నీతి బాహ్య రాజకీయాలు- నిరర్థక వివాదాలు

ఓటుకు కోట్ల కేసు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఈ సందర్భంగానూ, అంతకు ముందూ కూడా కేంద్రం నుంచి ఏవో నాటకీయ ఆదేశాలు అందుతాయని, సంచలన పరిణామాలు కలుగుతాయని కథలు చెప్పిన వారికి నిరాశే మిగిలింది. గవర్నర్‌ పర్యటనకు చాలా రోజుల ముందు నుంచి కేంద్ర హోం శాఖ ఆదేశాల పేరిట చాలా కథనాలు వచ్చాయి. అటార్నీ జనరల్‌ సలహా పేరిట మరికొన్ని కథనాలు కాలక్షేపం ఇచ్చాయి. అసలు కేంద్రం ఆగ్రహించిన మీదట ఉభయ రాష్ట్రాలూ వివాదాన్ని వెనక్కు పెట్టేశాయని కొందరు మీడియాధిపతులు భాష్యాలు చెప్పారు. ఇంతా అయ్యాక చూస్తే ఇటు ఫోరెన్సిక్‌ లాబరెటరీ నివేదిక, అటు ఎన్నికల సంఘ ప్రవేశం, మరో వైపు కోర్టులో పోటాపోటీ వాదనలు, ట్యాపింగ్‌పై ఎపి ప్రభుత్వ సిట్‌ దర్యాప్తులు అన్నీ షరా మామూలుగానే నడుస్తున్నాయి. ఇన్నిటి మధ్యనా సెక్షన్‌ 8 వివాదగ్రస్తమై పోవడమే గాక పులి మీద పుట్రలా పదవ షెడ్యూలు కూడా పంతాల, పట్టింపులకు ఆలవాలమైంది.
పాత పలుకుల పునరావృతం
రేవంత్‌ రెడ్డి కేసులో చంద్రబాబు పేరిట టేపు ప్రసారమైన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హడావుడి తీవ్రమైంది. ఆ ఊపులో ట్యాపింగ్‌ ఆరోపణలు చేయడంతో పాటు వాటిని నిరూపించేందుకు దర్యాప్తు ప్రారంభించింది. అదలా నడుస్తుండగానే సెక్షన్‌ 8 అమలుకు సంబంధించిన చర్చ ముమ్మరం చేసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం, అంతకు మించి దానికి సంబంధించిన కొందరు నాయకులు అమలును సహించబోమని హెచ్చరికలు మొదలు పెట్టారు. శాసనసభ్యుడు శ్రీనివాసగౌడ్‌, ఉద్యోగ నాయకుడు దేవీ ప్రసాద్‌ వంటివారి మాటలు వింటే ఒక్కసారిగా 2013కు ముందున్న ఉద్రిక్తత కనిపించింది. ఈ సమయం లోనే గవర్నర్‌ను కలసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా దానిపై అభ్యంతరాలు స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అంతేగాక దానిపై కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను సంప్రదిం చినట్టు వార్తలు వెలువడ్డాయి. అవసరమైతే ఢిల్లీలో నిరాహారదీక్ష కూడా చేస్తానన్నట్టు మరికొన్ని కథనాలు. మరో వైపున ఎపి మంత్రులు వరుసగా మీడియా గోష్టులు జరిపి ఎందుకు అమలు చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అన్ని భాగాలూ అమలైనప్పుడు సెక్షన్‌ 8కి ఎందుకు ఒప్పుకోవడం లేదని వాదించారు.
ఎందుకీ రభస?
ఇంతకూ సెక్షన్‌ 8పై ఏడాది తర్వాత ఇంతటి రభస ఎందుకు వచ్చింది? ఇంత కాలం అది ఏమైంది? అసలందులో ఏముంది? అనేవి కీలక ప్రశ్నలు. మామూలు భాషలో చెప్పుకుంటే హైదరాబాదు తెలంగాణలో భాగంగా రాజధానిగా ఉన్నప్పటికీ-గతంలోని సమైక్య రాష్ట్ర రాజధాని గనక-ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణం జరిగే లోగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు నుంచే పాలన సాగించాలి గనక ఉత్పన్నమైన ప్రత్యేక నిబంధనల సముదాయం అది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాల ప్రకారమే నడుచుకోవాలి. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికీ అదే సూత్రం వర్తిస్తుంది. అయితే అదనంగా మరో ప్రభుత్వం ఉంది. దానిపై మరో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేసే అవకాశముండదు. కనుక మధ్యంతర దశలో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడమే ఆ సెక్షన్‌ ఉద్దేశం. దాని ప్రకారం గవర్నర్‌ 1.భవనాల కేటాయింపు. 2 పౌరుల, ప్రధాన సంస్థల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ఆయనకు ఇద్దరు సలహాదార్లను నియమి స్తుంది. తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదిస్తూ దాని సలహాల మేరకు గవర్నర్‌ పనిచేస్తారు. అయితే ఎప్పుడైనా ఆయన గనక ఆ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తే అప్పుడు ఆయన విచక్షణాధికారమే అంతిమమవుతుంది.
