేట్‌ సంస్థలు అటకెక్కిస్తాయనేది తేటతెల్లమవుతోంది. మన రాష్ట్రంలో '108' సేవలు గత పదేళ్ళుగా కార్పొరేట్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. దీనికి అవసరమైన నిధుల్లో 5 శాతం రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తోంది. మిగిలిన 5 శాతం మాత్రమే ప్రైవేటు సంస్థలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. నిధులు మాత్రం ప్రభుత్వానివి, పేరు మాత్రం ప్రైవేటు సంస్థలకు. అంటే 'సొమ్మొకడిది-సోకొకడిది' అన్నట్లుంది. పేదసాదల జన జీవనం అస్థిరత్వంలోకి నెట్టబడుతోంది. సామాజిక వాదులు, అభ్యుదయగాముకులు స్పందించాలి. కాకుల్ని కొట్టి గద్దలకేసే పాలకులపై 'పొలికేక' వేసేందుకు ప్రజా సైన్యాన్ని కదిలించేందుకు సన్నద్ధం కావాలి.
 - కె ఉమామహేశ్వరరావు 
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర కార్యదర్శి)