ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గత ఒకటో తేదీ నుంచి కొనసాగిన సిపిఎం ప్రచారాం దోళన శుక్రవారం కలెక్టరేట్లు, తహశీలుదార్లు, మున్సిపల్ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాలతో పరాకాష్టకు చేరింది. ఉదయం నుంచే సిపిఎం శ్రేణులు, ప్రజలు ఆయా రెవెన్యూ కార్యాలయాలకు చేరుకొని సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. అధి కారులకు వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, రాష్ట్రకమిటీ సభ్యులు, ఆయా జిల్లాల కార్యదర్శులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వివరించారు. బడ్జెట్ సమావేశాలలోపు ప్రజాసమస్యలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడిస్తామని పి.మధు నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో హెచ్చరించారు.