నేడు సిఎం కార్యాలయం ముట్టడి

మున్సిపల్‌ కార్మికుల విషయంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా నేడు విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల జెఎసి ప్రకటించింది. రాష్ట్రంలో ఏడురోజులుగా సమ్మె కొనసాగుతున్నా పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య చీలికతెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెఎసి నాయకులు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు, దశరధరామరాజు, వెంకటరత్ననాయుడు, వై.వి.రమణ, వి.రవికుమార్‌, ఎస్‌.శంకరరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు ఇతర ప్రజాప్రతినిధులు వీధిరౌడీల్లా వ్యవహరిస్తూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. అక్రమ అరెస్టులు చేయిస్తూ నిర్భందాన్ని సాగిస్తున్నారని, ఆరునెలలుగా పేరుకుపోయిన సమస్యలనూ పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనికి నిరసనగా శుక్రవారం సిఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ జెఎసి నాయకులు వివరించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.