
నేతాజీ సుభాస్ చంద్రబోస్ ప్రమాద మరణంపై విభిన్న కథనాలకు సంబంధించిన 64 రహస్య ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే అంచనాతోనే ఆమె ఈ చర్య తీసుకున్నట్టు మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అదే విమర్శ చేశాయి. బెంగాలీలు నేతాజీని ఎంతగానో ప్రేమిస్తారు గనక వారి మనోభావాలు చూరగొనేందుకు దీదీ వేసిన తెలివైన ఎత్తుగడగా పత్రికలు అభివర్ణించాయి. అయితే ఆ ఫైళ్లలో కొత్తగా బయిటపడిన విషయాలు ఏమీ లేవని కూడా దాదాపు అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు. నేతాజీ బతికే ఉన్నాడన్న సందేహాన్ని వ్యక్తం చేసే బంధువుల లేఖలు, అమెరికా, బ్రిటన్ గూఢచారి సంస్థల అనుమానాలు మాత్రమే ఈ ఫైళ్లలో ఉన్నాయి. అయితే ఇక స్వతంత్ర భారత దేశపు తొలి ప్రభుత్వమైన నెహ్రూ సర్కారు నేతాజీ కుటుంబంపై నిఘా తీవ్రస్థాయిలోనే సాగించి నట్టు నిరూపించే ఆధారాలను ఈ ఫైళ్లు బయిటపెట్టాయి. అందువల్ల ఈ ఫైళ్ల విడు దల హడావుడితో పోలిస్తే ఫలితాలు పెద్దగా కనిపించవు. ఈ పైళ్లను చూసిన తర్వాత కూడా నేతాజీ ప్రమాదంలో మరణించలేదని చెప్పడానికి ఎలాటి ఆధారాలూ దొరకలేదని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపి అయిన నేతాజీ మేనకోడలు కృష్ణబోస్ వ్యాఖ్యానించారు. ప్రమాద వార్తల తర్వాత కూడా ఆయన బతికి ఉన్నాడని చెప్పే ఆధారాలు ఏవైనా చూపిస్తే అప్పుడు నమ్ముతానని ఆమె అన్నారు. వాస్తవానికి బతికి ఉన్నాడని అనుకున్నవారి లేఖలు, కథనాలు మాత్రమే ఇందులో ఉన్నాయి తప్ప అందుకు ఆధారాలు లేనేలేవు. బ్యాంకాక్ నుంచి ఒక ప్రసార వ్యవస్థలో మాట్లాడాడని కొందరు రాస్తే, పెకింగ్ రేడియో నుంచి రోజూ నేతాజీ మాట్లాడతాడని సాయింత్రం ఒక వాక్యం వినిపించేదని ఆయన బంధువు శిశిర్ బోస్ అప్పట్లో చెప్పారు. 1949లో బ్లిట్జ్ పత్రిక ఆయన బతికేవున్నట్టు అనుమానం వెలిబుచ్చుతూ ప్రచురించిన కథనం మరొకటి. నిజానికి బ్లిట్జ్ ఆ నాటికి చాలా నిరాధార సంచలనాలకు పెట్టింది పేరు. తనకు నిర్దిష్టమైన ఆధారాలేమీ దొరకలేదని కూడా బ్లిట్జ్ నివేదికలో ఉంది. కనుక మొత్తంపైన ఇవన్నీ కథనాలు, ఊహాగానాలే. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇదమిత్థంగా ఫలానా వారు ఆయనను చూసినట్టు లేదా ఫలానా చోట ఉన్నట్టు చెప్పేవి కావు. కనుకనే 12 వేల పేజీలకు పైగా ఉన్న 64 ఫైళ్లను విడుదల చేసిన తర్వాత కూడా నూతన సమాచారం పెద్దగా బయిటకు రాలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.
భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు ఉన్నా దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్ చంద్రబోస్ ఒక్కరే. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వాన్ని ధిక్కరించి నిలదొక్కుకున్న నేత ఆయన. బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఐసిఎస్ చదివి కూడా అన్నీ వదులుకుని స్వాతంత్య్ర పోరాటంలో దూకారు. గాంధీజీ విధానాలతో విభేదించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయనకు కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయ వాదుల మద్దతు లభించడం అందుకు కారణమైంది. అయితే ఆ విజయం తర్వాత ఆగ్రహించిన గాంధీజీ కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించడంతో సుభాస్ బోస్ రాజీనామా చేసి బయిటపడ్డారు. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. 1940లలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీకి బ్రిటన్ శత్రు దేశం గనక ఆ దేశం సహాయంతో భారతదేశాన్ని విముక్తి చేయొచ్చని ఒక అవాస్తవమైన ఆలోచనచేసి హిట్లర్‌తో చేతులు కలిపారు. నక్క జిత్తులకు మారుపేరైన నాజీ హిట్లర్ తన దగ్గరున్న భారతీయ ఖైదీలను బోసుకు అప్పగించారు. వారితో రెండవ ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఎ) ఏర్పడింది. అంతకు ముందే జపాన్ సహాయంతో ఏర్పడిన మొదటి ఐఎన్‌ఎ కొంత నీరసపడి ఉంటే దానికి కొత్త ప్రాణం పోశారు. ఇంకా అనేక మంది దేశభక్తులను చేర్చు కున్నారు. ఆగేయాసియాలోని సింగపూర్‌లో స్థావరం ఏర్పాటు చేసుకుని బ్రిటన్‌పై పోరాడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో 1945 ఆగష్టు 18న విమానంలో బయిలుదేరిన నేతాజీ పార్మోజా దీవి(ఇప్పటి తైవాన్)లో మరణించారు. జపాన్‌కు చెందిన తనోషీ యోషీమా నాయకత్వంలోని సైనిక వైద్య బృందం అన్ని పరీక్షలు జరిపి మరణించినట్టు ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు నిర్వహించి చితాబ óస్మాన్ని భద్రపర్చారు.