ఈ సెక్షన్‌ ఇప్పటి వరకూ అమలు జరిగిందా, లేదా అంటే ఏదో మేరకు అమలు జరుగుతూనే ఉంది. భవనాల కేటాయింపు, వాహనాల కేటాయింపు వంటివి ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. (తెలంగాణకు కేటాయించిన వాటికి టిఎస్‌ అని ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ ఉండేట్టు చూసుకోకపోతే చాలా ఎబ్బెట్టుగా ఉంటుందని విభజనకు ముందే గవర్నర్‌ సంపాదకులతో జరిగిన ఇష్టాగోష్టిలో ఒకసారి అన్నారు.) ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులే గాక మంత్రులూ, ముఖ్యమంత్రులూ కూడా ఆయనతో తరచూ సమావేశమవుతున్నారు. నాగార్జున సాగర్‌ డ్యాంపై పోలీసుల ఘర్షణ, ఎన్జీవోల కార్యాలయంలో ఘర్షణ వంటివి జరిగినప్పుడు ఆయన సంబంధిత అధికా రులతో మాట్లా డారు. ముఖ్య మంత్రులతో నూ సంప్రదించారు. విద్యా సంబంధ మైన విషయాల పైనా ఇరు రాష్ట్రాల మంత్రులూ ఆయనతో సమావేశమై అవగాహనకు వచ్చారు. ఇవన్నీ స్థూలం గా సెక్షన్‌ 8 పరిధిలోవే.
వివాదాల వెనక
కాకపోతే అమలు కాని అంశం ఒకటుంది. ఈ సెక్షన్‌ అమలుకు నిబంధనల పేరిట కేంద్రం ఒక లేఖ రాసింది. అందులో పోలీసు కమిషనర్ల నియామకం వంటివి కూడా గవర్నర్‌ సలహాల మేరకు జరగాలన్నట్టు పేర్కొంది. దానిపై తెలంగాణ అభ్యంతరం తెల్పడంతో పక్కన పెట్టారు. దాన్ని ఉపసంహరించాలని ఆ ప్రభుత్వం గాని అమలు చేయాలని ఎపి ప్రభుత్వం గాని ఎప్పుడూ గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడు రాజకీయ ఇరకాటంలో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు దీన్ని పైకి తీశారు. తమ ప్రభుత్వాధినేతకే రక్షణ లేదు గనక స్వంత రాష్ట్ర పోలీసులను తెచ్చుకుంటామనీ, సరిగ్గా వారిపై ప్రతి వ్యూహ ప్రయోగం కోసం కెసిఆర్‌ ఆయన అనుయాయులు అసలా ఊసే ఒప్పుకోబోమని వాదించారు. చెప్పాలంటే ఇదంతా కృత్రిమమైన వ్యవహారం. పైగా ఈ క్రమంలో హైదరాబాదు శాంతిభద్రతలు పదే పదే చర్చకు రావడం రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమర్పించిన ఒక పత్రంలో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని రకాలైన ఒత్తిళ్లు, అపార్థాలు ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయాల్సినంత తీవ్ర పరిస్థితి హైదరాబాదులో లేదనేది వాస్తవం. ప్రధానంగా ఉద్యోగ కేంద్రాలలోనూ, అధికారుల బదలాయింపులోనూ, విద్యా సంస్థల పరీక్షలు, సీట్ల కేటాయింపులలోనూ, నీటి పంపిణీ లోనూ వివాదాలు వచ్చిన మాట, కొనసాగుతున్న మాట కాదనలేనిది. అయితే ఇందుకు బాధ్యత ప్రభుత్వాలది తప్ప ప్రజలది కాదు. వారి మధ్య ఘర్షణలు వచ్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ హేమా హేమీలంతా వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగం కోసం తెలంగాణకు చెందిన సంస్థలూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎటొచ్చి తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ల రాజకీయ వైరమే పరిస్థితిని ఉద్రిక్తం చేసింది. ఓటుకు కోట్ల కేసులో నిజానిజాలు వేగంగా వెల్లడించే బదులు దాన్ని ఎపి ప్రజలందరి సమస్యగా చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పావులు కదిపింది. గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల కోణంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కూడా అందుకు తగినట్టే స్పందించింది. సెక్షన్‌ 8ని గుర్తిస్తాము గాని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని తెలంగాణ సర్కారు అంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదా అని నిర్ణయించు కోవలసింది గవర్నరే. ఇక ఎపి విషయానికి వస్తే ఈ సెక్షన్‌లో దాని ప్రస్తావనే లేదు. గవర్నర్‌ సంప్రదించాల్సింది తెలంగాణ సర్కారును తప్ప ఎపిని కాదు. కాకపోతే ఏమైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే స్వీకరించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
