నేటి నుండి మున్సిపల్‌ సమ్మె

మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 9వ తేదీ అర్ధరాత్రి నుండి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మె బాట పట్టనున్నట్లు మున్సిపల్‌ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(జెఎసి) నాయకులు తెలిపారు. పాతబస్తీలోని ఎఐటియుసి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ వర్కర్ల యూనియన్‌(ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రంగనాయకులు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డేవిడ్‌, ఇతర జెఎసి నాయకులు సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగనాయకులు, డేవిడ్‌ మాట్లాడుతూ, మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యలు వినేందుకు కూడా మంత్రి నారాయణకు తీరికలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలపై చర్చించేందుకు కార్మిక సంఘాలను పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అభ్యర్థన మేరకు ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుండి జరగాల్సిన సమ్మెను రెండు రోజుల పాటు వాయిదా వేయడం జరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 9వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మందికి పైగా ఉన్న పారిశుధ్య, ఇతర విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెబాట పడుతున్నారన్నారు. విజయవాడ నగరంలో ఐదు వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారని తెలిపారు. ఈ నెలలో జరుగనున్న గోదావరి పుష్కరాల విధులను సైతం కార్మికులు బహిష్కరిస్తారన్నారు. కనీస వేతనం, ఇతర సమస్యల పరిష్కార క్రమంలో కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చినందున ప్రజలు సహకరించాలని కోరారు.