నేడు రాజమండ్రిలో కేబినెట్ సమావేశం

ఏపీ మంత్రిమండలి సమావేశం రాజమండ్రిలో బుధవారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వేదికగా మారింది.  మంగళవారం రాత్రికే మంత్రులు, సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో సహా సీనియర్‌ ఐఎఎ్‌సలంతా రాజమండ్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం పది గంటలకు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించి.. ఆమోదించనున్నారు. మరికొన్ని కీలకాంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో రాజమండ్రి అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై దృష్టిసారించాలని యోచిస్తున్నారు. వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న రాజమండ్రిని రాష్ట్రంలో కీలక నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచీ చెబుతున్నారు.