అయితే ఆ ప్రమాదంలో ఆయన మరణించలేదనీ, ఉత్తరప్రదేశ్ దగ్గర సాధువు రూపంలో జీవించి ఉన్నారని అప్పట్లో ఒక వదంతి బయిలుదేరింది. నేతాజీ సహాయకుడైన ఉత్తమచంద్ మల్హోత్రా ఆయనను గుర్తించాడని చెబు తుంటారు. ఆ సాధువు ఎప్పుడూ బయిటకు వచ్చేవాడుకాదనీ, ఏదో నిగూఢంగా ప్రవర్తించేవాడని ఏవేవో కథనాలు... గాంధీజీ అంత్యక్రియలకు హాజరైనాడని మరో కథనం... ఇదంతా తెలిసి కూడా మొదటి ప్రధాని నెహ్రూ కావాలనే ఈ విషయంలో ఆసక్తి చూపకుండా తొక్కిపడుతున్నాడని ఆరోపణలు. తాను రష్యాలో ఉన్నాననీ, తప్పించుకోవడానికి సహాయపడాలనీ నేతాజీ రాసిన లేఖకు కూడా నెహ్రూ స్పందించలేదనేంత వరకూ ఈ ఆరోపణలు వెళ్లాయి. దీనిపై నెహ్రూ ప్రభుత్వం 1956లో షా నవాజ్ కమిషన్‌ను నియమించింది. విస్తృతంగా విచారణలు జరిపిన మీదట ఆ కమిషన్ నేతాజీ మరణించాడని నిర్ధారించింది. తర్వాత కూడా ఈ ప్రచారాలు ఆగకపోవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970లో జస్టిస్ ఖోస్లా కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ కూడా అనేక మందిని విచారించి, అనేక పర్యటనలు జరిపి నేతాజీ మరణించినట్టు నిర్ధారించింది. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంటు సభ్యుడైన సమర్ గుహా నేతాజీ బతికి ఉన్నట్టు ఒక చిత్రం విడుదల చేశారు. అది ఆయన సోదరుడైన శరత్ చంద్రబోసుదని బెంగాలీ పత్రికలు పోలి కలతో సహా ప్రక టించాయి. ఆ తర్వాతి కాలంలో నేతాజీ చితాభస్మం తెప్పించి నదుల్లో విలీనం చేశారు. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 1999లో జస్టిస్ ఎంఎస్ ముఖర్జీ కమిషన్‌ను నియమించినా వారు కూడా తేల్చిందేమీ లేకపోయింది. ముఖర్జీ కమిషన్ నేతాజీ ఆ రోజున విమాన ప్రమాదంలో మరణించలేదని, అయితే సరిగ్గా ఏం జరిగిందనేది చెప్పడానికి ఆధారాలు లేవని నివేదించింది. దీని ఆధారంగానే ఆయన మరణించాడనే భావిస్తున్నట్టు 2013లో ప్రభుత్వమే 7వ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక వ్యూహాత్మకంగా దీనిపై రెండు ఫైళ్లు బయిటకు వదిలారు. వాటి ఆధారంగా కొన్ని ఇంగ్లీషు పత్రికలు రాసిన కథనాల్లో నేతాజీ సహాయకుడైన సత్యనారాయణ్ సిన్హాతో మరెవరో ఆయనను చూసినట్టు చెప్పారని ఉంది. సారాంశం చెప్పుకోవాలంటే విమాన ప్రమాదం తర్వాత సోవియట్ ప్రభుత్వం నేతాజీని సైబీరియాలో ఒక ఖైదులో ఉంచిందట. అది కూడా ప్రపంచంలో అతి శీతలమైన యాకుత్సులో 45వ జైలు గదిలో స్టాలిన్ ఆయనను బంధించాడట. అక్కడ ఆయనను చూసి నట్టు కోజ్లోవ్ అనే గూఢచారి తనకు చెప్పాడని డాక్టర్ సత్యనారా యణ సిన్హా అనే మాజీ ఎంపి ఖోస్లా కమిషన్‌కు చెప్పినా దానికి తగిన విలువ ఇవ్వకుండా దాటేశారట. ఈ సిన్హా ఆ రోజుల్లో ఎలాగో సోవియట్‌లో ప్రవేశించి వారి సైన్యంలో పనిచేసిన సందర్భంలో ఇదంతా జరిగిందనేది కథనం. ఈ సిన్హా నెహ్రూ తరపున అంతర్జాతీయ బృందాలలో పనిచేసేవాడు. ఈ విషయాలు తాను నెహ్రూకు చెబితే పెద్ద విలువ ఇవ్వలేదనీ, అంతా అమెరికా ప్రచారమై ఉంటుందని తోసిపారేశాడనీ సిన్హా ఖోస్లా కమిషన్‌కు చెప్పాడు.. ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్టు నేతాజీ సంబంధం పెట్టుకున్న జర్మనీ, జపాన్ గాక నాటి సోవియట్ యూనియన్‌ను, దాని అధినేత స్టాలిన్‌ను ఈ వ్యవహారంలో దోషిగా చూపించే ప్రయత్నం కుత్సితమైంది. ఆనాడు ప్రపంచంలో తిరుగులేని నాయకుడుగా ఉన్న స్టాలిన్‌కు నేతాజీ వంటి అనధికార నేత పట్ల అంత ఆసక్తి ప్రదర్శించే అవసరమే ఉండదు. పైగా ఆ రోజుల్లో సోవియట్ యూని యన్‌కు నెహ్రూ ప్రభుత్వం పట్ల పెద్ద సదభిప్రాయం లేదు. అప్పటికింకా ఆ ప్రభుత్వం బ్రిటిష్ అనుకూల విధానాలను అనుసరిస్తుండడమే అందుకు కారణం. ఇప్పుడు ఈ వ్యవహా రంలోకి చైనాను కూడా లాగి ఉత్తుత్తి ప్రమాదం తర్వాత ఆయన చైనా వెళ్లారని, మావో నడిపించిన విప్లవ పోరాటంలో పాల్గొన్నారని సరికొత్త ఊహాగానాలు వదులుతున్నారు.. వినడానికి ఎంత ఆసక్తి, కుతూహలం కలిగించినా నేతాజీ మరణానికి సంబంధించిన ఈ కథనాలను విమర్శనాత్మకంగా చూడకతప్పదు. నేతాజీ మనవడు కృష్ణబోస్ కుమారుడు సాగత్ రారు తృణమూల్ ఎంపిగా ఉన్నారు. నేతాజీ మరణించాడనే ఆయన గట్టిగా నమ్మడమే గాక ఈ పునర్విచారణ తతంగాలన్నిటినీ ఖండిస్తున్నారు. ఇది చాలా తక్షణ సమస్య గనక వెంటనే విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ మధ్యనే తోసిపుచ్చిందంటే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. 1997లో నేతాజీ శతజయంతి సందర్భంలోనే వామపక్ష ప్రభుత్వ హయాంలో బెంగాల్ శాసనసభ ఈ ఫైళ్లను బయిటపెట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది. కానీ తర్వాత కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు అందుకు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం తమదైన సైద్ధాంతిక కోణంలో కమ్యూనిస్టు వ్యతిరేకత జోడించి ఫైళ్ల హడావుడి ప్రారంభించారు. కేంద్రం కూడా తన దగ్గరున్న ఫైళ్లను బయిటపెడితే ఇలాటి వ్యర్థ వివాదాలకు ఒక్కసారితో స్వస్తి చెప్పొచ్చు. హిట్లర్‌తో చేతులు కలపడం సరికాదని ఆ రోజుల్లో నేతాజీని విమర్శించినప్పటికీ ఆయన దేశభక్తి పట్ల కమ్యూనిస్టులకు పూర్తి గౌరవం ఉంది. వామపక్ష ప్రభుత్వం ప్రతి ఏటా ఆయన సంస్మరణ నిర్వహించేది కూడా. ఆయనపై ఉన్న గౌరవాన్ని, కట్టుకథలనూ వేరు వేరుగా చూడటం మంచిది. గాంధీజీ హత్య కేసులో గాడ్సేను సమర్థిస్తున్న వారు ఈ విధంగా నేతాజీ విషయంలో లేనిపోని రభస సృష్టించడం, అటు నెహ్రూపై, ఇటు కమ్యూనిస్టులపై కుట్ర ఆరోపణలు చేయడం చూస్తుంటే దీనికి సంఘ పరివార్ భావజాలానికి బంధం సుస్పష్టం. నెమ్మదిగా నెహ్రూ, గాంధీ వారసత్వాన్ని తగ్గించి తమ నాయకులతో నింపాలన్నది బిజెపి ఆలోచన కాగా బెంగాల్ ఎన్నికలలో ఉపయోగించుకోవాలన్నది మమత వ్యూహంలో మతలబు.
- తెలకపల్లి రవి