కేంద్ర బిజెపి పాత్ర
ఈ తతంగంలో కనిపించిన మూడవ ముఖ్య పాత్ర కేంద్రానికి. బిజెపిదీ. అకారణ వివాదాలలో జోక్యం చేసుకుని పరిష్కరించడం, అవసరమైన వివరణ ఇవ్వడం ఒక్కరోజు కూడా కేంద్రం నుంచి జరిగింది లేదు. పైకి సూక్తులు చెబుతూ లోలోపల తన రాజకీయ వ్యూహాలు నెరవేర్చుకోవడానికి బిజెపి పొంచి చూస్తున్నట్టనిపిస్తుంది. వాస్తవానికి బిజెపి, కాంగ్రెస్‌ కూడా రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతూ సహజ నైజం ప్రదర్శిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నందున బాధ్యతగా ఉండాల్సింది పోయి వ్యర్థ వివాదాలు ముదరడానికి తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు కమల దళాధిపతులు. మధ్య మధ్య ఉభయులతో మంచిగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంటారు. ఇప్పుడు గవర్నర్‌ పర్యటన సమయంలోనూ కేంద్రం అధికారికంగా ఏమీ చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం తగదని ఎక్కడ లేని సమాఖ్య స్ఫూర్తి చూపిస్తున్న మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఎంత బాహాటంగా తలదూర్చిందీ ఎవరికి తెలియదు? మిగిలిన విషయాలు అలా ఉంచి నదీ జలాల పంపిణీ వంటివి ఎవరు వేగవంతం చేయాలి? ఉన్నత విద్యా సంస్థల స్థాపన, అధికారుల కేటాయింపులు పూర్తి కాకపోవడానికి కారకులెవరు?
ఇవన్నీ చాలక ఇప్పుడు పదవ షెడ్యూలులోని సంస్థలు వివాదగ్రస్తమై కూచున్నాయి. భౌగోళిక సూత్రం ప్రకారం ఇవన్నీ తమకు చెందుతాయన్న వైఖరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. ఉన్నత విద్యా మండలిపై తీర్పు ఇందుకు దృష్టాంతంగా చెబుతున్నది.
వాస్తవానికి విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం తమ హక్కుల పరిరక్షణ కోసం వేగంగా కదలాల్సిన ఎపి ప్రభుత్వం బాగా నిర్లిప్తంగా ఉండిపోయింది. వివాదాలు ముదిరాకే కోర్టులను ఆశ్రయించింది. ఏడాదిలోగా తన వంతు సంస్థలను ఏర్పాటు చేసుకుని ఉంటే నిధులలో వాటా తీసుకోవడం సులభమై ఉండేది. తమ సేవలు అభ్యర్థిస్తే అందిస్తామని, నిధులు ఏ ఖాతాకు తరలించాలో తెలియడం లేదని తెలంగాణ అంటు న్నది. కేంద్రం అసలే చేతులెత్తేసింది. మొత్తం వందకు పైబడిన సంస్థలలో 25-30 తప్ప మిగిలిన వాటిపై తనకు ఆసక్తి లేదని ఎపి ప్రభుత్వ ముఖ్యులు పరోక్షం గా చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక హేతు బద్ధమైన పరిష్కారం కోసం కృషి చేయడం ఉభయ రాష్ట్రాలకూ మంచిది. అందుకు రంగం సిద్ధం చేయవలసింది కేంద్రమే గాని వారి ఆలోచన వేరుగా ఉంది.
ఇప్పుడు రేవంత్‌ కేసు గాని, ఎపిలో సిట్‌ దర్యాప్తు గాని ఏ విధమైన పరిణామాలకు దారితీసేదీ ఇప్పుడెవరూ చెప్పగలిగింది కాదు. కాకపోతే జరిగిన మేరకు తెలుగుదేశంకు రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలిందనేది నిజం. ఇక చంద్రబాబుకు కూడా ఏ విధమైన తాఖీదులందినా మరింత నష్టం తప్పదు. ఎన్నికల సంఘం కూడా దీన్ని రాజకీయ అవినీతిగా పేర్కొంది గనక అనివార్యంగా తీవ్ర పర్యవసానాలే ఉండొచ్చు. తర్వాత ఆయన ఎలా ఎదుర్కొంటారు, తప్పించుకుంటారనేది వేరే విషయం. కానీ సెక్షన్‌ 8, షెడ్యూలు 10 వంటి విషయాలు దాంతో నిమిత్తం లేకుండా రాజ్యాంగబద్ధంగా సామరస్యంగా పరిష్కారం కావాలని అందరూ కోరుకోవాలి.
- తెలకపల్లి రవి