నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని లోక్‌సభ స్పీకరు సుమిత్రా మహజన్ ప్రతిపాదించారు. ప్రస్తుత పార్లమెంటు ఆవరణలో కానీ, లేదా రాజ్‌పథ్ మార్గానికి ఆనుకుని ఢిల్లీ పోలీసు భద్రతా కార్యాలయమున్న ప్రాంతంలోగానీ నిర్మించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో స్పీకర్ పేర్కొన్నారు. లక్నోలో నిర్వహించిన భారత్ శాసనసభాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ 1927లో అప్పటి అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన 88 ఏళ్ల నాటి ఈ భవనం సభావ్యవహారాలకు ఇక ఎంతమాత్రమూ సరిపోదని తెలియజేశారు.